Tummala Nageswara Rao: కేంద్రం తీసుకొచ్చిన ప్రధాన్ మంత్రీ ధన్-ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై)లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Minister Shivraj Singh Chouhan)తో భేటీ అయ్యారు. రాష్ట్ర రైతుల సమస్యలను వివరించారు. పీఎండీడీకేవైలో తెలంగాణ జిల్లాల చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ కేంద్రం రూ.24వేలకోట్ల వార్షిక వ్యయంతో ఆరేళ్ల పాటు అమలు చేయబోతున్న ఈ యోజన 36 కేంద్ర పథకాల సమన్వయంతో పాటు రాష్ట్ర పథకాలతో అనుసంధానం అవుతూ, ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని వినియోగించుకోవడం ద్వారా తక్కువ పనితీరు చూపుతున్న జిల్లాలకు విస్తృతంగా లాభం చేకూరుస్తుందన్నారు.
Also Read: OG USA Box Office: యూఎస్‌లో ‘ఓజీ’ తుఫాన్.. ప్రీ సేల్స్‌లో ఆ మార్క్ దాటిన సినిమాగా రికార్డ్
ఆహార భద్రత, విలువవృద్ధి
ఉత్పాదకత పెంపు, పంటల వైవిధ్యీకరణ, నీటిపారుదల, నిల్వ, విలువవృద్ధి వంటి అంశాల్లో ఇది ఒక చారిత్రాత్మక పథకం అన్నారు. తెలంగాణలోని నారాయణపేట, ములుగు, కొమురంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడం జిల్లాలను పీఎండీడీకేవై లక్ష్యం జిల్లాల జాబితాలో చేర్చాలని కోరారు. ఈ జిల్లాలు వర్షాధార పద్ధతులపై అధికంగా ఆధారపడిన, తక్కువ ఉత్పాదకత కలిగిన, బలహీన రైతు వర్గాలను కలిగి ఉన్నాయన్నారు. ఈ పథకంలో చేర్చడంతో తెలంగాణ రైతుల సంక్షేమమే కాకుండా దేశవ్యాప్తంగా ఆహార భద్రత, విలువవృద్ధి, ఉపాధి అవకాశాల పెంపునకు తోడ్పడుతుందని వివరించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అగ్రికల్చరల్ యూనివర్శిటీలు భాగస్వామ్యంతో బలమైన జిల్లా స్థాయి ప్రణాళికలను సిద్ధం చేస్తుందని, అలాగే డిజిటల్ మానిటరింగ్ ద్వారా పారదర్శకతను నిర్ధారిస్తామని హామీ ఇచ్చారు.
1.06 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్
నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ అమలు క్రమంలో తెలంగాణ చేసిన కృషిని వివరించారు. రాష్ట్రంలో 1.06 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని, దేశంలోనే అత్యధిక విస్తీర్ణం తెలంగాణదేనని తెలిపారు. దాదాపు 72 వేల మంది రైతులు ఈ పంటపై ఆధారపడుతున్నారని గుర్తు చేశారు. ఇటీవల క్రూడ్ పామ్ ఆయిల్ పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 27.5% నుంచి 16.5%కి తగ్గించడం రైతులకు తీవ్ర సమస్యగా మారిందని, దీని వల్ల దేశీయ ధరలు క్షీణించి రైతులకు చెల్లించే ఫ్రెష్ ప్రూట్ బన్చేస్ ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయిల్ పామ్ గెలల టన్నుకు కనీస మద్ధతు ధర రూ.25వేలు వచ్చేలా 2018లో ఉన్నట్లుగా 44% దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించేలా చొరవ తీసుకోవాలని కోరారు. వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, ఉద్యానవనాల కోసం మైక్రో ఇరిగేషన్ పరికరాలపై విధిస్తున్న 12% జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని విజ్ఞప్తి చేశారు.
యూరియాపై ఎక్కువ సబ్సిడీ
ప్రస్తుతం వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, ఉద్యానవనాల కోసం మైక్రో ఇరిగేషన్ పరికరాలపై 12% జీఎస్టీ విధించడం, రైతులపై తీవ్రమైన ఆర్థిక భారంగా మారిందని, ముఖ్యంగా చిన్న మరియు సన్న రైతులు(Farmers) ఆధునిక పరికరాలను కొనుగోలు చేయలేకపోతున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా వ్యవసాయంలో యాంత్రీకరణ, ఆధునిక పద్ధతుల వినియోగం మందగిస్తుందని వివరించారు. ఫాస్ఫేటిక్ మరియు పొటాషిక్ ఎరువులపై సబ్సిడీ పెంపు అవసరాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. ప్రస్తుతం న్యూట్రిన్ట్ బేస్డ్ సబ్సిడీ( ఎన్బీఎస్ ) విధానంతో యూరియాపై ఎక్కువ సబ్సిడీ ఉందని, రైతులు దానిని విస్తృతంగా వినియోగిస్తున్నారని, ఫలితంగా భూమిలో నత్రజని అధికమై, ఫాస్పరస్, పొటాషియం, సల్ఫర్ వంటి పోషకాల వినియోగం తగ్గిపోతుందని వివరించారు. దీనివల్ల నేలలో పోషక సమతుల్యత దెబ్బతింటోందని, పంట దిగుబడులు కూడా దీర్ఘకాలంలో పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎరువులపై ఏకరీతీ సబ్సిడీ విధానం
పాస్పరస్ (పీ), పొటాషియం (కే), సల్ఫర్ (ఎస్) వంటి పోషకాలపై సబ్సిడీ పెంచి యూరియాతో సమానంగా ధరలో సమతుల్యత తీసుకురావాలన్నారు. అంతర్జాతీయ ధరల మార్పులను దృష్టిలో పెట్టుకుని, సబ్సిడీ నిర్మాణాన్ని పునః సమీక్షించాలన్నారు. అన్ని ఎరువులపై ఏకరీతీ సబ్సిడీ విధానం తీసుకువచ్చి, సమతుల్య ఎరువుల వినియోగానికి ప్రోత్సాహం కల్పించి, వ్యవసాయం భవిష్యత్తు, భూమి సారవంతత మరియు దేశ ఆహార భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తుమ్మల తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్ రావు, రెసిడెంట్ కమిషన్ ఉప్పల్ పాల్గొన్నారు.
Also Read: Nur Khan Airbase: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్‌లోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ వద్ద తాజా పరిస్థితి ఇదీ..