Jangaon Farmers: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో, చేస్తున్న చట్టాలతో పత్తి రైతుల ప్రాణాలను ఫణంగా పెడుతుందని, పత్తి రైతులు (Jangaon Farmers) ప్రాణాలు పోయినా కేంద్ర ప్రభుత్వానికి లెక్కలేదా అని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ ప్రశ్నించారు. జనగామ జిల్లా (Jangaon Farmers) బచ్చన్నపేట మండల కేంద్రంలోని గెస్ట్‌హౌజ్‌లో రైతు సంఘం రాష్ట్రంలో వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార మార్గాలు అనే అంశంపై సెమినార్ బెల్లంకొండ వెంకటేశ్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న శోభన్ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతుందని అన్నారు.
Also Read: Balmoor Venkat: కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదు.. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సంచలన కామెంట్స్
రూ.44438కోట్లు మాత్రమే రుణాలు
ఆర్బీఐ నిబంధనల ప్రకారం 18శాతం రుణాలు ఇస్తామని మాటిచ్చి 10శాత మాత్రమే రుణాలు ఇచ్చి బ్యాంకర్లు నిబంధనలను తుంగలొ తొక్కారని ఆరోపించారు. ప్రభుత్వం రూ.54,480కోట్ల వ్యవసాయ రుణాలు ఇస్తామని ప్రకటించి కేవలం రూ.44438కోట్లు మాత్రమే రుణాలు ఇచ్చిందన్నారు. రూ.2లక్షల రుణమాఫీ చేయలేదని, ఇది రైతులను మోసం చేయడమే అని ద్వజమెత్తారు. గత ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు 2,50లక్షల ఎకరాల పంటలు ధ్వంసం అయ్యాయని ప్రభుత్వం రైతులకు పరిహారం అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. పంటలకు మద్దతు ధర ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ హామి ఇచ్చి విస్మరించిందని అన్నారు.
రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం
కేంద్రం ఆయిల్ పామ్ పై దిగుమతి సుంకాలను 27.5 నుంచి 16.5 శాతానికి తగ్గించడంతో ఆయిల్ ఫామ్ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఆయిల్ పామ్ టన్నుకు రూ.25వేల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పత్తి రైతులకు పెట్టిన పెట్టుబడి వచ్చే అవకాశం లేకుండా పోయిందన్నారు. సీసీఐ నుంచి కొనుగోలు చేయకుండా రైతును దగా చేసే కుట్ర చేస్తుందని దీంతో రైతులకు పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో ప్రాణాలు తీసుకునే పరిస్థితి దాపురించిందని ఆవేధన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేయకుండా కార్పోరేటు కంపెనీలకు ఊడిగం చేస్తుందని అన్నారు. సెమినార్‌లో రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాపర్తి సోమయ్య, భూక్యా చందు నాయక్, మండల నాయకులు రావుల రవీందర్ రెడ్డి, పొన్నాల రాజవ్వ, కొత్తపల్లి బాలనర్సయ్య, బోడపట్ల బాలరాజు, మిల్లపురం ఎల్లయ్య, ముచ్చన్నపల్లి కుమార్, నడిగొట్టు నర్సింహులు, ఉప్పల గాలయ్య, గుడికందుల కనకయ్య, చొక్కం సులోచన, బాదెంగుల బాలరాములు, గజ్వెల్లి రమేష్ పాల్గొన్నారు.
Also Read: Workers Protest: జీతాలు రాక యాతన పడుతున్నా కార్మికులు.. బకాయిలు ఇస్తారా? బిచ్చమెత్తకోమంటారా?