Tunnel Telugu Trailer: అథర్వా మురళీ (Atharvaa Murali) తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించారు. ఆ సినిమాలో ఆయన పాత్రకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. అలాగే అథర్వా మురళీకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అతను క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌ను ఎంచుకున్నాడoటే పక్కా హిట్ అనేలా, ఇప్పటి వరకు ఆయన చేసిన ఆ జానర్ చిత్రాలు నిరూపించాయి. ప్రస్తుతం అథర్వా మురళీ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ జానర్‌లో ‘టన్నెల్’ అనే మూవీని చేశారు. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) హీరోయిన్‌గా నటించగా, అశ్విన్ కాకుమాను విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో ఎ. రాజు నాయక్ తన లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. అందులో భాగంగా తాజాగా చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
ట్రైలర్ ఎలా ఉందంటే..
ఇందులో అథర్వా మురళీ సాధారణ పోలీస్‌గా కనిపిస్తున్నారు. ఒక ‘టన్నెల్‌లో ఉన్న విలన్‌ని చూపిస్తూ.. ‘ఎవర్రా నువ్వు?’ అని పోలీస్ సమూహం అడుగుతున్నట్లుగా ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత కొత్తగా హీరో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో జాయిన్ అయినట్లుగా చూపించారు. వెంటనే అథర్వా మురళీ లవ్ ట్రాక్‌ని పరిచయం చేశారు. ఇందులో లావణ్య త్రిపాఠి, అధర్వ కాంబో చాలా ఫ్రెష్‌గా అనిపిస్తోంది. వారి ప్రేమ కథకు కూడా ట్విస్ట్‌లు ఉన్నట్లుగా చూపించారు. హీరోయిన్ ఎమోషన్ సీన్లు, తండ్రి ఎమోషన్ సీన్స్‌తో ఇందులో ఉన్న మరో కోణాన్ని తెలియజేశారు. ఆ తర్వాత ట్రైలర్ సీరియస్ మోడ్‌లో నడిచింది. విలన్ గ్యాంగ్‌ని వెతుక్కుంటూ పోలీసులు వెళ్లడం, పోలీసుల్ని విలన్ చంపేసి, వారి వెంట పడటం సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. అప్పటి వరకు పారిపోయిన హీరో.. ఒక్కసారిగా విలన్‌కు ఎదురు తిరిగి ‘ఈ యూనిఫామ్ వేసుకున్న తరువాత అందరూ ఫ్యామిలీనే రా’ అంటూ విలన్‌తో వీరోచితంగా పోరాడటం చూపించారు. మనమిదంతా ఎందుకు చేస్తున్నామో తెలుసా? అని విలన్ చెబుతున్న డైలాగ్ చూస్తుంటే.. టన్నెల్ సినిమా ఎలా ఉంటుందో అర్థమవుతోంది. గ్రిప్పింగ్, అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో వచ్చిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తోంది.
Also Read- Coolie OTT: అఫీషీయల్.. ‘కూలీ’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే..
మిరాయ్, కిష్కింధపురి సినిమాలకు పోటీగా..
‘టన్నెల్’ చిత్రం సెప్టెంబర్ 12న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అయితే ఇది డబ్బింగ్ చిత్రం. అదే రోజు తెలుగులో రెండు స్ట్రయిట్ సినిమాలు రాబోతున్నాయి. అందులో ఒకటి పాన్ ఇండియా సినిమా కూడా ఉంది. తేజ సజ్జా ‘మిరాయ్’ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా అదే రోజు వస్తుంటే, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ‘కిష్కింధపురి’ కూడా అదే రోజున విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ తాజాగా ప్రకటించారు. మొత్తంగా మూడు సినిమాలలో ఏ సినిమా విజయాన్ని అందుకుంటుందో తెలియదు కానీ, ప్రమోషన్స్ పరంగా మూడు సినిమాల నిర్మాతలు రంగంలోకి దిగారు. అథర్వా మురళీ ట్రాక్ రికార్డ్ ప్రకారం ఈ జానర్ ఆయనకు ప్లస్ అయ్యే అవకాశం లేకపోలేదు. చూద్దాం.. బాక్సాఫీస్ వద్ద సెప్టెంబర్ 12న ఏం జరగబోతోందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు