Dog in Class Room: హర్యానాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ కళాశాలలో వీధి శునకాలు హల్ చల్ చేశాయి. టీచర్లు పాఠాలు చెప్పే స్థానంలో ఓ శునకం నిద్రిస్తుండటాన్ని చూసి అప్పుడే క్లాసుకు వచ్చిన విద్యార్థినులు అవాక్కయ్యారు. మరో శునకం స్టూడెంట్స్ బ్యాగ్స్ పెట్టుకునే టేబుల్ పై నిద్రించడాన్ని గమనించి షాక్ కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
హర్యానా గురుగ్రామ్ లోని సెక్టర్ 14 ప్రాంతంలో గల మహిళా ప్రభుత్వ కళాశాలలోకి శునకాలు ప్రవేశించడం వివాదస్పదమవుతోంది. దీనిపై ఆన్ లైన్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక వ్యక్తి షేర్ చేసిన ఫొటోల్లో ఓ కుక్క క్లాస్ రూమ్ లో ప్రశాంతంగా నిద్రిస్తూ కనిపించింది. అది కూడా టీచర్ పాఠాలు బోధించే ప్రాంతంలో.. విద్యార్థినులకు ఎదురుగా పడుకొని ఉంది. మరొక ఫోటోలో స్టూడెంట్స్ బ్యాగ్స్ లేదా బుక్స్ పెట్టుకునే టేబుల్ పై ఇంకో శునకం నిద్రిస్తూ కనిపించింది. మెుదటి ఫొటోను గమనిస్తే విద్యార్థినులు ఎంతో భయంగా కుక్కను చూస్తూ కూర్చొని ఉండిపోవడం గమనించవచ్చు.
విద్యార్థినుల భద్రతపై ప్రశ్నలు
క్లాస్ రూమ్ లో శునకాలు ఉన్న ఫొటోలు వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వీధి శునకాలు.. తరగతి గదులను ఆశ్రయాలుగా మార్చుకున్నాయని పేర్కొంటున్నారు. కళాశాల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహిరించిన అధికారులపై మండిపడుతున్నారు. కాలేజీలో విద్యార్థినుల భద్రతకు ఎవరూ హామీ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
Also Read: Mirai collections: తేజ సజ్జా ‘మిరాయ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?.. సంబరాలు చేసుకుంటున్న మూవీ టీం
‘అందులో తప్పేముంది’
అయితే పైన పేర్కొన్న వాదనలతో మరికొందరు నెటిజన్లు ఏకీభవించలేదు. వారు ఈ పోస్ట్‌ను మరి అతిగా చేసి చెబుతున్నారని అభిప్రాయపడ్డారు. ఒక యూజర్ స్పందిస్తూ .. ‘మీరు భయంతో టైప్ చేస్తున్నట్టున్నారు. కానీ విద్యార్థులు బాగానే ఉన్నారు’ అన్నారు. మరొకరు ‘అందరూ ప్రశాంతంగా కనిపిస్తున్నారు. మీరు మాత్రమే ద్వేషం వ్యాప్తి చేస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో కూడా కుక్కలు క్లాసుల్లో నిద్రించేవి. అక్కడి నిర్వాహకులు వాటిని చూసుకునేవారు. ఎలాంటి సమస్య రాలేదు’ అని పేర్కొన్నారు.
📸 Scenes from Govt College for Women, Sector 14, #Gurugram.⁰#Students sit in fear, stray #dogs sleep in peace.⁰Classrooms turned into #shelters, #education takes a backseat.⁰Who ensures #safety of young #women here? Authorities silent.
Is this Millennium City college ?… pic.twitter.com/0Iie3y2FVe— Dr. Leena Dhankhar (@leenadhankhar) September 11, 2025
‘శునకం.. క్లాస్ చెప్పాలని వచ్చింది’
ఫొటోల్లో విద్యార్థినులు ఎక్కడా భయపడినట్లు కనిపించలేదని పలువురు అభిప్రాయపడ్డారు. ‘ఎవరూ భయపడుతున్నట్టుగా లేరు. మీ భయాన్ని ఇతరులపై మోపకండి’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ‘టీచర్ గా మారి పాఠాలు బోధించాలని శునకం వచ్చింది. స్టూడెంట్స్ రాకపోయే సరికి కాస్త కునుకు తీసింది. ఇందులో తప్పేముంది’ అంటూ ఇంకో యూజర్ ఫన్నీగా రాసుకొచ్చారు. మరికొందరు మద్యస్థంగా స్పందిస్తూ.. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శునకాల వల్ల ఏమైనా అసౌకర్యంగా అనిపిస్తే విద్యార్థినులు ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మెుత్తంగా గురుగ్రామ్ మహిళా కళాశాలలో కుక్కలు నిద్రించిన ఘటన నెట్టింట విస్తృత చర్చకే దారి తీసింది. డాగ్ లవర్స్ దీనిని సమర్థిస్తుంటే.. మరికొందరు తప్పుబట్టడాన్ని గమనించవచ్చు.