Ignoring Sagara Ghosha Means Disaster
Editorial

Disaster: సాగర ఘోషను నిర్లక్షం చేస్తే వినాశనమే..

Ignoring The sea is roaring Means Disaster: సముద్రానికి, మనిషికి అవినాభావ సంబంధముంది. సముద్రాలు ప్రపంచ దేశాలను కలిపే జలమార్గాలుగానే గాక, మానవుడి ఉనికిని భౌతికంగా నిలబెడుతూ, ఆర్థికంగానూ వెన్నూదన్నుగా నిలుస్తున్నాయి. మన భూమిని ఆవరించిన మహాసముద్రాలన్నింటినీ కలిపి ఒక దేశంగా పరిగణిస్తే.. అది ప్రపంచపు ఏడవ అతిపెద్ద ఎకానమీ అవుతుందనేది.. ఐక్యరాజ్య సమితి చెబుతున్న మాట. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా సముద్ర వనరుల మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. దీనిని బట్టి మహాసముద్రాలకున్న ప్రాధాన్యం ఎంతటితో అర్థమైపోతోంది. భూమి ఉపరితలంపై 71 శాతానికి పైగా ఉన్న మహాసముద్రాల వైశాల్యం 86.1 కోట్ల చదరపు కిలోమీటర్లు అంటే ఆశ్చర్యం అనిపించకమానదు. భూమ్మీది మొత్తం నీటిలో 97 శాతం వాటా సముద్రాలదే. మరో విచిత్రమైన అంశమేమిటంటే భూమండలం మీద 99 శాతం జీవులకు సముద్రాలే ఆధారంగా ఉండగా, మనం పీల్చే సగం ఆక్సిజన్‌ను అందిస్తున్నది, భూమ్మీద విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్‌లో నాలుగోవంతు పీల్చుకునేదీ మహా సముద్రాలే. భూగోళం మీద కురిసే వానలను, వాతావరణ మార్పులను ప్రభావితం చేసేది మహాసముద్రాలే.మరి ఎంతో విశిష్టత కలిగిన ఈ సముద్రాలు ఏటికేడు కాలుష్య కాసారాలుగా మారి వాటి సహజత్వాన్ని కోల్పోతున్నాయి. సముద్రం అందించే ఉప్పు తింటున్న మనిషి చివరికి ఆ సముద్రాన్నే ముంచేస్తున్నాడు. అయితే, ఈ క్రమంలో తానూ మునిగిపోతున్నాడని గుర్తించలేకపోతున్నాడు.

మనిషి దురాశ, నిర్లక్షం కారణంగా అరుదైన జలచరాలతో బాటు మానవుడి ఉనికీ ప్రమాదంలో పడుతోందని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నారు. దీంతో తొలిసారిగా 1992 జూన్ 8న వివిధ దేశాల ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ‘వరల్డ్ ఓషన్స్ డే’గా ప్రకటించి కెనడాలో ఒక సమావేశం నిర్వహించాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ అంశంపై చైతన్యం పెరగటంతో ఐక్యరాజ్య సమితి 2008 నుంచి ఏటా జూన్ 8వ తేదీని ‘వరల్డ్ ఓషన్స్ డే’గా ప్రకటించి అధికారికంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 2024 సంవత్సరానికి గానూ ‘Awakening New Depths’ అనే థీమ్‌ను ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. మహా సముద్రాలు మన భూమికి ఊపిరితిత్తులని అందరూ గుర్తించేందుకే ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నామని యునెస్కో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

మహా సముద్రాల్లోని జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తున్న అంశాల్లో ప్లాస్టిక్ ఒకటి. మన భూమిపై ఏటా సుమారు 3.5 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగుపడుతుండగా, అందులో నాలుగోవంతు సముద్రాలకు చేరుతున్నాయి. ఈ ప్లాస్టిక్ మొత్తాన్ని భూమిచుట్టూ ఒక రోడ్డులా పేర్చుకుంటూ పోతే నాలుగుసార్లు భూమి చుట్టూ తిరగొచ్చని అంచనా. ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్ర జలాల్లో పారవేస్తున్న దేశాల్లో భారత్, చైనాలు ముందువరసలో ఉండటం గమనార్హం. మన దేశంలో సాలీనా ప్లాస్టిక్ వినియోగం 15 మిలియన్ టన్నులు కాగా 2050 నాటికి ఇది 20 మిలియన్ టన్నులు అవుతుందని అంచనా. నేలలో కలసిపోవటానికే వందల ఏళ్లు పట్టే ఈ ప్లాస్టిక్ కాలుష్యం ఏటా లక్షలాది జలజీవాలు, పక్షుల ఉసురు తీస్తోంది. రాబోయే 10 సంవత్సరాల్లో సముద్రాల్లో చేరనున్న ప్లాస్టిక్ నాలుగురెట్ల మేర పెరగనుందని శాస్త్రవేత్తల అంచనా. ఇదిలాగే కొనసాగితే 2025వ సంవత్సరం నాటికి సముద్రాలలో ప్లాస్టిక్, చేపల నిష్పత్తి 1:3గా ఉంటుందని, 2054 నాటికి సముద్రాలలో చేపల కంటే ప్లాస్టిక్ సంచులే ఎక్కువ వుంటాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సముద్రాల్లోకి చేరుతున్న రసాయన వ్యర్థాల వల్ల 5 రకాల జీవరాశులు శాశ్వతంగా అంతరించిపోగా, 2.45 లక్షల చదరపు కిలోమీటర్ల మేర జలచరాలు జీవించలేని వాతావరణం ఏర్పడిపోయింది.

7500 కి.మీ పొడవైన అతిపెద్ద తీర రేఖను కలిగి ఉన్న మన దేశానికి హిందూ మహా సముద్రం ఎంతో ముఖ్యమైంది. ఐరోపా, అసియాకు అనుసంధానంగా ఉన్న హిందూ మహా సముద్రం మీదగా 75 శాతం సముద్ర వాణిజ్యం సాగుతోండగా, 50 శాతం వరకూ రోజువారీ సరకు రవాణా జరుగుతోంది. అయితే, కాలుష్యం కారణంగా పెరగుతోన్న గ్లోబల్ వార్మింగ్ మూలంగా రాబోయే 20 ఏళ్లో ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీ సెల్షియస్ మేర పెరిగి హిమానీ నదాలు అతిగా కరిగి, సముద్రమట్టాలు ఏటా 3.7 మి.మీ చొప్పున పెరుగుతూ పోతాయని, 2100 నాటికి ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాలు శాశ్వతంగా కనుమరుగవుతాయని నాసా అంచనా వేసింది. మన దేశంలో హిందూమహా సముద్ర తీర రేఖ వెంట ఉన్న విశాఖపట్నం, ముంబయి, చెన్నై, మంగుళూరు, కొచ్చి, పారాదీప్, మర్మగావ్, భావ్ నగర్, కాండ్లా, తూత్తుకుడితో సహా మరో నగరాలు మాయం కానున్నాయనే వార్త ఇప్పుడు దేశ ప్రజలను కంగారుపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా 70 శాతం శుద్ధి చేయని డ్రైనేజీ నీరు సముద్రాలలో కలుస్తోంది. దీనివల్ల కలిగే వాతావరణ మార్పువల్ల ఏటా 13 బిలియన్ డాలర్ల నష్టం జరుగుతుందని యుఎన్‌ఇపి అంచనా వేసింది.

సాధారణంగా భూతాపం కారణంగా సముద్రాల్లోని నీరు ఆవిరిగా మారి, మేఘాలుగా ఏర్పడి, వాతావరణం చల్లబడగానే వర్షంగా మారుతుంది. కానీ, కాలుష్యం కారణంగా మేఘాలు ఏర్పడినా, వాతావరణం చల్లబడటం లేదు. దీనికారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, పొలాలు బీళ్లుబారి, కరువు ఏర్పడుతోంది. మరోవైపు సముద్రాలను ఆనుకుని ఉండే మడ అడవులు నాశనమై పోతున్నాయి. గత 60 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మడ అడవుల్లో 80 శాతం అంతరించిపోగా, కేవలం మడ అడవుల్లో మాత్రమే జీవించే 70 రకాల అరుదైన జీవజాతుల్లో 11 జీవజాతులు పూర్తిగా అంతరించిపోయాయని ‘కన్జర్వేషన్ ఇంటర్నేషనల్’ సంస్థ తన నివేదికలో హెచ్చరించింది. ఇంత ప్రమాదకరమైన పరిస్థితి కళ్లముందు కనిపిస్తున్నా.. మనిషి ఆలోచనా తీరులో మాత్రం ఏమాత్రం మార్పురావటం లేదు. ముఖ్యంగా జలం, జీవులకి మధ్యగల సంబంధాన్ని తాత్కాలిక సౌకర్యం, ప్రయోజనం కోసం విస్మరించటమంటే.. కూర్చున్న కొమ్మను నరుక్కోవటమే. ఇకనైనా మానవాళి మేలుకొని మహా సముద్రాలను కాపాడుకోకపోతే మిగిలేది మహా విషాదమే. కనుక.. మహా సముద్రాలను, ఆ చల్లని సముద్ర గర్భంలోని సకల జీవకోటినీ పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచ మహా సముద్రాల దినోత్సవం సందర్భంగా ప్రతిన బూనాలని ఆశిద్దాం.

గోరంట్ల శివరామకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!