CM Revanth Reddy( image CREDIT: SWETCHA REPORTER)
Politics

CM Revanth Reddy: పాలమూరు జిల్లాలో విద్య వైద్యం సాగు నీటి ప్రాజెక్టులు పూర్తికి ప్రాధాన్యం.. సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు త్రాగు నీరును అందిస్తున్నాయనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును గ్రీన్ ఛానల్ ద్వారా త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు సీఎం తెలిపారు. బుధవారం దేవరకద్ర నియోజకవర్గం వేముల గ్రామపంచాయతీ పరిధిలోనీ ఎస్ జి డి కార్నింగ్ టెక్నాలజీస్ రెండవ యూనిట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాదు రాష్ట్రానికి ఆనాడు జిల్లా నుండి బూర్గుల రామకృష్ణారావుకు ముఖ్యమంత్రిగా అవకాశం వస్తే మళ్లీ 75 సంవత్సరాల తర్వాత తన రూపంలో పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చిందన్నారు.

Also Read: CM Revanth Reddy: అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాలే.. బీఆర్ఎస్‌లో చిచ్చుపెట్టింది.. సీఎం రేవంత్

గత పాలకుల నిర్లక్ష్యం

ఈ ఐదేళ్లలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా(Mahabubnagar District) ను అన్ని రంగాలలో అగ్రగామిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. ఒకప్పుడు పాలమూరు జిల్లా కరువును వలసలను చూపించి నిధులు రాబట్టడానికి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులను ఈ ప్రాంతానికి అప్పటి ప్రభుత్వ పెద్దలు తీసుకువచ్చేవారన్నారు. ప్రపంచవ్యాప్తంగా నిర్మాణమైన ప్రాజెక్టులలో పాలమూరు లేబర్ లేని ప్రాజెక్టు లేదంటే అతిశయోక్తి కాదన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఈ ప్రాంత ప్రజానీకానికి సాగునీరు, విద్య పూర్తిస్థాయిలో అందకపోవడం వల్లే అన్ని వనరులు ఉన్న కరువు జిల్లాగా మారిపోయిందన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతానికి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి నీ మోడల్ గా స్వీకరించడానికి స్టడీ టూర్ల కోసం విదేశీ ప్రతినిధులు వచ్చేలా ఈ ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు.

జిల్లాకు 200 కోట్ల రూపాయలు

జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఒక్కో జిల్లాకు 200 కోట్ల రూపాయల వ్యయంతో 20 నుంచి 25 ఎకరాల స్థలంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను 2800 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోతున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతం నుండి అత్యుత్తమ మానవ వనరులను తయారు చేయాలనే లక్ష్యంతో బాసర తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తదుపరి మొట్టమొదటి ట్రి పుల్ ఐటీ కళాశాలను కూడా మహబూబ్ నగర్ కే మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు కూడా నెలకొల్పనున్నట్లు తెలిపారు. ఈ స్కిల్స్ సెంటర్లలో శిక్షణ పొందిన యువత ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో అత్యుత్తమ ప్యాకేజీలతో ఉద్యోగాలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నెలకొల్పిన యూనివర్సిటీలే ఉన్నాయి తప్పిస్తే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత ప్రభుత్వం ఒక కొత్త యూనివర్సిటీకి కూడా నాంది పలకలేదన్నారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు శ్రీకారం

తెలంగాణ యువత ప్రపంచంలోనే అత్యుత్తమ స్కిల్డ్ మ్యాన్ పవర్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే స్కిల్ యూనివర్సిటీని సైతం ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు. జిల్లాలో 2008లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలమూరు యూనివర్సిటీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏమాత్రం అభివృద్ధి చెందలేదన్నారు. తమ అధికారంలోకి వచ్చాక యూనివర్సిటీ లో కోర్సులను పెంచడమే కాకుండా యూనివర్సిటీకి అనుబంధంగా లా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ లను సైతం మంజూరు చేసినట్లు తెలిపారు. విద్యాపరంగా జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు తెలిపారు. పాలమూరు బిడ్డలు వలసల భారీ నుండి బయట పడాలంటే చదవకటి మార్గమని ఈ ప్రాంతం నుండి ఇంజనీర్లు డాక్టర్లు కాదు ఐఏఎస్లు ఐపీఎస్ లుగా దేశానికి సేవ చేసే స్థాయికి ఎదగాలన్నారు. కాంగ్రెస్ పార్టీ హయంలోనే జూరాల, భీమా, నెట్టెంపాడు, సంగం బండ, కోయిల్ సాగర్, కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. గత పదేళ్లలో గత ప్రభుత్వం పై ప్రాజెక్టులలో దేనిని కూడా పూర్తిచేసే ప్రయత్నం చేయలేదన్నారు.

 Also Read: CM Revanth Reddy: లబ్ధిదారుల క్షేమ సమాచారం తెలుసుకున్న.. సీఎం రేవంత్ రెడ్డి

రైతులకు ఎకరానికి 14 లక్షలు

కొడంగల్ నారాయణపేట మక్తల్ నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు రూపొందించిన కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి యుద్ధ ప్రాతిపదికన 4000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రాజెక్టు పనులను వేగవంతం చేసినట్టు తెలిపారు. గతంలో ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన వారికి 11 లక్షలకు మించి నష్టపరిహారం ఇవ్వలేదన్నారు, తమ ప్రభుత్వం కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి 14 లక్షలు ఇస్తున్నట్టు తెలిపారు. కోస్గి ప్రాంతం కమర్షియల్ గా అభివృద్ధి చెందింది కాబట్టి ఆ ప్రాంత ప్రజలకు 20 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నట్లు తెలిపారు. గత నాయకత్వ నిర్లక్ష్యం వల్లే ఇప్పటికి ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తికాలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి లో భాగమైన ఉదండపూర్ ప్రాజెక్టును పూర్తి చేయాలని తమ ప్రయత్నిస్తుంటే… ప్రతిపక్షాలు కేసులు వేసి అడ్డుకునే కుట్రలు చేస్తున్నాయన్నారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్, ఎంప్లాయిమెంట్ ఇవే జిల్లా రూపురేఖల్ని మారుస్తాయని, ఆ దిశ వైపుగా తాను, జిల్లా మంత్రులు, శాసనసభ్యులు, అధికార యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తున్నట్లు తెలిపారు.

మొదటి ముద్ద పాలమూరు ప్రజానీకానికే

డిఫెన్స్ రంగంలో లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని హైదరాబాదు బెంగళూరు మధ్యలో డిఫెన్స్ కారిడార్ ను ఏర్పాటు చేస్తే తెలంగాణకే అత్యధిక ప్రయోజనాలు ఉంటాయన్నారు. రాష్ట్రానికి వచ్చే ఏ పరిశ్రమనైనా మొట్టమొదటిగా జిల్లాకే పంపిస్తామన్నారు. ఈ ప్రాంత బిడ్డనైనందుకు పాలమూరు ప్రజలకే మొట్టమొదటి ముద్ద దక్కేలా కృషి చేస్తానన్నారు. రాజకీయాల కతీతంగా ప్రతి ఒక్కరూ జిల్లా అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. రాజకీయ కారణాలతో అభివృద్ధినీ అడ్డుకుంటే మనకు మనమే మరణశాసనం రాసుకున్న వాళ్ళమవుతామన్నారు. అవినీతి సొమ్ము పంపకంలో తేడా రావటం వల్లే కల్వకుంట్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు గత పదేళ్లుగా రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతికి పాల్పడి సంపాదించిన డబ్బుల పంపకంలో తేడాలు రావడం వల్లే కల్వకుంట్ల కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు పొడసూపాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

మొహం పై నవ్వు పూసుకుని కడుపులో కత్తులు దూసుకునే స్థాయికి వారు దిగజారారన్నారు. ఓవైపు సంతోష్ రావు హరీష్ రావు వైపు, మరోవైపు కల్వకుంట్ల కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడంటూ ప్రచారాలు వస్తున్నాయని, ప్రజలు తిరస్కరించిన వారి వెనుక తాను ఎలా ఉంటానన్నారు. భారత రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన పార్టీలు ప్రస్తుతం కనుమరుగయ్యాయని, అలాంటిది బీఆర్ఎస్ లాంటి పార్టీ కూడా కాలగర్భంలో కలిసిపోక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి , రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి,రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి, మహబూబ్ నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నారాయణపేట శాసనసభ్యులు పర్ణికా రెడ్డి, షాద్ నగర్ శాసన సభ్యులు ఈర్లపల్లి శంకర్, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహ రెడ్డి, ఎస్.జి.డి టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ సర్జిత్, సుధీర్, తదితరులు పాల్గొన్నారు .

చారిత్రాత్మక ప్రాజెక్టులు: దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి

ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర శాసన సభ్యులు జి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు బిడ్డ అయిన ఎ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నందుకు జిల్లాతో పాటుగా తమ దేవరకద్ర నియోజకవర్గానికి కూడా చారిత్రాత్మక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంవత్సరానికి 20 వేల కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చి నెరవేరుస్తున్నారని చెప్పారు. దేవరకద్ర నియోజకవర్గంలో ఇప్పటికే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో పాటు డిగ్రీ కళాశాల, వైద్య శాలలు మంజూరు చేయడం జరిగిందన్నారు.

రోడ్డు నిర్మాణానికి 110 కోట్లు

కురుమూర్తి దేవస్థానానికి ఘాటు రోడ్డు నిర్మాణానికి 110 కోట్లు మంజూరు చేయగా పనులు నడుస్తున్నాయన్నారు. దేవరకద్రకు నూతనంగా కోర్టు మంజూరు అయిందన్నారు. నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నియోజకవర్గం పొడవున జాతీయ రహదారి ప్రాంతాల్లో పరిశ్రమల కారిడార్ ఏర్పాటు చేయాలని కోరారు. దేవరకద్ర నియోజకవర్గంలో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీకి కంపెనీ వ్యవస్థాపకులతో మాట్లాడి బ్రహ్మోస్ పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా ఏర్పడిన దేవరకద్ర మున్సిపాలిటీకి 30 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. అదేవిదంగా కొత్తకోట మున్సిపాలిటీలో ఒక డిగ్రీ కళాశాల మంజూరు చేయాల్సిందిగా కోరారు. జాతీయ రహదారి పై ప్రమాదాలు జరిగితే ప్రాణాలు కాపాడేందుకు ముసాపేట వద్ద ఒక ట్రామా కేర్ యూనిట్ మంజూరు చేయాల్సిందిగా కోరారు.

Also Read: KTR: కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమాగం.. కేటీఆర్ సంచలన కామెంట్స్

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?