Land Scam: సింగరేణి మండలంలో సాగులో ఉన్న భూములకు భూయాజమన్య పట్టా పాసు పుస్తకం లేక ఇబ్బంది పడుతున్న పలువురు ఆమాయక గిరిజన రైతులకు పట్టా పాసుపుస్తకం ఆశ చూపి లక్షలు నొక్కేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో సాక్ష్యాత్తు రెవెన్యూ శాఖ అధికారులే డబ్బులు తీసుకుని చేతులెత్తేశారు. మధ్యవర్తి ద్వారా మండల రెవెన్యూ అధికారి(తహసిల్దార్)ను నమ్మి డబ్బులిచ్చిన బాధిత రైతులు మాత్రం పట్టా పాసుపుస్తకం రాక, రెక్కల కష్టంతో సంపాదించిన డబ్బులు కూడా పోగొట్టుకుని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. గతంలో సింగరేణి మండల ఎమ్మార్వోగా పనిచేసిన క్రమంలో విఆర్ఏ ముత్తయ్య మనవడు కోటేశ్వరరావు ద్వారా సూర్యతండా, భాగ్యనగర్ తండాకు చెందిన 15మంది రైతుల వద్ద నుండి సుమారు రూ.2లక్షలు వసూలు చేశారు. మిస్సింగ్ సర్వేనెంబర్ అనే పేరుతో మీసేవ కేంద్రం ద్వారా పట్టాల కోసం దరఖాస్తు కూడా సమర్పించారు. ఓ ప్రైవేట్ సర్వేయర్ ద్వారా రైతుల భూములకు నామమాత్రంగా సర్వే కూడా చేయించి రైతులను నమ్మించారు.
తొమ్మిది నెలల గడిచిన కూడా పట్టా పాసుపుస్తకాలు రాకపోగా, హామీ ఇచ్చిన ఎమ్మార్వో కూడా బదిలీపై మహబూబాబాద్ జిల్లా ఓ మండలానికి వెళ్లిపోవడంతో డబ్బులిచ్చి పట్టా పాసు పుస్తకాలపై ఆశలు పెట్టుకున్న బాధిత రైతులు ఆందోళన చెంది విషయాన్ని బయటకు చెప్పారు. రైతులు మధ్యవర్తి కోటేశ్వరరావును డబ్బులు ఇవ్వమని ఒకటికి పది సార్లు అడుగుతున్న ప్రతిసారి ఎమ్మార్వో పై నెట్టివేస్తూ,కొన్ని రోజులు ఆగితే మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తామని చెబుతూ కాలయాపన చేస్తున్నారు.
ఈ తాసిల్దార్ సింగరేణి మండలంలో పనిచేసిన సమయంలో ఎన్నో రకాల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో పెద్ద మనుషులు కూడా తల దూర్చి సెటిల్మెంట్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఫోన్ లైన్లో గత ఎమ్మార్వో తో మాట్లాడే ప్రయత్నం చేసిన అందుబాటులోకి రాలేదు.