Huzurabad Hospital: హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి (Huzurabad Area Hospital) లో నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని డి.సి.హెచ్.ఎస్. డాక్టర్ ఎల్. కృష్ణ ప్రసాద్ అన్నారు. ఆయన హుజూరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్. నారాయణరెడ్డితో కలిసి రోగులకు అందుతున్న వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 23,761 రక్త పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఆగస్టు నెలలో 109 లాబ్ పరీక్షలు, 13,510 మంది ఔట్ పేషెంట్లకు చికిత్సలు అందించగా, 1,083 మందిని ఇన్ పేషెంట్లుగా చేర్చుకున్నామని వెల్లడించారు.
Also Read: H1B Exemption: హెచ్-1బీ వీసా ఫీజు పెంపు నుంచి వారికి మినహాయింపు.. సుముఖంగా ఉన్న ట్రంప్!
13 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు
అలాగే, ఆసుపత్రిలో 106 మేజర్ శస్త్రచికిత్సలు, 334 మైనర్ శస్త్రచికిత్సలు, 13 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, 103 ఆరోగ్యశ్రీ చికిత్సలు నిర్వహించినట్లు చెప్పారు. వైద్య సేవలు ఇంతటితో ఆగలేదని, 423 మంది గర్భిణీ స్త్రీలకు అల్ట్రాసౌండ్ స్కానింగ్లు, 964 మందికి ఎక్స్రేలు తీసినట్లు ఆయన వివరించారు. ఆసుపత్రిలోని వైద్యుల సహకారంతో రోగులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
కార్పొరేట్ ఆసుపత్రులలో జరిగే వైద్య చికిత్సలు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను చూసేందుకు వచ్చే బంధువులకు వైద్యుల పట్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి, సందర్శన వేళలను ఏర్పాటు చేశామని, ఆ సమయంలోనే వారు రావాలని సూచించారు. కార్పొరేట్ ఆసుపత్రులలో జరిగే వైద్య చికిత్సలు హుజురాబాద్ ఆసుపత్రిలోనూ లభిస్తున్నాయని, ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. త్వరలోనే ఆసుపత్రికి స్కానింగ్ యంత్రం రానుందని, దీనితో మరింత మెరుగైన చికిత్సలు అందిస్తామని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో కరీంనగర్ వైద్య విధాన పరిషత్ ఏ.డి. నజీముల్లా,ఏ.వో. అహ్మద్, డాక్టర్ పి. శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.