Fee Reimbursement: ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో భేటీ
త్వరలో రూ.600 కోట్లు అందించేందుక ఒకే..
మిగతావి నెలకు కొంత చొప్పున అందించాలని నిర్ణయం
మంగళవారం నుంచి తెరచుకోనున్న కాలేజీలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై (Fee Reimbursement) ప్రైవేట్ యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలన్న డిమాండ్‌తో సోమవారం నుంచి ప్రైవేట్ యాజమాన్యాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చల తర్వాత ఈ బంద్‌ను యాజమాన్యాలు విరమించుకున్నాయి. దీంతో, కాలేజీలు మంగళవారం (సెప్టెంబర్ 16) నుంచి యథావిథిగా కొనసాగనున్నాయి. ప్రైవేట్ యాజమాన్యాలకు టోకెన్ అమౌంట్‌లో భాగంగా ఇవ్వాల్సిన రూ.1,207 కోట్లలో భాగంగా రూ.700 కోట్లు ఇవ్వాలంటూ సర్కార్ వద్ద కళాశాల యాజమాన్యాలు ప్రతిపాదన పెట్టాయి. ఇందులో వృత్తి విద్యా కాలేజీలకు రూ.500 కోట్లు, డిగ్రీ, పీజీ కాలేజీలకు రూ.200 కోట్లు చెల్లించాలని యాజమాన్యాలు కోరాయి. కాగా, ప్రభుత్వం అతిత్వరలో రూ.600 కోట్లు ఇవ్వడానికి అంగీకరించింది. మరో రూ.600 కోట్లు దీపావళి లోగా ఇచ్చేందుకు అంగీకరించింది.
Read Also- KTR: జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర మొదలవ్వాలి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
బీఆర్ఎస్ చిన్నాభిన్నం చేసింది : భట్టి విక్రమార్క
విద్యార్థుల భవిష్యత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. పేద విద్యార్థులపై భారమవ్వకూడదనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చిందని ఆయన వివరించారు. కానీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఈ విధానాన్ని చిన్నాభిన్నం చేసిందని విమర్శలు చేశారు. ఆ భారాన్ని తమ నెత్తిపై మోపిందని మండిపడ్డారు. ఈ విచ్ఛిన్నాన్ని సరిదిద్దుకుంటూ తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని వివరించారు. అందులో భాగంగా టోకెన్ అమౌంట్‌లో ఇవ్వాల్సిన మొత్తంలో సగం అంటే.. రూ.600 కోట్లను వీలైనంత త్వరలో అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంచేశారు. మిగతా బకాయిలను ప్రతినెలా కొంత చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. యాజమాన్యాలు సానుకూలంగా స్పందించి బంద్‌ను విరమించాయన్నారు. కమిటీ వేయాలని యాజమాన్యాలు కోరాయని, అందుకు ప్రభుత్వం కూడా అంగీకరించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులతో కలిసి కమిటీ వేస్తామని భట్టి స్పష్టంచేశారు.
Read Also- Handshake Controversy: ‘నో షేక్‌హ్యాండ్’ పరాభవం నుంచి బయటపడని పాక్.. కీలక అధికారిపై పీసీబీ వేటు
పాత ప్రభుత్వం చేసిన పాపాల కారణంగానే ఆ భారం తమ నెత్తిన పడిందని, కానీ తమపై దయతలచి రూ.600 కోట్లు ఇస్తామని అంగీకరించిన కాంగ్రెస్ సర్కార్‌కు ప్రత్యేక ధన్యవాదాలని ప్రైవేట్ యాజమాన్యాల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ బాబు తెలిపారు. ఈ ప్రజా ప్రభుత్వానికి తమ సహాయ సహకారాలు నిత్యం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Read Also- Ramchander Rao: ఫీజు రీయింబర్స్ మెంట్ పై సర్కార్ కు స్పష్టత కొరవడింది.. రాంచందర్ రావు సంచల కామెంట్స్