Turakapalem Village: గుంటురు జిల్లా తురకపాలెం గ్రామం.. గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. గ్రామంలో చోటుచేసుకుంటున్న వరుస మరణాలు.. మిస్టరీగా మారిపోయాయి. కేవలం 3 నెలల వ్యవధిలో 23 మంది ప్రాణాలు కోల్పోవడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. దీంతో ఒక్కసారిగా తురకపాలెం గ్రామం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థంగాక గ్రామస్థులు సైతం భయందోళనతో జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం.. తురకపాలెం పరిస్థితిపై స్పందించారు. గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీని సైతం ప్రకటించారు. అదే సమయంలో గ్రామస్థులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
సీఎం ఏమన్నారంటే?
గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో వరుస మరణాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) కీలక సూచనలు చేశారు. గ్రామస్థులెవరూ ఊరిలో వంట చేసుకోవద్దని ఆదేశించారు. అలాగే స్థానిక నీటిని సైతం తాగొద్దని సూచించారు. అక్కడి ప్రజలకు అధికారులే ఆహారం, నీరు సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. ఫలితంగా ఇవాళ్టి నుంచి తురకపాలెం గ్రామస్తులకు మూడు పూటలా ఆహారం, మంచినీరు సరఫరా చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీ
మరోవైపు తురకపాలెంలో వరుస మరణాలకు కారణాలను కనుక్కోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గ్రామంలోని ప్రతీ ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించి.. కొత్త కేసులు నమోదు కాకుండా చూసుకోవాలని సూచించారు. అవసరమైతే ఎయిమ్స్ సహాయ బృందాలను రప్పించి.. అంతర్జాతీయ వైద్యుల సహాయం తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. తురకపాలెంను హెల్చ్ ఎమర్జెన్సీగా పరిగణించి.. నిర్దేశిత 42 వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులకు సీఎం స్పష్టం చేశారు. దీంతో శని, ఆదివారాల్లో ప్రత్యేక వైద్య బృందాలు గ్రామంలో పర్యటించి.. వైద్య పరీక్షలు నిర్వహించనున్నాయి.
మరణాలకు అదే కారణమా?
తురకపాలెంలో చోటుచేసుకుంటున్న మిస్టరీ మరణాలకు గ్రామంలోని సంజీవయ్య కుంట నుంచి సరఫరా అయ్యే కలుషిత నేరే కారణం కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ నీరు తాగడం వల్ల పలువురు గ్రామస్తులకు చర్మవ్యాధులు, జ్వరాలు వంటి సమస్యలు తలెత్తాయని చెబుతున్నారు. మరికొందరు వైద్య నిపుణులు.. ఈ మరణాలకు ‘మెలియాయిడోసిస్’ అనే ప్రమాదకర ఇన్ ఫెక్షన్ కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కలుషిత నీరు లేదా మట్టి ద్వారా ఇది వ్యాపిస్తుందని చెబుతున్నారు.
Also Read: Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు
ఆరోగ్య శాఖ మంత్రి పర్యటన
గుంటూరు జిల్లా తురకపాలెంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించారు. గ్రామస్థులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. స్థానికుల ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు. గ్రామంలోని ప్రతి వ్యక్తికి తక్షణ ఆరోగ్య పరీక్షలు (కిడ్నీ, షుగర్, బీపీ టెస్టులు మొదలైనవి) నిర్వహించాలని, ఇప్పటికే ప్రారంభమైన వైద్య చర్యల ప్రగతిపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇవ్వాలని మంత్రి కోరారు.