Congress: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం మణిపూర్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. కుకీలు, మైతీల మధ్య ఘర్షణతో గత రెండేళ్లుగా అట్టుడుకుతున్న మణిపూర్ ను ఇన్నాళ్ల తర్వాత ప్రధాని సందర్శించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అది కూడా 3 గంటల మాత్రమే ఆ రాష్ట్రంలో పర్యటించేలా ప్లాన్ చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
‘మణిపూర్ ప్రజలను అవమానించారు’
ప్రధాన మంత్రి మోదీ శనివారం మధ్యాహ్నం మణిపూర్‌కి చేరుకున్నారు. 2023 మేలో హింస చోటుచేసుకున్న తర్వాత మోదీ ఆ రాష్ట్రంలో చేస్తున్న తొలి పర్యటన ఇదే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దీనిని పిట్ స్టాప్ పర్యటనగా అభివర్ణించారు. ఈ పర్యటన టోకనిజం మాత్రమేనని.. మణిపూర్ ప్రజలకు ఇది భారీ అవమానమని అన్నారు. ‘నరేంద్ర మోదీ జీ.. మణిపూర్‌లో మీ మూడు గంటల పిట్ స్టాప్ అనేది కరుణ కాదు. అది నాటకం, టోకనిజం. గాయపడిన ప్రజలకు భారీ అవమానం. ఈ రోజు ఇంఫాల్, చురాచాంద్‌పూర్‌లో రోడ్‌షో చేయడం.. శిబిరాల్లో విలవిల్లాడుతున్న ప్రజల అరుపులను వినకుండా పరారైనట్టే’ అని ఖర్గే ఎక్స్ లో పోస్ట్ చేశారు.
.@narendramodi ji
Your 3-hour PIT STOP in Manipur is not compassion — it’s farce, tokenism, and a grave insult to a wounded people.
Your so-called ROADSHOW in Imphal and Churachandpur today, is nothing but a cowardly escape from hearing the cries of people in relief camps!…
— Mallikarjun Kharge (@kharge) September 13, 2025
విదేశీ పర్యటనలు ప్రస్తావిస్తూ..
ప్రధాని మోదీ విదేశీ పర్యటనల గురించిన ప్రస్తావించిన ఖర్గే.. సూటిగా పలు ప్రశ్నలు సంధించారు. ‘864 రోజుల హింసలో 300 ప్రాణాలు పోయాయి. 67,000 మంది నిరాశ్రయులయ్యారు, 1,500 మందికి పైగా గాయపడ్డారు. ఈ సమయంలో మీరు 46 విదేశీ పర్యటనలు చేశారు. కానీ మీ సొంత పౌరుల కోసం ఓ సానుభూతి మాట చెప్పడానికి కూడా ఇక్కడకు రాలేదు’ అని ఖర్గే నిలదీశారు.
‘మీ వైఫల్యం దాచిపెట్టారు’
‘మీ చివరి మణిపూర్ పర్యటన ఎప్పుడో తెలుసా? జనవరి 2022 ఎన్నికల కోసం.. మీ డబుల్ ఇంజిన్ మణిపూర్ అమాయకుల జీవితాలను తొక్కేసింది. మీరు, హోం మంత్రి అమిత్ షా చేసిన కుట్ర వల్ల అన్ని వర్గాలు మోసపోయాయి. రాష్ట్రపతి పాలన విధించి ఈ వైఫల్యాన్ని దాచిపెట్టారు. హింస ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది’ అని ఖర్గే పేర్కొన్నారు. మణిపూర్‌లో శాంతి భద్రతలను కాపాడే బాధ్యత బీజేపీదేనని తేల్చి చెప్పారు.
Also Read: Dog Name Controversy: పెంపుడు కుక్కకు.. పక్కింటోడి పేరు పెట్టిన యజమాని.. ఇంకేముంది రచ్చ రచ్చే!
ప్రియాంక గాంధీ సైతం..
మరోవైపు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా ప్రధాని మణిపూర్ పర్యటనపై స్పందించారు. ‘రెండు సంవత్సరాల తర్వాత అయినా మణిపూర్ వెళ్లాలని ఆయన నిర్ణయించుకోవడం మంచిదే. కానీ ఆయన చాలా ముందే వెళ్లాలి. ఇంతకాలం అక్కడ ఉద్రిక్త పరిస్థితి కొనసాగడానికి, అంతమంది మరణించడానికి అవకాశం ఇవ్వడం చాలా దురదృష్టకరం. భారతదేశంలో ఇంతవరకు ఏ ప్రధాని ఇలా చేయలేదు’ అని ఆమె వ్యాఖ్యానించారు. కాగా, ప్రధాని చురాచాంద్‌పూర్, ఇంఫాల్‌లో నిరాశ్రయులను కలుసుకోవడమే కాకుండా రూ.8,500 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.