Afghan Boy: అఫ్గానిస్తాన్ కు చెందిన 13 ఏళ్ల బాలుడు.. దిల్లీ అంతర్జాతీయ విమానశ్రయ అధికారులను షాక్ కు గురిచేశాడు. అతడు సీటులో కాకుండా.. విమానం ల్యాండింగ్ గేర్ కు దాక్కొని భారత్ కు రావడం అధికారులను విస్మయానికి గురిచేసింది. ఆదివారం ఈ ఘటన జరగ్గా.. అఫ్గాన్ బాలుడ్ని ఎయిర్ పోర్ట్ సెక్యురిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సోమవారం ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే..
ఆదివారం (సెప్టెంబర్ 22) ఉదయం 11.10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కామ్ ఎయిర్‌లైన్స్ RQ-4401 విమానం కాబూల్ నుండి ఢిల్లీకి గంటన్నర ప్రయాణం పూర్తిచేసుకుని ల్యాండ్ అయ్యింది. విమానాన్ని ప్రయాణికులు వీడిన కొద్దిసేపటి తర్వాత.. ఎయిర్‌లైన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ టాక్సీవేపై ఒక బాలుడు నడుస్తున్నాడని గమనించాడు. వెంటనే ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారం ఇచ్చాడు.
విమానంలోకి ఎలా వచ్చాడంటే?
తక్షణమే అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ స్టాప్.. బాలుడ్ని అదుపులోకి తీసుకుని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సహా భద్రతా సంస్థలకు అప్పగించారు. టెర్మినల్-3లో CISF అధికారులు అతన్ని కొన్ని గంటల పాటు విచారించారు. CISF అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బాలుడు కుందూజ్ ప్రాంతానికి చెందినవాడు. అతను కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లోకి ఎవరికి కనిపించకుండా చొరబడి విమానం బయలుదేరే ముందు రియర్ సెంట్రల్ ల్యాండింగ్ గేర్‌లోకి ఎక్కినట్టు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత దానిని గట్టిగా పట్టుకొని విమానం అటు ఇటు కుదుపులకు గురైనప్పటికీ వేలాడుతూ ఉండిపోయినట్లు చెప్పాడు.
ప్రాణాలను పణంగా పెట్టి..
సాధారణంగా ఇలాంటి ప్రయత్నాలను ప్రపంచవ్యాప్తంగా “వీల్-వెల్ స్టోవేవే” అని పిలుస్తారు. విమానం ల్యాండింగ్ గేర్‌లో లేదా అండర్ గ్యారేజ్‌లో దాక్కునే వారు చాలా మంది తీవ్ర పరిస్థితులను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఆ ప్రదేశం చాలా ఇరుకుగా ఉండటమే కాకుండా.. ఆకాశంలో ఎగురుతున్నప్పుడు అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ స్థాయికి పడిపోతాయి. ఆక్సిజన్ కూడా తక్కువగా ఉంటుంది. అందువల్ల చాలాసార్లు ఇలాంటి ప్రయత్నాలు ప్రాణాంతకమవుతుంటాయి. గతంలో పలువురు ఇలా చేసి హైపోథర్మియాతో మరణించిన సందర్భాలు సైతం ఉన్నాయి.
మరో ఫ్లైట్ లో పంపేసిన అధికారులు
కానీ ఈసారి ఆ బాలుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడటం విశేషం. అయితే బాలుడ్ని మధ్యాహ్నం 4 గంటలకు మరో విమానంలో తిరిగి కాబూల్‌కు పంపేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ‘ఎవరికి కనిపించకుండా ఎయిర్‌పోర్ట్‌లోకి చొరబడి ల్యాండింగ్ గేర్‌లోకి ఎక్కగలిగానని అతను చెప్పాడు’ అని CISF అధికారి వివరించారు. విమానాన్ని ఆ తర్వాత పూర్తి స్థాయిలో తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. ల్యాండింగ్ గేర్‌లో ఒక ఎరుపు రంగు స్పీకర్ కూడా లభించిందని.. అది ఆ బాలుడిదిగా అధికారులు భావిస్తున్నారు. అన్ని భద్రతా తనిఖీలు పూర్తయ్యాక విమానాం సేఫ్ గా ఉన్నట్లు నిర్ధారించినట్లు స్పష్టం చేశారు.
Also Read: Tollywood: సౌందర్య చివరి చూపుకి కూడా వెళ్లలేకపోయా.. ఇంట్లో వాళ్లే ఆపారంటూ కన్నీరు పెట్టుకున్న హీరోయిన్
గతంలో జరిగిన ఘటనలు..
గతేడాది జనవరిలో డొమినికన్ రిపబ్లిక్ నుండి ఫ్లోరిడాకు వెళ్లిన జెట్‌బ్లూ విమానంలో ల్యాండింగ్ గేర్‌లో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు కనుగొనబడ్డాయి. డిసెంబర్ 2023లో అల్‌జీరియాకు చెందిన ఒక యువకుడు ఒరాన్ నుండి పారిస్‌కి చేరుకున్న తర్వాత తీవ్ర హైపోథర్మియాకు గురయ్యాడు. 2021లో గ్వాటెమాలాకు చెందిన ఒక వ్యక్తి మియామీకి వెళ్లే విమానంలో ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని గంటల తరబడి ప్రయాణించి చివరికి ప్రాణాలతో బయటపడ్డాడు.