Suryapet SP: చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని సూర్యాపేట ఎస్పి నరసింహ (Suryapet SP) స్పష్టం చేశారు. పోలీసులపై దాడికి పాల్పడిన పాలకవీడు మండలం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ స్థలాన్ని ఎస్పి నరసింహ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… శాంతి భద్రతలను కాపాడే పోలీసులపై దాడికి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక చేస్తున్నామని వివరించారు.
Also Read: DRDO Recruitment 2025: డీఆర్‌డీఓలో ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేసుకోండి!
అసలేం జరిగింది
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సమీపంలో పాలకీడు మండలంలో డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో కొంతమంది ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు పనిచేస్తున్నారు. కాగా, అందులో 48 ఏళ్ల కార్మికుడు గణేష్ గుండెపోటుతో మరణించాడు. అయితే ఆ కార్మికుడు గణేష్ మృతికి నష్టపరిహారం చెల్లించాలని కూలీలు డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ యజమానిని డిమాండ్ చేశారు. దీంతో కూలీల డిమాండ్ కు యజమాని అంగీకరించలేదు. దీంతో డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద కూలీలు ఆందోళనకు దిగారు. ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఫ్యాక్టరీ పై రాళ్లతో దాడికి దిగారు.
మరింతగా రెచ్చిపోయి ఫ్యాక్టరీ పై రాళ్లు
ఈ క్రమంలోనే డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని సంబంధిత పోలీస్ స్టేషన్ పాలకీడు ఎస్ హెచ్ ఓ కు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పాలకీడు ఎస్హెచ్ఓ, తన సిబ్బందితో కూలీల చర్యలను కట్టడి చేసేందుకు డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే కూలీలు మరింతగా రెచ్చిపోయి ఫ్యాక్టరీ పై రాళ్లు రువ్వుతున్నారు. దీంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించినప్పటికీ కూలీలు తమ చర్యలను ఆపలేదు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కూలీల ఆకతాయి చేష్టలను ఆపేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా 100 నుంచి 150 మంది కూలీలు చిన్న చిన్న రాళ్లతో పోలీసులపై వాహనాలపై దాడికి దిగారు. ఈ ఘటనలో పోలీస్ వాహనాలు ధ్వంసం కాగా, పాలకీడు ఎస్ హెచ్ ఓ కు, హోంగార్డు గోపికి గాయాలయ్యాయి. దీంతో మంగళవారం జిల్లా ఎస్పీ నరసింహ ఘటన ప్రాంతాన్ని సందర్శించి మాట్లాడారు.
సమస్యలుంటే పరిష్కరించుకోవాలి
కార్మికులు తమకు ఎలాంటి సమస్య వచ్చిన ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం, కంపెనీ యాక్ట్ ప్రకారం, ఇండస్ట్రియల్ రూల్స్ ప్రకారం, లేబర్ లాస్ ప్రకారం వాళ్లు లబ్ది పొందాలి. కానీ, దౌర్జన్యంగా ఫ్యాక్టరీ పై దాడి చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఘటనలు సృష్టించడం సరికాదని ఎస్పీ నరసింహ వెల్లడించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సిన పరిస్థితి, ఆవశ్యకత ఏర్పడింది. కూలీల అసాంఘిక చర్యలకు పోలీసులు అడ్డుకుంటే వారిపై దాడికి దిగడం సమంజసం కాదన్నారు. అనుమానితులను గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఘటనకు సంబంధించిన వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్ స్కానర్ తో ఆధారాలు సేకరించారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చే లేబర్, కార్మికుల వివరాలు నమోదు చేసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ నిర్వహణ యాజమాన్యం, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, కోదాడ రూరల్ సీఐ ప్రతాప్ లింగం, మునగాల సిఐ రామకృష్ణారెడ్డి, పాలకీడు ఎస్సై కోటేష్, గరిడేపల్లి ఎస్ఐ నరేష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Also Read: Jayammu Nischayammu Raa: నాకు ఆ డ్యాన్స్‌లేవీ రావ్.. జగపతిబాబు షోలో ప్రభుదేవా!