Bathukamma 2025: ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ ‘బతుకమ్మ’. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకుంటారు. బతుకమ్మ పండుగను రాష్ట్రంలో భాద్రపదమాస అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. నేటి నుంచి ఎంగిలిపువ్వూతో బతుకమ్మ ప్రారంభమవుతుంది.
రంగు రంగుల పూలను పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ ఒక లయతో అడుగులు వేస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలను పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. ఎంగిలి పూల బతుకమ్మ: మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
ముద్దపప్పు బతుకమ్మ: ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
నానే బియ్యం బతుకమ్మ: నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
అట్ల బతుకమ్మ: అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.
అలిగిన బతుకమ్మ: ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.
వేపకాయల బతుకమ్మ: బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
వెన్నముద్దల బతుకమ్మ: నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
సద్దుల బతుకమ్మ: ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు.
Also Read: Tummala Nageswara Rao: రైతులకు గుడ్ న్యూస్.. కపాస్ కిసాన్ యాప్‌తో రిజిస్ట్రేషన్ చేసుకుంటే..!
తెలంగాణ గ్రామీణ సమాజం..
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళల తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం మొదలైనవి ఈ పాటల్లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. గత వెయ్యేళ్లుగా బతుకమ్మను తెలంగాణాలో ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు. ఎన్నో చరిత్రలు, పురాణాలు మేళవిస్తారు.ఎన్నో చారిత్రక పాటలు పాడుతారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర విశిష్టమైంది. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ ఖండాంతరాలు దాటి ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది.
ప్రభుత్వం ఏర్పాట్లు
బతుకమ్మ సంబురాలకు ప్రభుత్వం సైతం ఏర్పాట్లు చేసింది. ఆదివారం బతుకమ్మ ప్రారంభ వేడుకలకు చారిత్రక వేయి స్తంభాల గుడి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మంత్రులు జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao), కొండా సురేఖ(Konda Sureka), సీతక్క(Min Seethakka) అనసూయ బతుకమ్మ అరంభ వేడుకలో పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM revanth Redddy) సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం ఈ ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. సకల జనులు, సబ్బండ వర్ణాలు కలిసి ఏకత్వస్ఫూర్తిని చాటేలా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించింది. చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాంతాల్లో 9 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది.
ప్రజలకు కేసీఆర్ ‘బతుకమ్మ’ శుభాకాంక్షలు
తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కృతిక జీవనానికి బతుకమ్మ తర తరాల ప్రతీకగా నిలిచిందని, పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ, ప్రపంచ సంస్కృతీ సాంప్రదాయాల్లో తెలంగాణ ప్రత్యేకతను చాటుతున్నదని బీఆర్ఎ(BRS)స్ అధినేత కేసీఆర్(KCR) అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆదివారం ఒక ప్రకటనలో బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలి పూలతో ప్రారంభమై సద్దులతో ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ, పల్లెలు పట్టణాలో.. మహిళలు పిల్లా పాపలతో ప్రత్యేక సాంస్కృతిక సందడి నెలకొంటుందన్నారు. సబ్బండ వర్గాల భాగస్వామ్యంతో, నాటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో, తెలంగాణ అస్తిత్వ ఆకాంక్షలకు బతుకమ్మ ప్రధాన సాంస్కృతిక వేదికగా నిలిచిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ’ను రాష్ట్ర పండుగగా ప్రకటించిందని, తెలంగాణ మహిళల ప్రత్యేక పండుగగా గుర్తించి కానుకగా బతుకమ్మ చీరలు అందజేశామన్నారు. కష్టాలనుంచి రక్షించి రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రకృతి మాత బతుకమ్మ ను ప్రార్థించారు.
Also Read: Telugu movies Oscar 2025: ఆస్కార్ రేసులో ప్రపంచ స్థాయి సినిమాలతో పోటీపడుతున్న తెలుగు చిత్రాలు ఇవే..