Hyderabad Metro: మెట్రో రైలు ఫేజ్-1 ను స్వాధీనం చేసుకోనున్న సర్కారు
విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డితో ఎల్‌అండ్‌టీ అధికారుల కీలక సమావేశం
రూ.13 వేల కోట్ల రుణాన్ని స్వీకరించిన రాష్ట్ర ప్రభుత్వం
ఆర్థిక ఒప్పందాలు, చట్టపరంగా చేపట్టాలని సీఎం సూచన
విస్తరణలో భాగస్వాములు కావాలని ఎల్‌అండ్‌టీ అధికారులకు సీఎం వినతి
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకీ పెరుగుతున్న పట్టణీకరణ, జనాభాకు తగిన విధంగా నగరం చుట్టూ మెట్రో రైలును (Hyderabad Metro) విస్తరించేందుకు సర్కారు సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే సిద్దం చేసిన మెట్రో ఫేజ్-2 ఏ, 2 బీ ప్రతిపాదనలు పట్టాలెక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఇందుకు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలోని మూడు కారిడార్లలో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతున్న మెట్రోరైలు-1ను స్వాధీనం చేసుకోవాలని సర్కారు నిర్ణయించింది. హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలను విస్తరించేందుకు, ఇప్పుడున్న మొదటి దశ మెట్రోను స్వాధీనం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి.. ఎల్‌అండ్‌టీ కంపెనీ ప్రతినిధులతో గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కీలక చర్చలు జరిపారు.
చర్చలు సఫలం కావటంతో ప్రస్తుతమున్న ఎల్ అండ్ మెట్రోరైలు ఫేజ్-1 ప్రాజెక్టు కాస్త సర్కారు మెట్రోగా మారనుంది. మెట్రో రైలు ఫేజ్-2ఏ, 2బీ విస్తరణ కింద 8 కొత్త మెట్రో లైన్లను సుమారు 163 కి.మీ.ల పొడువున సర్కారు ప్రతిపాదించి కేంద్రానికి సమర్పించింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించాలని ఇప్పటివరకు పలు సార్లు రాష్ట్ర ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు సమావేశాలను కూడా నిర్వహించింది.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన మెట్రో విస్తరణ 2ఏ, 2బీ ప్రతిపాదనలన్నీ కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే పలు మార్లు సమావేశాలు నిర్వహించిన కేంద్రం.. ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్న ఫేజ్ 1 మెట్రోకు, ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఫేజ్-2 విస్తరణకు సంయుక్త కార్యాచరణ అవసరమని సూచించింది. అందుకు వీలుగా డెఫినేటీవ్ అగ్రిమెంట్‌ను కేంద్రం స్పష్టం చేసింది. ఫేజ్- 2లో కూడా ఎల్ అండ్ టీ భాగస్వామ్యం ఉండాల్సి ఉంటుందని సూచించటంతో మెట్రోరైలు రెండో దశపై నెలకొన్నప్రతిష్ఠంభనను అధిగమించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఎల్ అండ్ టీ హెచ్ఎంఆర్ఎల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సలహాదారు డా.ఎన్వీఎస్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మున్సిపల్ శాఖ కార్యదర్శి ఇలంబర్తి, హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం సెక్రెటరీ మాణిక్యరాజ్, ఎల్ అండ్ టీ గ్రూప్ చీప్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్, సీఎండీ సలహాదారు డి.కె. సేన్, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ, సిఈవో కె.వి.బి.రెడ్డి పాల్గొన్న ఈ సమావేశంలో సమావేశానికి హాజరయ్యారు.
Read Also- US Deportation: 73 ఏళ్ల పెద్దావిడను అమానవీయంగా భారత్ తిప్పిపంపిన అమెరికా.. ఇంతదారుణమా?
మహానగరం చుట్టూ విస్తరించనున్న మెట్రోరైలు టెండర్లలో ఎల్ అండ్ టీ ఈక్విటీ పార్టనర్‌గా పాల్గొనాలని సీఎం రేవంత్ సూచించగా, అందుకు ఎల్ అండ్ టీ అధికారులు విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎల్ అండ్ టీకి ఉన్న రుణం రూ. 13 వేల కోట్లను ప్రభుత్వం స్వీకరించనున్నట్లు సీఎం వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో పాటు ఎల్ అండ్ టీకి ఒకేసారి రూ. 2 వేల కోట్లను చెల్లించే విషయాన్ని కూడా ఎల్ అండ్ టీ అధికారులు ప్రస్తావించినట్లు తెలిసింది. మెట్రో రైలు ఫేజ్ 1లో తమకున్న మొత్తం వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులు సంసిద్ధతను వ్యక్తం చేశారు. దీంతో పాటు తమ కంపెనీ ఈక్విటీ విలువకు సుమారు రూ. 2 వేల కోట్లు వన్–టైమ్ చెల్లింపులు చేయాలని ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతిపాదించగా, ఈ చెల్లింపు పూర్తి చేసిన వెంటనే మెట్రో ఫేజ్ -1 ను రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోకి రానుంది. అప్పగించేందుకు ఎల్ అండ్ టీ సూత్ర్రప్రాయంగా అంగీకరించింది. ఆర్థిక ఒప్పందాలు, చట్టపరమైన నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో మెట్రో రెండో దశ విస్తరణ వేగవంతమవుతుందని, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు, ఆమోదం తొందరగా వచ్చే అవకాశముందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు.
9వ స్థానికి పడిపోయిన మెట్రోరైలు
2014లో దేశంలో మెట్రో రైలు నెట్‌వర్క్‌లో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్, ప్రస్తుతం తొమ్మిదవ స్థానానికి పడిపోయింది. హైదరాబాద్ గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ రద్దీ, ప్రజా రవాణా అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం మెట్రోను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన మెట్రో విస్తరణ ప్రతిపాదనలన్నీ కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే పలు మార్లు సమావేశాలు నిర్వహించిన కేంద్రం ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్న ఫేజ్ 1 మెట్రోకు, ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఫేజ్ 2 విస్తరణకు సంయుక్త కార్యాచరణ అవసరమని సూచించింది. అందుకు వీలుగా డెఫినేటీవ్ అగ్రిమెంట్ కేంద్రం స్పష్టం చేసింది. ఫేజ్- 2లో కూడా ఎల్ అండ్ టీ భాగస్వామ్యం ఉండాల్సి ఉంటుందని సూచించింది.