Team India: టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో చివరికి భారత్ ఆరు పరుగుల తేడాతో గెలిచింది. వరల్డ్ క్లాస్ బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియా బ్యాట్స్‌మెన్ ఈ మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో రాణించకున్నా.. బౌలర్లు మ్యాచ్‌ను చేజారిపోనివ్వలేదు. 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడారు. ఈ విజయంతో టీమిండియా అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. పాకిస్తాన్‌పై గెలుపే కాదు.. మరో రికార్డును కూడా భారత్ తిరగరాసింది.
టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో ఒక ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. ఆదివారం ఆరు పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై భారత్ గెలిచింది. పాక్‌పై భారత్‌కు ఇది ఏడో విజయం. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఒక ప్రత్యర్థిపై ఇన్ని విజయాలు నమోదు చేసిన జట్టు లేనేలేదు. ఇప్పటి వరకు పాక్, ఇండియా 8 సార్లు తలపడగా.. టీమిండియా ఏడు విజయాలు నమోదు చేసింది. ఫస్ట్ టీ20 వరల్డ్ కప్ సిరీస్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ టై అవ్వగా.. బాల్ ఔట్ పద్ధతిలో భారత్ గెలిచింది. ఫైనల్లో భారత్ గెలిచి తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇక 2009లో వేర్వేరు గ్రూపుల్లో ఉండటంతో ఈ రెండు జట్లు తలపడలేదు. 2021 టీ20 వరల్డ్ కప్ సిరీస్‌లో భారత్‌ను పాక్ ఓడించింది. ఇది మినహా మిగిలిన ఏడు మ్యాచ్‌లలో భారత్ విజయఢంకా మోగించింది.