Viral News: స్టాఫ్ కొరత కారణంగా ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంటుంది. అధిక పనిభారంతో ఇబ్బంది పడుతుండడం దాదాపు అన్ని బ్యాంకుల బ్రాంచుల్లోనూ కనిపిస్తుంటుంది. రోజంతా కస్టమర్లకు సేవలు, టార్గెట్లతో బ్యాంకు ఉద్యోగులు బిజీబిజీ గడుపుతుంటారు. ఇక, సెలవులు అన్న మాట ఎత్తడానికి అవకాశం లేకుండా పోయిందని పలువురు వాపోతున్నారు. సెలవు తీసుకున్నా వివరణ ఇవ్వాల్సి వస్తోందని, క్రమశిక్షణా చర్యలతో బెదిరింపులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితికి అద్దం పట్టే ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి (Viral News) వచ్చింది.
ఆరోగ్యం బాలేక కేవలం ఒకే ఒక్క రోజు సెలవు తీసుకున్న ఓ ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగికి హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ నుంచి వార్నింగ్ ఈ-మెయిల్ వచ్చింది. ముందస్తు పర్మిషన్ లేకుండా సెలవు తీసుకోవడం అధికారిక నిబంధనలను అతిక్రమించడమేనని, క్రమశిక్షణా నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తున్నట్టు మెయిల్ సందేశంలో పేర్కొన్నారు. ఈ-మెయిల్‌కు మూడు రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు. లేదంటే, సరైన వివరణ ఇవ్వలేదని భావిస్తామంటూ హెచ్చార్ డిపార్ట్‌మెంట్ మేనేజర్ హెచ్చరించారు. ఈ తరహా ప్రవర్తన అధికారిక బాధ్యతల పట్ల నిర్లక్ష్యం వహించడంతో పాటు పరిపాలనా క్రమశిక్షణను అతిక్రమించినట్టే అవుతుందని హెచ్చార్ మేనేజర్ పేర్కొన్నారు. అస్సలు ఊహించని ఈ-మెయిల్‌ను సదరు ఉద్యోగి స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియా మాధ్యమం ‘రెడిట్’ వేదికగా షేర్ చేశాడు.
Read Also- Asteroid Collision 2025: ముంచుకొస్తున్న ముప్పు.. ఏ క్షణమైన భూమిని ఢీకొట్టనున్న గ్రహశకలం..!
అనారోగ్యం కారణంగా కేవలం ఒక్క రోజు సెలవు పెట్టినందుకు ఈ-మెయిల్ వచ్చిందంటూ సదరు ఉద్యోగి ఆశ్చర్యపోయాడు. ‘‘ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ లేనే లేదు’’ అని క్యాప్షన్‌తో తన బాధను వ్యక్తం చేశాడు. ‘‘ అనారోగ్యంతో ఒక్క రోజు సెలవు తీసుకున్నాను. అందుకు నన్ను ఇలా హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగం చాలా మేలు అని భావించేవాళ్లు ఒకసారి ఆలోచించండి మరి’’ అని సదరు ఉద్యోగి చెప్పాడు.
ఈ పోస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలలో సెలవుల విషయంలో కఠిన నియమాలు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లకు ప్రతిబింబంగా నిలిచింది. ఇదే తరహాలో మరో ప్రభుత్వ బ్యాంకుకు చెందిన ఉద్యోగి రెడిట్‌లో షేర్ చేసిన మరో పోస్ట్ కూడా వైరల్ అయ్యింది. తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటి కారణంగా ఉద్యోగాన్ని వదిలేయాల్సిన పరిస్థితిని సదురు వ్యక్తి వివరించాడు.
Read Also- ICC Hearing: ఐసీసీ విచారణకు పాక్ ప్లేయర్లు.. విరాట్ కోహ్లీ పేరు ప్రస్తావిస్తూ వివరణ
కాగా, పలు బ్యాంకుల్లో ఉద్యోగులు అనారోగ్య సమయాల్లోనూ విశ్రాంతి లేకుండా, డ్యూటీకి హాజరు కావాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో, శారీరక, మానసిక ఒత్తిడి వాతావరణంలో వాళ్లు పనిచేయాల్సి వస్తోంది. సరైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడంతో పేరుకు ప్రభుత్వ ఉద్యోగమే అయినా చాలామంది నిరాశతో బతుకుతున్నారు.