Sonam Wangchuk: కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌కు రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ ఇటీవల లేహ్‌లో చెలరేగిన హింసకు ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) కారణమంటూ ఆరోపణలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. స్థానికులను ఆయనే రెచ్చగొట్టినట్టుగా కేంద్రప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో లడఖ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) ఎస్‌డీ సింగ్ జమ్‌వాల్ కీలక విషయాలు వెల్లడించారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా కోరుతూ నిరాహార దీక్ష చేపట్టిన ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్‌కు పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నాయని ఆరోపించారు. భారత పొరుగు దేశాల్లో ఆయన చేసిన పర్యటనలపై కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పారు.
పాకిస్థాన్ పీఐవోతో (పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్) వాంగ్‌చుక్‌కు సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారని జమ్‌వాల్ వెల్లడించారు. ఇటీవలే తాము ఒక పాకిస్థానీ పీఐవోను అరెస్ట్ చేశామని, అతడు ఐఎస్‌ఐకి సమాచారాన్ని చేరవేస్తున్నట్టుగా ఆధారాలు ఉన్నాయన్నారు. సోనం వాంగ్‌చుక్ పాకిస్థాన్‌లోని ‘డాన్’ మీడియా సంస్థ ఈవెంట్‌కు హాజరయ్యారని, ఆయన బంగ్లాదేశ్ కూడా వెళ్లారని మీడియాకు తెలిపారు. కాబట్టి, ఆయనపై చాలా అనుమానాలు ఉన్నాయని, ఈ అంశంపై విచారణ జరుపుతున్నామని డీజీపీ సింగ్ జమ్‌వాల్ వివరించారు. ఈ మేరకు లేహ్‌లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (NSA) కింద శుక్రవారం (సెప్టెంబర్ 27) నాడు వాంగ్‌చుక్‌ను అరెస్ట్ చేసిన భద్రతా బలగాలు, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించాయి.
Read Also- YSRCP: రికార్డుల నుంచి తొలగింపు కాదు.. సభలో క్షమాపణ చెప్పాలి.. బాలయ్య వివాదంపై వైసీపీ డిమాండ్
సెప్టెంబర్ 24న లేహ్‌లో జరిగిన అల్లర్లు, హింసను సోనం వాంగ్‌చుక్ ప్రేరేపించారని డీజీపీ ఆరోపించారు. సోనం వాంగ్‌చుక్ గతంలో కూడా ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని డీజీపీ జమ్‌వాల్ ప్రస్తావించారు. అరబ్ స్ప్రింగ్, నేపాల్, బంగ్లాదేశ్ ఆందోళనలను ప్రస్తావించి, జనాలను రెచ్చగొట్టాడని అన్నారు. ఆయనకు సంబంధించిన విదేశీ నిధుల (FCRA) నిబంధనల ఉల్లంఘన వ్యవహారంపై విచారణ జరుగుతోందని వివరించారు. లేహ్ అల్లర్లకు వెనుక విదేశీ హస్తం ఉందా? అని మీడియా ప్రశ్నించగా ఆయన స్పందించారు. ‘‘విచారణలో భాగంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం. వారు ఏదైనా కుట్రలో భాగంగా ఉన్నారా? అనేది ఇప్పటికైతే స్పష్టంగా చెప్పలేం. ఈ ప్రాంతంలో నేపాల్ వలస కార్మికులు పనిచేస్తారు. అందుకే, పూర్తి విచారణ జరగాలి’’ అని డీజీపీ జమ్‌వాల్ వివరించారు.
Read Also- OTT Movie: ప్రతీ ప్రేమకథ నిజంతో మొదలవుతుంది.. కానీ ఇక్కడ మాత్రం..
ఈ అల్లర్లకు వాంగ్‌చుక్ కారణమని ప్రభుత్వం కూడా ఆరోపిస్తోంది. ఆయన చేసిన రెచ్చగొట్టే ప్రకటనలు ఇందుకు కారణమయ్యాయని ప్రభుత్వవర్గాలు చెబుతున్నారు. అరబ్ స్ప్రింగ్, నేపాల్ జెన్ జెడ్ ఆందోళనల అంశాలను ప్రస్తావించి వాంగ్‌చుక్ ప్రజల్లో ఆగ్రహ, ఆవేశాలను రెచ్చగొట్టారని కేంద్ర హోంశాఖ చెబుతోంది. దీంతో, ఆందోళనకారులు లేహ్‌లోని బీజేపీ కార్యాలయం, కొన్ని ప్రభుత్వ వాహనాలను తగలబెట్టారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కాగా, లేహ్ హింసాత్మక ఘటనల్లో నలుగురు మృతి చెందగా, సుమారు 80 మందికి గాయాలయ్యాయి. ఆందోళనకారులు బీజేపీ కార్యాలయాన్ని, కొన్ని వాహనాలకు నిప్పంటించారు.