Biggest Baby: సాధారణంగా అప్పుడే జన్మించిన పిల్లలు 3-4 కేజీల బరువు ఉంటారు. మహా అయితే 5 కేజీల వరకూ ఉండటాన్ని కూడా వార్తల్లో చూశాం. అయితే అమెరికాలో ఓ బుడ్డోడు.. ఏకంగా 6.3 కిలోల బరువుతో జన్మించి డాక్టర్లనే ఆశ్చర్యపరిచాడు. అమెరికాలో జరిగిన ఈ అరుదైన ఘటన.. ప్రస్తుతం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిన్నారి గురించి పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
ఫ్లోరిడాకు చెందిన 40 ఏళ్ల డానియెల్లా హైన్స్ (Daniella Hines) అనే మహిళ.. సెప్టెంబర్ 3న ఓ బిడ్డకు జన్మనిచ్చింది. రివర్ వ్యూ ప్రాంతంలోని సెయింట్ జోసేఫ్ ఆస్పత్రి వైద్యులు ఆమెకు ప్రసవం చేశారు. అయితే పుట్టినప్పుడు తన బిడ్డ బరువురు దాదాపు 13 పౌండ్ల 15 ఔన్సులు (6.3 కేజీలు) ఉన్నట్లు హైన్స్ తాజాగా తెలిపింది. రోచెస్టర్ విశ్వవిద్యాలయం మెడికల్ సెంటర్ ప్రకారం.. సాధారణంగా ఒక శిశువు జన్మించినప్పుడు సగటు బరువు 7 పౌండ్లు మాత్రమే ఉంటుంది. కానీ హైన్స్ జన్మనిచ్చిన బిడ్డ ఇందుకు రెట్టింపు బరువు ఉండటం విశేషం. అధిక బరువుతో జన్మించిన బిడ్డకు అన్నాన్ (Annan) అని నామకరణం చేసినట్లు హైన్స్ తెలిపారు.
ఇద్దరు బిడ్డలూ.. అధిక బరువే
అయితే గతంలో తాను జన్మనిచ్చిన మెుదటి బిడ్డ కూడా అధిక బరువుతోనే పుట్టినట్లు హైన్స్ తెలిపారు. పెద్ద కుమారుడు ఆండ్రే జూనియర్ జన్మించినప్పుడు అతడి ఆయన బరువు 12 పౌండ్ల 11 ఔన్సులు (5.7 కేజీలు) ఉన్నట్లు గుర్తుచేశారు. కానీ ఈసారి పుట్టిన అన్నాన్ ఏకంగా 6.3 కేజీలు ఉండటం ప్రసవం చేసిన డాక్టర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేసిందని ఆమె పేర్కొన్నారు. గత పదేళ్లలో ఇంత బరువుతో ఏ బేబీ పుట్టలేదని వారు ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. మెుదటి బిడ్డతో పోలిస్తే రెండో బిడ్డకు ప్రసవం సమయంలో ఎక్కువ కష్టంగా అనిపించిందని హైన్స్ తెలియజేశారు.
చూడటానికి ఎగబడ్డ డాక్టర్లు
తన బిడ్డను మొదటిసారి చూసినప్పుడు కలిగిన అనుభూతిని సైతం తల్లి హైన్స్ పంచుకున్నారు. ‘బిడ్డ చాలా బరువుగా ఉన్నాడు. ఈ బాబు ఎవరిది? నిజంగా నాలోంచి వచ్చాడా? అని నాకు నేను అనుకున్నా’ అంటూ హైన్స్ నవ్వుతూ చెప్పుకొచ్చారు. ‘బిడ్డ పుట్టిన తర్వాత ఆస్పత్రిలోని చాలా మంది వైద్యులు ఆపరేషన్ గదిలోకి వచ్చారు. అన్నాన్ ను చాలా ఆసక్తిగా తిలకించారు. ఎందుకంటే రోజూ 14 పౌండ్ల బాబు పుట్టడు కదా. నా బిడ్డ పుట్టిన వెంటనే చిన్న సెలబ్రిటీగా మారిపోయాడు’ అని హైన్స్ సంతోషం వ్యక్తం చేశారు.
బిడ్డ అధిక బరువుకు అదే కారణమా?
అంతేకాదు నా బిడ్డ పెద్దయ్యాక ఇప్పుడు వచ్చిన సెలబ్రిటీ స్టేటస్ తెలియజేయాలని ఎంతో ఆత్రుతగా ఉన్నట్లు తల్లి హైన్స్ చెప్పుకొచ్చారు. ‘అన్నాన్ పెద్దయ్యాక చూపించడానికి నేను ఆత్రుతగా ఉన్నాను. చూడమ్మా.. నువ్వు వార్తల్లో వచ్చావు అని చెప్పాలని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే హైన్స్ ఆమె భర్త ఆండ్రే సీనియర్ ఇద్దరూ 6 అడుగులకు పైగా ఎత్తు ఉన్నవారే. అందుకే బిడ్డ అధిక బరువుతో జన్మించి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు.
Also Read: Dog in Class Room: టీచర్ ప్లేస్‌లో శునకం.. అవాక్కైన విద్యార్థినులు.. ఇదేందయ్యా ఇది!
నా బిడ్డ చాలా సైలెంట్: తల్లి
పుట్టి వారం రోజులే అవుతున్న అన్నాన్ గురించి.. హైన్స్ మరికొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘నా రెండో బిడ్డ చాలా ప్రశాంతమైన బాబు. ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే ఏడుస్తాడు. మిగిలిన సమయమంతా చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటాడు. మొత్తం మీద నా కుమారుడి జననంతో నేను ఎంతో ఆనందంగా ఉన్నా. ఇంత పెద్ద ఆశీర్వాదాన్ని మేము ఊహించలేదు’ అని హైన్స్ అన్నారు.