PDSU Demands: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీడీఎస్యూ (PDSU) ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్(Collector Lakshmi Kiran) కు వినతిపత్రం సమర్పించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ హాస్టళ్లలోని పెండింగ్ బిల్లులను చెల్లించాలని పీడీఎస్యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి కూతాటి రాణా ప్రతాప్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాణా ప్రతాప్(Rana Pratap) మాట్లాడారు.
బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్(Congress) ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం బకాయిలను విడుదల చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు. గురుకులాల్లో ఆహారం విషతుల్యం కావడం వల్ల విద్యార్థులు మరణిస్తున్న ఘటనలపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన కోరారు. అలాగే, విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని, పెండింగ్‌లో ఉన్న సంక్షేమ హాస్టల్స్ డేట్ బిల్లులను విడుదల చేయాలని పీడీఎస్యూ కోరింది. బీపీఈడీ(BPED) కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫైనల్ ఇయర్ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఫీజు కట్టాలని కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయని ఆయన ఆరోపించారు.
పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు
విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని, కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని పీడీఎస్యూ నాయకులు విజ్ఞప్తి చేశారు. అలాగే, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాణా ప్రతాప్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు కాంసారపు రవితేజ, జిల్లా నాయకులు ఎండీ అస్లాం, బాబు, రాకేష్, అజయ్ పాల్గొన్నారు.
Also Read: Virat – Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపై యువరాజ్ సింగ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు