World's Tallest Bridge (Image Source: Twitter)
Viral

World’s Tallest Bridge: ప్రపంచంలోనే ఎత్తైన వంతెన.. 2 గంటల ప్రయాణం.. ఇకపై 2 నిమిషాల్లోనే!

World’s Tallest Bridge: ప్రపంచంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. వరల్డ్ లోనే అత్యంత ఎత్తైన వంతెనను చైనా ప్రారంభించింది. గుయిజ్హౌ ప్రావిన్స్ లో నిర్మించిన హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ వంతెన (Huajiang Canyon Bridge) ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. భూ ఉపరితలం నుంచి దాదాపు 625 మీటర్ల ఎత్తులో ఈ వంతెనను నిర్మించారు. ఇంత ఎత్తైన బ్రిడ్జి ప్రపంచంలో ఇదొక్కటే కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ వంతెనకు సంబంధించిన విశేషాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

బిపాన్ నదిపై..

హువాజియాంగ్ కెన్యాన్ వంతెన.. సెప్టెంబర్ 28న అందుబాటులోకి వచ్చింది. గుయిజ్హౌ ప్రావిన్స్ లోని S57 ఎక్స్‌ప్రెస్‌వే లో భాగంగా దీనిని రూపొందించారు. బిపాన్ నది (Beipan River)పై 625 మీటర్ల ఎత్తులో రూపొందిన ఈ బ్రిడ్జి.. లియుజి – అన్‌లాంగ్ ప్రాంతాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తుంది. ఈ వంతెన నిర్మాణానికి ముందు లియుజి నుంచి అన్ లాంగ్ చేరుకోవడానికి దాదాపు 2 గంటల సమయం పట్టేది. హువాజియాంగ్ వంతెన అందుబాటులోకి రావడంతో కేవలం 2 నిమిషాల్లోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంలోకి చేరుకునే వెసులుబాటు ఏర్పడినట్లు చైనా అధికారులు తెలియజేస్తున్నారు.

ఆకట్టుకుంటోన్న డ్రోన్ విజువల్స్

ఎత్తైన వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా దానికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ ను చైనా ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. మేఘాల నడుమ రెండు కొండలను అనుసంధానం చేస్తూ నీలి రంగులో వంతెన ప్రకాశించడం వీడియోలో చూడవచ్చు. వంతెనపై నుంచి వాహనాలు ప్రయాణించడం చూపరులకు మంచి అనుభూతిని పంచింది. కాగా ఈ వంతెన మెుత్తం పొడవు 2,890 మీటర్లుగా ఉంది.

వంతెనకు కఠిన పరీక్షలు

ప్రారంభోత్సవానికి ముందు ఈ వంతెన సామర్థ్యం తెలుసుకునేందుకు కఠిన పరీక్షలను చైనా అధికారులు నిర్వహించారు. గత నెలలో ఏకంగా 96 ట్రక్కులను వంతెనపై ఏర్పాటు చేసి.. కృత్రిమంగా ట్రాఫిక్ సమస్యను సృష్టించారు. 400 పైగా సెన్సార్లను ప్రధాన స్పాన్, టవర్లు, కేబుల్స్, సస్పెండర్లపై ఏర్పాటు చేసి చిన్న చిన్న కదలికలను సైతం గమనించారు. రాకపోకలకు బ్రిడ్జి సురక్షితంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభోత్సవానికి సంబంధించిన పనులను ముమ్మరం చేశారు.

రెండు ప్రతిష్టాత్మక రికార్డులు

హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ వంతెన ఇప్పటికే రెండు ప్రతిష్టాత్మక రికార్డులను అందుకుంది. ప్రపంచంలోనే ఎత్తైన వంతెనగా గుర్తింపు పొందడంతో పాటు పర్వతప్రాంతంలో నిర్మించిన అతి పెద్ద స్పాన్ వంతెనగానూ అరుదైన ఘనతను సాధించింది. ఈ వంతెన రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా.. పర్యాటకంగానూ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చైనా అధికారులు పేర్కొంటున్నారు. వంతెనపై ఏర్పాటు చేసిన 207 మీటర్ల ఎత్తైన సైట్ సీయింగ్ ఎలివేటర్.. కెఫేలు, వ్యూ పాయింట్స్, అందమైన లోయ ప్రాంతాలు వీక్షకులకు మరిచిపోలేని అనుభూతిని పంచుతాయని దీమా వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాణంలో అనేక సవాళ్లు

హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ వంతెన నిర్మాణంలో ఇంజనీర్లు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ప్రాజెక్ట్ మేనేజర్ వూ జావోమింగ్.. వంతెన నిర్మాణంలో ఎదురైన కఠిన పరిస్థితుల గురించి తెలియజేశారు. భారీ ఎత్తులో నిర్మిస్తున్నందున బలమైన గాలులు.. తమను ఇబ్బందులకు గురిచేసినట్లు చెప్పారు. అన్ని అడ్డంకులను దాటుకొని షెడ్యూల్ ప్రకారమే వంతెనను పూర్తి చేయగలిగినట్లు స్పష్టం చేశారు. కాగా, ప్రపంచంలో టాప్-10 ఎత్తైన వంతెనల్లో 8 చైనాలోనే ఉండటం విశేషం. అది కూడా గుయిజ్హౌ ప్రావిన్స్ లో ఉండటం గమనార్హం.

Just In

01

Local Body Elections: నాగర్ కర్నూల్ జిల్లాలో స్థానిక ఎన్నికల సందడి.. ఆశావాహుల్లో మెుదలైన టెన్షన్!

Maa Mundeshwari Temple: దేశంలోనే వింతైన ఆలయం.. మేకను బలిస్తారు కానీ.. ఒక్క చుక్క రక్తం కారదు!

The Raja Saab Trailer: ప్రభాస్ భయపెట్టడానికి వచ్చేశాడు రోయ్.. చూసేద్ధాం రండీ..

Jogulamba Temple: జోగులాంబ సన్నిధిలో మంత్రి కొండా సురేఖ

Crime News: చికెన్ కూర కావాలని అడిగినందుకు.. 7 ఏళ్ల కుమారుడ్ని కొట్టి చంపిన తల్లి