Money Fraud: మహారాష్ట్రలోని పుణేలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగిని అతడి బంధువు ఏకంగా రూ.4 కోట్ల మేర మోసం (Money Fraud) చేశాడు. తన కొడుకు కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నాడని, స్పెషల్ మిషన్‌లో కీలక పాత్ర పోషించినట్టు నమ్మించాడు. తన కొడుకు ప్రతిభను మెచ్చి కేంద్ర ప్రభుత్వం రూ.38 కోట్ల రివార్డ్ ప్రకటించిందని, ఆ మొత్తం అందుకోవాలంటే, ప్రాసెసింగ్ ఫీజులు, లాయర్ల ఖర్చులు, ఉన్నతాధికారులకు గిఫ్టులు ఇవ్వాల్సి ఉంటుందని నమ్మబలికాడు. తనకు డబ్బు అందిన వెంటనే తిరిగి ఇచ్చేస్తానంటూ పలు దఫాలు డబ్బు తీసుకున్నాడు. ఇదంతా నమ్మిన సూర్యకాంత్ థోరాత్ అనే బాధిత వ్యక్తి… వారుచెప్పినప్పుడల్లా, సూచించిన అకౌంట్లకు డబ్బు పంపించారు. ఆ విధంగా మొత్తం రూ.4 కోట్లకు పైగానే ఇచ్చాడు.
అమిత్ షా, దోవల్‌తో కాన్ఫరెన్స్ నాటకం
అబద్ధాలు చెప్పి ఏకంగా రూ.4 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన సదరు మోసకారి బంధువు.. డబ్బు కావాలని బాధితుడు అడుగుతుండడంతో నాటకంలో మరో అంకానికి తెరలేపాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో తాను కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడుతున్నానంటూ నమ్మబలికాడు. ‘‘ నా మాటలు నమ్మకుంటూ నువ్వు కూడా మాట్లాడి చూడు’’ అంటూ బురిడీ కొట్టించాడు. అమిత్ షా, ధోవల్, ఇతర ఉన్నతాధికారులు లైన్‌లో ఉన్నారంటూ బాధితుడు సూర్యకాంత్ థోరాత్‌తో నిందిత వ్యక్తి మాట్లాడించాడు. దీంతో, ఇదంతా నిజమేమోనని బాధిత వ్యక్తి భావించాడు. మోసకారి బంధువు కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడుతున్నట్టు నటించేవాడని, ఈ వ్యవహారమంతా 2020 నుంచి 2024 మధ్య కాలంలో నడిచిందని బాధిత వ్యక్తి చెప్పాడు. అనేక బ్యాంక్ అకౌంట్లకు రూ.4 కోట్లకు పైగా డబ్బు పంపించానని, స్నేహితులు, బంధువుల నుంచి అప్పు కూడా తీసుకుని మరీ పంపించానని వాపోయాడు.
Read Also- Shreyas Iyer: అయ్యర్‌కు ఏమైంది?.. మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు ఇండియా-ఏ టీమ్ నుంచి వైదొలగిన వైనం
ఫేక్ ఐడీ, రివాల్వర్
తన కొడుకు ఐడీ కార్డు, రివాల్వర్, బ్యాంక్ మెసేజ్ వంటి ఇతర ఫేక్ వస్తువులను నిందితుడు తనకు చూపించాడని బాధిత వ్యక్తి వాపోయాడు. అందుకే, తనకు ఎప్పుడూ అనుమానం కలగలేదని, తన కొడుకు ట్రైనింగ్‌లో ఉన్నాడంటూ అతడితో పాటు కుటుంబ సభ్యులు చెప్పేవారని వివరించాడు. అందుకే ఇంట్లో ఉండడని నమ్మించేవారని, ఇవన్నీ నిజమేనని భావించానని అన్నారు. జనవరి 2020 నుంచి సెప్టెంబర్ 2024 మధ్యకాలంలో ఏకంగా రూ.4 కోట్లకు పైగా డబ్బును అతడి ఖాతాల్లో జమ చేశానని, ఆ డబ్బు కోసం ఫ్లాట్లు, సాగుభూమి, షాప్, కారు, భార్య నగలు అమ్మేశానని వాపోయారు. అవి సరిపోకపోవడంతో పీఎఫ్ డబ్బు కూడా ఉపయోగించుకున్నానని వివరించారు. సొంత బంధువు ఇంత మోసం చేస్తారన తాను కలలో కూడా ఊహించలేదని సూర్యకాంత్ థోరాత్ వాపోయారు. ఈ ఘటనపై పుణే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also- H1B Exemption: హెచ్-1బీ వీసా ఫీజు పెంపు నుంచి వారికి మినహాయింపు.. సుముఖంగా ఉన్న ట్రంప్!
డబ్బు అడిగితే కొడుకు మిషన్‌లో ఉన్నాడనేవారు..
తన డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగినప్పుడల్లా తన కొడుకు విదేశాల్లో ఒక ముఖ్యమైన మిషన్‌లో ఉన్నాడంటూ తప్పించుకునేవారని బాధితుడు సూర్యకాంత్ వాపోయారు. ఇదంతా ఒక కట్టుకథ అని కొన్ని క్రితమే తనకు తెలిసిందని, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశానని అన్నారు. ఫేక్ కాన్ఫరెన్స్ కాల్స్‌లో, తనను టెన్షన్ పడవొద్దంటూ అమిత్ షా, అజిత్ ధోవల్ మాదిరిగా హామీ ఇచ్చారని, కానీ అంతమంది ఉన్నతాధికారులు ఫోన్ కాల్‌లో ఉండడం, ఇతరులకు హామీలు ఇవ్వడం సాధ్యమే కాదని తర్వాత గ్రహించానని అన్నారు. కాగా, ఈ కేసులో ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. శుభం సనిల్ ప్రభలే, సునీల్ బాబనరావ్ ప్రభలే, ఓంకార్ సునీల్ ప్రభలే, ప్రశాంత్ రాజేంద్ర ప్రభలే, భాగ్యశ్రీ సునీల్ ప్రభలేలపై కేసులు పెట్టారు. ఈ కేసును ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేశామని అధికారులు తెలిపారు. దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.