Women Mounted Police: అతివలు అనుకుంటే అసాధ్యమేదీ లేదంటారు. మహిళా అశ్విక దళం సిబ్బంది ఇదే విషయాన్ని నిరూపించారు. రెండు నెలలపాటు సాగిన కఠోర శిక్షణను పూర్తి చేసుకున్న మహిళా మౌంటెడ్ పోలీసులు(Women Mounted Police) కార్యరంగంలోకి దూకారు. లక్షలాది మంది పాల్గొనే వినాయక నిమజ్జన శోభాయాత్ర బందోబస్తులో పాలు పంచుకోనున్నారు. రాష్ట్ర పోలీసు శాఖలో మౌంటెడ్ పోలీసులది కీలక పాత్ర.
75 సంవత్సరాలుగా పని చేస్తున్న ఈ విభాగంలో ఇప్పటి వరకు పురుష కానిస్టేబుళ్లే పని చేస్తూ వస్తున్నారు. కాగా, అశ్విక దళంలో అతివలను కూడా చేర్చి దేనిలోనూ వాళ్లు తక్కువ కాదని నిరూపించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీ.వీ.ఆనంద్(C.V.Anand) నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆర్మ్ డ్ రిజర్వ్ డ్ (ఏఆర్) విభాగానికి ఎంపికైన మహిళా కానిస్టేబుళ్ల(women constables)కు ఆసక్తి ఉంటే అశ్విక దళంలో చేరవచ్చని సూచించారు. ఈ క్రమంలో పది మంది మహిళా కానిస్టేబుళ్లు మౌంటెడ్ పోలీస్ విభాగంలో చేరటానికి ముందుకొచ్చారు.
Also Read: Shilpa Shetty fraud: ఆ దంపతులకు లుక్అవుట్ నోటీసులు అందజేత.. ఇక అదే తరువాయి!
2 నెలలపాటు…
ధైర్యం చేసి అశ్విక దళంలో చేరటానికి ముందుకొచ్చిన పది మంది మహిళా కానిస్టేబుళ్లకు గోషామహల్ పోలీస్ స్టేడియం(Goshamahal Police Stadium)లో రెండు నెలలపాటు కఠోర శిక్షణ ఇచ్చారు. గుర్రాలను మచ్చిక చేసుకోవటం. వాటిపై స్వారీ చేయటం తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ట్రెయినింగ్ ఇచ్చారు. శిక్షణ పూర్తి కావటంతో శుక్రవారం మహిళా అశ్విక దళాన్ని రంగంలోకి దింపారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆనంద్ మాట్లాడుతూ మహిళా అశ్విక దళాన్ని బందోబస్తు, వీఐపీల భద్రత, పెట్రోలింగ్ వంటి విధులకు వినియోగించుకోనున్నట్టు చెప్పారు.
అన్ని రంగాల్లో మహిళలు ముందు ఉండాలన్న ఉద్దేశ్యంతోనే పోలీసు విభాగంలోకి మహిళా మౌంటెడ్ పోలీసులను ప్రవేశ పెట్టామన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని ముందు ముందు మరింత మంది మహిళా కానిస్టేబుళ్లు అశ్విక దళంలో చేరుతారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. లక్షలాది మంది పాల్గొనే నిమజ్జన ఊరేగింపులో మహిళా అశ్వికా దళం పాలు పంచుకోనున్నట్టు చెప్పారు. ఖచ్చితంగా ఈ దళం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు.
Also Read: MLA Donthi Madhava Reddy: చర్చనీయాంశంగా మారిన ఆ ఎమ్మెల్యే తీరు.. కారణం అదేనా..?