Minister Seethakka: ములుగులో మల్టి పర్పస్ వర్కర్ మైదం మహేష్ మృతిని రాజకీయ ప్రయోజనాల కోసం కేటీఆర్(KTR) వాడుకోవడం సిగ్గుచేటని మంత్రి సీతక్క(Minister Seethakka) మండిపడ్డారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. బీఆర్‌ఎస్(BRS) పాలనలో పారిశుధ్య కార్మికులకు నెలల తరబడి జీతాలు రాక సమ్మెలు చేసిన రోజులు ప్రజలు మరిచిపోలేదన్నారు. సిరిసిల్ల నుంచి సిద్దిపేట దాకా కలెక్టరేట్ల ఎదుట సఫాయి కార్మికులు నిరసనలు చేస్తే పట్టించుకోని మీరు, నేడు మోసలి కన్నీరు కారిస్తే కార్మికులు నమ్మే పరిస్థితి లేదన్నారు.
పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న వేలాది పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల్లాగే ప్రతి నెల జీతాలు చెల్లిస్తున్నామన్నారు. గ్రీన్ ఛానెల్ విధానాన్ని ప్రవేశపెట్టి, జీతాలు ఆలస్యం కాకుండా సమయానికి చెల్లించేలా చర్యలు తీసుకున్నామన్నారు. మీ పాలనలో ఎప్పుడు జీతం వస్తుందో తెలియక ఇబ్బంది పడిన 50 వేల మందికి పైగా ఎం.పీ.డబ్ల్యూ కార్మికులకు ఇప్పుడు ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనాలు అందుతున్నాయన్నారు.
Also Read: Nandamuri Balakrishna: అక్కడ బెల్ మోగించిన తొలి సౌత్ ఇండియన్ స్టార్‌గా బాలయ్య రికార్డ్!
స్థానిక పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం
మహేష్ జీతం ఆలస్యం కావడంలో ప్రభుత్వ తప్పిదం లేదన్నారు. జీతం ప్రాసెస్ చేసే సమయంలో స్థానిక పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం వలన రెండు నెలల వేతనం ఆలస్యమైందని, రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందికి, ములుగులో వందలాది మందికి జీతాలు సమయానికి అందాయన్నారు. మహేష్ విషయంలో మాత్రమే ఇలాంటి నిర్లక్ష్యం జరిగిందని, అది కూడా స్థానిక సిబ్బంది పొరపాటుతో జరిగిందన్నారు. బాధ్యులపై తక్షణ చర్య తీసుకొని పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసి, బిల్ కలెక్టర్‌ను విధులనుంచి తొలగించామన్నారు. మహేష్ కుటుంబానికి పరిహారం అందించామని, కింది స్థాయి సిబ్బంది కారణంగా మహేష్ జీతం ఆలస్యమైంది తప్ప బడ్జెట్ లేక కాదని జీతం అందుకున్న మిగిలిన కార్మికులు, కార్మిక నాయకులు స్పష్టం చేశారన్నారు.
శవ రాజకీయాలు చేయడం కేటీఆర్ కే చెల్లింది
ములుగు నూతన మున్సిపాలిటీగా ఏర్పాటైందని, ఈ క్రమంలో పంచాయతీ పద్దు నుంచి మున్సిపాలిటీ శాఖలోకి కార్మికులను మార్చి జీతాల చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మంచి నీళ్లు అనుకుని పొరపాటున పురుగుమందు తాగానని మైదం మహేష్ స్వయంగా చెప్పిన రికార్డులు ఉన్నాయన్నారు. అయినప్పటికీ దాన్ని రాజకీయంగా వాడుకోవడం, శవ రాజకీయాలు చేయడం కేటీఆర్KTR) కే చెల్లిందని దుయ్యబట్టారు. కేటీఆర్ పదేపదే అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఒక అబద్ధాన్ని నూరుసార్లు చెప్పి నిజమని నమ్మించడమే గోబెల్స్ పాఠం అన్నారు. కానీ కేటీఆర్ దానిని మించి పోయాడని, కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు తన సొంత నియోజకవర్గంలో సర్పంచ్ లు, కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు పట్టించుకోలేదని మండిపడ్డారు. మహేష్ కుటుంబానికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
Also Read: Chicken Dosa Video: చికెన్ దోశ కోసం.. రెండుగా చీలిన సోషల్ మీడియా.. నెట్టింట ఒకటే రచ్చ!