DGP Shivadher Reddy: యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ మహమ్మరిని అంతం చేయటం రకరకాలుగా కోట్లు కొల్లగొడుతున్న సైబర్ నేరాలకు కళ్లెం వేయటమే తన ప్రాధాన్యత అని కొత్త డీజీపీగా నియమితులైన శివధర్ రెడ్డి (DGP Shivadher Reddy) చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇక ముందు కూడా కొనసాగుతుందన్న ఆయన మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉన్నట్టు చెప్పారు. ఓ ప్రశ్నకు జవాబుగా నా టీం అంటూ ఎవ్వరూ ఉండరు…పని చేస్తున్న సిబ్బంది శక్తిసామర్థ్యాలను బట్టి వారి సేవలను వినియోగించుకుంటానన్నారు. డీజీపీగా తనకు బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి, (Revanth Reddy) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (CM Bhatti Vikramarka)తోపాటు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మరో రెండు రోజుల తరువాత తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న శివధర్ రెడ్డి ‘స్వేచ్ఛ’తో మాట్లాడారు.
ప్రభుత్వ లక్ష్య సాధనకు…
యువతను మత్తులో ముంచుతూ ఎన్నో కుటుంబాల్లో ఆరని చిచ్చును రగిలిస్తున్న డ్రగ్స్ భూతాన్ని ఉక్కుపాదంతో అణచి వేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)పలు సందర్భాల్లో పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మాదక ద్రవ్యాల దందా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన ఈ లక్ష్య సాధనకు అన్ని చర్యలు తీసుకుంటానని శివధర్ రెడ్డి చెప్పారు. డ్రగ్స్ దందా చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. ఈగల్ టీం, యాంటీ నార్కొటిక్ బ్యూరో, హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ ఈ దిశలో ఇప్పటికే ప్రశంసనీయమైన ఫలితాలను సాధించాయన్నారు. ఇక ముందు కూడా మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, దీని కోసం సిబ్బందికి అవసరమైన అన్ని మౌళిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు.
Also Read: TGSRTC: భారీ వర్షాల ఎఫెక్ట్.. ఎంజీబీఎస్‌లో రాకపోకలు బంద్.. ఆర్టీసీ కీలక ప్రకటన
ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలి
ప్రజలు కూడా తమ వంతు సహకారాన్ని అందించినపుడే డ్రగ్స్ దందాను సమూలంగా నిర్మూలించ వచ్చన్నారు. ఇక, రెండో ప్రధాన సమస్య సైబర్ క్రైమ్స్ అని వ్యాఖ్యానించారు. పటిష్టమైన పోలీసింగ్ నేపథ్యంలో సాంప్రదాయ నేరాలు తగ్గుముఖం పట్టినా సైబర్ నేరాలు ఏయేటికాయేడు గణనీయంగా పెరిగిపోతున్నట్టు చెప్పారు. సైబర్ క్రిమినల్స్ ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి మోసాలు చేస్తున్నారన్నారు. వీరి బారిన పడకుండా ఉండాలంటే మొదట ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. ఈ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. అదే సమయంలో సైబర్ క్రిమినల్స్ ను కటకటాల వెనక్కి పంపించటానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికై సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లు పదుల సంఖ్యలో కేసుల్లో సైబర్ మోసగాళ్లను అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. వారి నుంచి కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకుని డబ్బు పోగొట్టుకున్న బాధితులకు తిరిగి అప్పగించారన్నారు. ఇక ముందు కూడా సైబర్ క్రిమినల్స్ పై కఠిన చర్యలు కొనసాగుతాయని చెప్పారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్
ఇక ముందు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగుతుందని శివధర్ రెడ్డి చెప్పారు. అయితే, చట్టాలను పాటించే వారికి మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు…చట్టాలను ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఎలాంటి వేధింపులు ఎదురైనా మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదులు చేయాలని సూచించారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించినా నా టీం అంటూ ఏమీ ఉండదని శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. సిబ్బంది శక్తిసామర్థ్యాలను బట్టి వారి సేవలను ఉపయోగించుకుంటామన్నారు. తప్పితే ఆశ్రిత పక్షపాతం ఏమాత్రం ఉండదని చెప్పారు.
మావోయిస్టు పార్టీ ప్రభావం…
ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉందని శివధర్ రెడ్డి చెప్పారు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఆ పార్టీ ఉనికి అంతంత మాత్రంగానే మారిందన్నారు. కొత్తగా మావోయిస్టు పార్టీలో చేరటానికి ఎవ్వరూ ఆసక్తి కనబరచటం లేదని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి చెందిన దాదాపు డెబ్భయి మంది పార్టీలో వేర్వేరు హోదాల్లో ఉన్నట్టుగా సమాచారం ఉందన్నారు. వీళ్లు కూడా జనజీవన స్రవంతిలో కలిసేలా చూస్తామన్నారు. ఆయుధాలతో సాధించేది ఏమీ ఉండదన్న శివధర్ రెడ్డి సాధారణ జీవితం గడపటానికి ముందుకొచ్చే వారికి అన్నిరకాల సహాయ సహకారాలను అందిస్తామన్నారు.