Act Into Force: డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చిన కేంద్రం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న 2023 డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి (Act Into Force) తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ఏదైనా సంస్థ పౌరుల వ్యక్తిగత డేటా, లేదా సమాచారాన్ని లీక్ చేస్తే భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అధికార వర్గాల ద్వారా తెలుస్తున్న ప్రకారం, ఇలాంటి ఉదంతాల్లో బాధ్యులైన సంస్థలకు 250 కోట్ల రూపాయల వరకు కూడా జరిమానా విధించవచ్చు. సైబర్ క్రిమినల్స్ చేస్తున్న నేరాలు ఊహించంత వేగంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే.
దాదాపు 35కు పైగా పద్దతుల్లో మోసాలు సాగిస్తున్న సైబర్ నేరగాళ్లు దేశవ్యాప్తంగా ఏటా వేల కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు. గత సంవత్సరం ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధి నుంచే సైబర్ క్రిమినల్స్ జనం నుంచి 700 కోట్ల రూపాయలకు పైగా లూటీ చేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే పౌరుల వ్యక్తిగత డిజిటల్ డేటాను సేకరించి సైబర్ మోసగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. దీనిపై సైబర్ సెక్యూరిటీ విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారితో మాట్లాడగా, సైబర్ క్రిమినల్స్ ఎక్కువగా ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, ఆధార్ కార్డు సెంటర్లు, పాన్ కార్డ్ సేవా కేంద్రాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద పని చేసే బ్రోకర్లు, వ్యాపార, వాణిజ్య సంస్థల నుంచి పౌరుల వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నట్టు చెప్పారు.
Read Also- Rain Updates: నార్సింగి-హిమాయత్‌సాగర్ మధ్య ప్రయాణించేవారికి బిగ్ అలర్ట్
పదివేల మంది డేటా ఇస్తే ఇంత… లక్షమందికి సంబంధించిన సమాచారం అందిస్తే ఇంత ఇస్తామంటూ రేటు నిర్ణయించి పేరు, మొబైల్, ఆధార్, పాన్ కార్డుల నెంబర్లు తీసుకుంటున్నారన్నారు. కొన్నిసార్లు మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ల సర్వర్లను హ్యాక్ చేసి డేటా చౌర్యానికి పాల్పడుతున్నారని వివరించారు. ఇటీవల గూగుల్ సంస్థ నుంచి కోట్లాది మందికి చెందిన సమాచారం చోరీకి గురవ్వడాన్ని ఉదహరించారు. ఇలా సేకరించిన సమాచారంతో వరుసగా నేరాలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. దీనికి నిదర్శనంగా ఈ మధ్య వరుసగా జరుగుతున్న ‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్ మోసాలను సదరు అధికారి ఉదహరించారు. తమ వద్ద ఉన్న డేటా ఆధారంగా వృద్ధులను టార్గెట్ చేస్తున్న సైబర్ క్రిమినల్స్ వేర్వేరు కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారుల పేరిట వాట్సప్ వీడియో కాల్స్ ద్వారా బెదిరిస్తూ కోట్లు కొల్లగొడుతూ వస్తున్నారన్నారు.
కళ్లెం వేయటానికి…
ఇలా, పెరిగి పోతున్న సైబర్ నేరాలకు కళ్లెం వేయటంతోపాటు పౌరుల డిజిటల్ సమాచారానికి కట్టుదిట్టమైన రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్‌కు రూపకల్పన చేసింది. నిజానికి ఈ చట్టం ఇంతకు ముందే అమల్లోకి రావాల్సి ఉంది. ఎట్టకేలకు అన్ని అడ్డంకులను అధిగమించి ఈ చట్టం తాజాగా అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఏదైనా సంస్థ ప్రజల నుంచి వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తే దానిని పకడ్భంధీగా భద్రపరిచాల్సిన బాధ్యత దానికే ఉంటుంది.
Read Also- Viral News:హెల్త్ బాలేక ఒక్క రోజు లీవ్ తీసుకున్న బ్యాంక్ ఉద్యోగికి హెచ్చార్ నుంచి అనూహ్య మెసేజ్
ఇక, వినియోగదారుని అనుమతి తీసుకోకుండా డేటాను తీసుకోవటం ఈ కొత్త చట్టం ప్రకారం నేరం. సమాచారాన్ని తీసుకోవాల్సి వస్తే దానికి కారణాలను స్పష్టంగా తెలియ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ తమ సర్వర్ నుంచి డేటా లీక్ అయినట్టు గమనిస్తే వెంటనే తాము సమాచారం తీసుకున్న ప్రతీ ఒక్కరిని అలర్ట్ చేయాలి. అలా కాకుండా సేకరించిన సమాచారం బయటకు వెళితే సదరు సంస్థకు 250 కోట్ల రూపాయల జరిమానా విధించ వచ్చు. సర్వర్ నుంచి డేటా లీక్ అయినపుడు తాము ఎవరెవరి సమాచారాన్ని తీసుకున్నారో వారిని అలర్ట్ చేయక పోతే 200 కోట్లున చిన్న పిల్లలకు సంబంధించిన డేటా లీక్ అయితే కారణమైన సంస్థకు 200 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా అమల్లోకి తీసుకు వచ్చిన ఈ చట్టాన్ని పకడ్భంధీగా అమలు చేయటానికి ఆయా రాష్ట్రాల్లో నోడల్ అధికారులను నియమిస్తున్నారు.