Cordon Search: వివరాలు వెల్లడించిన మేడ్చల్ డీసీపీ కోటి రెడ్డి
స్వేచ్ఛ, మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టాపూర్‌లో పోలీసులు గురువారం కార్డన్ సెర్చ్ (Cordon Search) నిర్వహించారు. ఈ సందర్బంగా మేడ్చల్ డీసీపీ కోటి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మీడియా సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ, కిష్టాపూర్ నుంచి తరుచూ ఫిర్యాదు అందుతుండడం, ఈ ప్రాంతంలో ఇతర రాష్ట్రాల వారు అధిక ఉండడంతో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. సుమారు 300 ఇళ్లలో వెయ్యి మందిని తనిఖీ చేశామన్నారు. అందులో బీహార్ రాష్ట్రానికి చెందిన 110 మంది, ఒడిశాకి చెందిన 96, జార్ఖండ్‌కు చెందిన 72 మంది, అస్సాంకు చెందిన 52 మంది, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 36 మంది, మధ్యప్రదేశ్‌కు చెందిన 14 మంది, మిగతావారు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారని వెల్లడించారు. వీరందరి పూర్తి వివరాలు తీసుకున్నామని వివరించారు. ఈ కార్డెన్ సెర్చ్‌లో మూడు లిక్కర్ కేసులతో పాటు ఇద్దరు గంజాయి వినియోగదారులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
పెద్ద సంఖ్యలో వాహనాలు స్వాధీనం
ద్విచక్ర వాహనాలు 18, ఫోర్ వీలర్ వాహనాలు 2 స్వాధీనం చేసుకున్నామని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ఇక, ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో డ్రంక్ అండ్ డ్రైన్, వాహన పెండింగ్ చలాన్లు కట్టని వాహనాలు సుమారు 15 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయిన వ్యక్తి ఇక్కడ ఉండడంతో ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలకు వాటి ఆధారాలు చూపించకుంటే సీజ్ చేస్తామని తెలిపారు. ఆధారాలు చూపిస్తే వారికి అందిస్తామని తెలిపారు. నిరంతరం పోలీసులు తనిఖీలు చేస్తూనే ఉంటారని, రాత్రి వేళలో కూడా తనిఖీలు చేస్తూ ప్రజలకు రక్షణ ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషన్ డీసీపి పురుషోత్తం, మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ గంగిరెడ్డి, మేడ్చల్ సీఐ సత్యనారాయణ, డీఐ కిరణ్, ఎస్ఓటీ సీఐ శ్యాంసుందర్ రెడ్డి, వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు సుమారు 200 మంది పాల్గొన్నారు.
Read Also- Mulugu: కేటీఆర్ సారీ చెప్పాలంటూ ఆదివాసీ నవనిర్మాణ సేన ధర్నా.. ఎందుకంటే?
ఇన్వెస్ట్‌మెంట్ పేరిట రూ.4.87 కోట్లకు కుచ్చుటోపీ!
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట ఓ వ్యక్తిని మోసం చేసి ఏకంగా రూ.4.87 కోట్లు కొల్లగొట్టిన సైబర్ క్రిమినల్స్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 మొబైల్ ఫోన్లు, 10 పాస్ బుక్కులు, 2 చెక్ బుక్కులు, 10 డెబిట్, క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపిన ప్రకారం, హస్తినాపురంలో నివాసం ఉంటున్న ఓ వ్యాపారితో ఇటీవల వాట్సాప్ ద్వారా టచ్‌లోకి వచ్చిన సైబర్ క్రిమినల్స్ తాము చెప్పిన అప్లికేషన్ ద్వారా పెట్టుబడులు పెడితే ఊహించని లాభాలు సొంతం చేసుకోవచ్చని ఉచ్చులోకి లాగారు. ఈ క్రమంలో బాధితునికి https://m.ironfxsvip.vip అప్లికేషన్ లింక్‌ను పంపించటంతో పాటు దాని వాట్సప్ గ్రూప్‌లో చేర్చారు. నిజంగానే లాభాలు వస్తాయనుకున్న బాధితుడు పలు దఫాలుగా రూ.4.87 కోట్లు సైబర్ క్రిమినల్స్ చెప్పిన ఖాతాలకు బదిలీ చేశాడు. భారీగా లాభాలు వచ్చినట్టుగా చూపించిన క్రిమినల్స్ మరిన్ని పెట్టుబడులు పెట్టాలంటూ నమ్మించారు. దీంతో, సదరు బాధితుడు పెట్టుబడి పెంచుతూ వెళ్లాడు.
వచ్చిన లాభాలను డ్రా చేసుకోవటానికి బాధితుడు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. దాంతో మోసపోయినట్టు గ్రహించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన డీఎస్పీ కేవీఎం. ప్రసాద్, సీఐ శ్రీను, ఎస్ఐ రాము నాయక్‌తోపాటు సిబ్బందితో కలిసి విచారణ జరిపారు. దీంట్లో నిందితులుగా ఉన్న మహ్మద్ మొహినుద్దీన్ షేక్, చిన్నం ఉగ్ర నర్సింహులు, పసుపులేని రాజేశ్, శివారెడ్డిలను అరెస్ట్ చేశారు. చైనా, కాంబోడియా దేశానికి చెందిన సైబర్ క్రిమినల్స్ మోసానికి పాల్పడగా పట్టుబడ్డ నిందితులు వారికి బ్యాంక్ అకౌంట్లు సమకూర్చినట్టుగా విచారణలో వెల్లడైంది.
Read Also- Mulugu: కేటీఆర్ సారీ చెప్పాలంటూ ఆదివాసీ నవనిర్మాణ సేన ధర్నా.. ఎందుకంటే?