Shocking Incident: ఉత్తరప్రదేశ్‌లోని హాత్రస్‌కు చెందిన 23 ఏళ్ల ఆకాష్ అనే యువకుడు.. బ్యాంకులో కేవలం రూ.500 జమ చేసి ఏకంగా రూ.5 కోట్లు విత్ డ్రా చేశాడు. ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ‘మా చాముండా స్వీట్ & నమకీన్’ అనే చిన్న దుకాణాన్ని ఆకాష్ నడుపుతున్నాడు. తన తండ్రి మరణం తర్వాత ఆకాష్ ఈ బాధ్యతలను చేపట్టాడు.
విలాసవంత జీవితం
చాలా కాలంగా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్న ఆకాష్.. ఇటీవల ఒక్కసారిగా తన లైఫ్ స్టైల్ మార్చివేశాడు. విలాసవంతంగా గడపడం ప్రారంభించాడు. కారు, బైక్ తో పాటు బంగారం ఒంటిపై వేసుకొని తిరగడం మెుదలుపెట్టాడు. రూ. 2.5 లక్షల విలువైన యమహా ఆర్ 15 బైక్, థార్ ఎస్ యూవీ కార్, రూ.3.5 లక్షల బంగారం కొన్నాడు. సాధారణంగా కచోరీలు అమ్ముకునే యువకుడి వద్ద ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో అర్థం కాక ఇరుగుపొరుగు వారు గందరగోళానికి గురయ్యాడు. చివరికి అధికారులకు సమాచారం ఇచ్చారు.
రంగంలోకి ప్రత్యేక దర్యాప్తు బృందం
యువకుడికి ఒక్కసారిగా ఐశ్వర్యం రావడంతో హాత్రస్ పోలీసులు SOG (Special Operations Group)ని ఏర్పాటు చేశారు. ముందుగా ఎస్ఓజీ టీమ్.. ఆకాష్ బ్యాంక్ లావాదేవీలపై దర్యాప్తు ప్రారంభించింది. బ్యాంక్ ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు బయటపడటంతో ఆకాష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సంచలన నిజాలు వెలుగు చూశాయి.
ఓవర్‌డ్రాఫ్ట్ ముసుగులో అక్రమాలు
ఆకాష్ 2025 మేలో HDFC బ్యాంకులో రూ.500తో ఖాతా ప్రారంభించాడు. మొదట్లో రూ.5,000 ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకున్నాడు. తరువాత చిన్న మొత్తాలు జమ చేస్తూ ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితిని పెంచుకుంటూ వచ్చాడు. చివరికి రూ.50 లక్షల వరకూ డబ్బు విత్‌డ్రా చేశాడు. మొత్తం తొమ్మిది లావాదేవీల్లో ఇలా రూ.5 కోట్లు విత్‌డ్రా చేశాడని పోలీసులు తెలిపారు.
Also Read: Hydra Ranganath: హైదరాబాద్‌లో జోరు వర్షం.. రంగంలోకి హైడ్రా కమిషనర్.. కీలక ఆదేశాలు జారీ
షేర్లలో రూ.3.5 కోట్లు పెట్టుబడి
పోలీసుల ప్రకారం.. ఆకాష్ సుమారు రూ.3.5 కోట్లు ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్‌ల ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు. మిగతా డబ్బును బైకులు, వాహనాలు, బంగారం, విలాసవంతమైన వస్తువులపై ఖర్చు చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు కూడా ఆకాష్‌కు సహకరించారా? అని పోలీసులు విచారిస్తున్నారు. ఆకాష్ ఘటన బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను మరోమారు బహిరంగ పరిచింది.