Panchayat Elections: స్థానిక ఎన్నికలకు యంత్రాంగ సమాయత్తం
గ్రామపంచాయతీల ఓటర్ల తుది జాబితా రెడీ
పోలింగ్ కేంద్రాల వివరాలు వెల్లడి
జిల్లాలో 255 పంచాయతీలు, 13 జెడ్‌పీటీసీ స్థానాలు
గ్రామాల్లో వేడెక్కిన రాజకీయం
ఏర్పాట్లలో యంత్రాంగం బిజీబిజీ
ఇక నోటిఫికేషనే తరువాయి
గద్వాల, స్వేచ్ఛ: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు (Panchayat Elections) అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా తుది ఓటరు జాబితాను జిల్లా అధికారులు ఇటీవలే ప్రకటించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల సంఖ్య లెక్క తేల్చారు. గ్రామపంచాయతీ పాలక వర్గాలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అని ఆశావహులు కూడా ఎదురు చూస్తున్నారు. నిరీక్షణకు తెరదించుతూ ఈ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఓటర్ల తుది జాబితా కూడా ప్రకటించడంతో రిజర్వేషన్లు, నోటిఫికేషన్లపై జనాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
13 మండలాలలో..
2018వ సంవత్సరంలో స్థానిక ఎన్నికలు జరిగే సమయానికి ఎర్రవల్లిని నూతన మండలంగా ఏర్పాటు చేయలేదు. దీంతో నూతన మండలంతో కలిపి జిల్లాలో మొత్తం 13 మండలాలు ఉన్నాయి. వీటిలో 255 గ్రామ పంచాయతీలు, 2,390 వార్డులు ఉన్నాయి. ఇక, 142 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 3,93,418 మంది ఉండగా అందులో పురుషులు 1,93,627, మహిళలు 1,99,781 మంది, ఇతరులు 10 మంది ఉన్నారు.
Read Also- Allu Arjun and Anushka: ‘పుష్ప’ యూనివర్స్‌లో ‘ఘాటి’ కూడా భాగమా?.. పుష్పరాజ్‌తో షీలావతి!
గ్రామాలలో పడకేసిన పాలన
గ్రామపంచాయతీ పాలకవర్గాల పదవీకాలం గత సంవత్సరం ఫిబ్రవరితో ముగిసింది. 20 నెలల పాటు ప్రత్యేక అధికారుల పాలన గ్రామాలలో కొనసాగినా నిధుల లేమితో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో కనీస అవసరాలు తీర్చలేని పరిస్థితి దాపురించింది. తమ సొంత జేబు నుంచి తప్పనిసరి కార్యక్రమాలను నిర్వహించాల్సి వచ్చింది. పారిశుధ్య నిర్వహణ మరీ అధ్వానంగా మారింది. దీనికి ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసినా, ఇంతవరకు స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడమే దీనికి ప్రధాన కారణంగా ఉంది. ఎన్నికలు జరిగి ఉంటే కేంద్ర నిధులు వచ్చి గ్రామాలలో అభివృద్ధి పనులు ఊపందుకునే అవకాశం ఉండేది.
Read Also- Nur Khan Airbase: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్‌లోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ వద్ద తాజా పరిస్థితి ఇదీ..
పల్లెల్లో జోరుగా చర్చ
పల్లెల్లో ఎక్కడ చూసినా స్థానిక ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆశావహులు రెండేళ్లుగా ప్రయత్నాలు చేసుకుంటున్నా.. ఎన్నికలు వాయిదా పడుతుండటంతో ఉసూరుమంటున్నారు. ఎట్టకేలకు ఓటరు జాబితా వెలువడటంతో ఆశలు చిగురించాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్.. కనీసం వార్డు సభ్యుడిగానైనా బరిలోకి దిగి ఉప సర్పంచ్ పదవినైనా చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఏదో ఒకదానికి రిజర్వేషన్ కలిసి రాకపోదా అని ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ సారి చాలా గ్రామాల్లో ఆశావహులే వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయించడమే కాకుండా, చందాలు కూడా విరివిగా ఇచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో బీసీ యువకులు,పెద్దలు సైతం సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ, తరచుగా ప్రజలను కలుస్తూ, ఆప్యాయంగా పలకరిస్తూ పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.