High Court: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీసీపీఎస్సీ)కి హైకోర్టులో భారీ ఊరట దక్కింది. గ్రూప్ 1 అంశంపై సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ బుధవారం స్టే విధించింది. కమిషన్ నియామకాలు జరుపుకోవచ్చని పేర్కొంది. అయితే, ఇవి తుది తీర్పునకు లోబడి ఉంటాయంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు(Justice Namavarapu Rajeswara Rao) ఇటీవల తీర్పును వెలువరిస్తూ గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టుతోపాటు మార్కుల జాబతాను రద్దు చేశారు.
మెయిన్స్ పరీక్షలు..
సంజయ్ వర్సెస్ యూపీఎస్సీ(UPSC) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రీ వాల్యుయేషన్ జరపాలని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను 8నెలల్లో పూర్తి చేయాలని, లేనిపక్షంలో మెయిన్స్ పరీక్షలను రద్దు చేయాల్సి వస్తుందన్నారు. దీనిని సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్ లో పిటిషన్ వేసింది. దీనిపై డివిజన్ బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి(Sudharshan Reddy) వాదనలు వినిపిస్తూ మెయిన్స్ పరీక్షలు రాసిన వారి పట్ల పక్షపాతం చూపించారనటానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. 14 ఏళ్ల తరువాత గ్రూప్ 1 నియామకాలు జరుగుతున్నాయని తెలిపారు. వాటిని సింగిల్ బెంచ్ రద్దు చేసిందని చెప్పారు. దీనిపై స్పందిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్ వంటివి జరిగాయా?.. పక్షపాతం చూపించారన్న ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.
Also Read: Ramchander Rao: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం చాలా డేంజర్: రాంచందర్ రావు
పరీక్షలకు వేర్వేరు హాల్ టిక్కెట్లను..
దీనికి సుదర్శన్ రెడ్డి సమాధానమిస్తూ ఆరోపణలు చేసిన వారు ఎలాంటి ఆధారాలు చూపించ లేక పోయారని తెలిపారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో పురుషులకు వాష్ రూములు లేనందునే ఈ రెండు కేంద్రాలను మహిళా అభ్యర్థులకు కేటాయించారని చెప్పారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు వేర్వేరు హాల్ టిక్కెట్లను జారీ చేయటాన్ని తప్పు పట్టారని చెప్పారు. అయితే, హాల్ టిక్కెట్లు జారీ చేసే విషయంంలో టీజీపీఎస్సీదే(TGPSC) పూర్తి అధికారమని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస ఏ.కే.సింగ్ తీర్పును వెలువరిస్తూ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేశారు. టీజీపీఎస్సీ నియామకాలు జరుపుకోవచ్చని పేర్కొన్నారు. అయితే, తుది తీర్పునకు ఇవి లోబడి ఉంటాయని తెలిపారు. ఇక, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులో బయాస్, ఇంటిగ్రిటీ, మాల్ ప్రాక్టీస్ వంటి డెలికేట్ పదాలు ఉపయోగించారన్నారు. తదుపరి విచారణను వచ్చేనెల 15వ తేదీకి వాయిదా వేశారు. ఈ తీర్పుతో ఇటు టీజీపీఎస్సీతోపాటు గ్రూప్ 1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు భారీ ఊరట దక్కినట్టయ్యింది.
Also Read: Hijras Attack Nurse: హిజ్రాల రౌడీయిజం.. డబ్బు ఇవ్వలేదని.. నర్సు బట్టలు చించి వీరంగం!