MP Laxman: రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించడంపై రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్(MP Laxman) స్పందించారు. నిజం నిగ్గు తేల్చేది సీబీఐ మాత్రమేనని రేవంత్ కు కనువిప్పు కలిగిందని ఆయన వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్(Krishna Mohan) కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. కృష్ణ మోహన్ చేరిక పార్టీకి బలాన్ని చేకూరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా రెండు రోజుల సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని చురకలంటించారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు సీబీఐ విచారణకు అప్పగించారని ఎద్దేవాచేశారు.
కాలయాపన కోసమే పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటుచేశారని లక్ష్మణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. విధిలేని పరిస్థితుల్లో సీబీఐకి అప్పగించారన్నారు. ఆధారాలన్నీ మాయం చేసేందుకే పీసీ ఘోష్ కమిషన్ ను నియమించారా? అని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని గతంలో మాట్లాడారని, ఆ ఆధారాలన్నిటిని సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్(BRS) కు పట్టిన గతే కాంగ్రెస్(Congress) కు పడుతుందని విమర్శలు చేశారు. సీబీఐ విచారణకు అప్పగించేందుకు 22 నెలల సమయం ఎందుకు తీసుకున్నారని లక్ష్మన్ ప్రశ్నించారు. ప్రజలకు ఉన్న అనుమానాలు నివృతి చేయాలని తెలిపారు.
Also Read: MCPI leaders: వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్.. ఎక్కడంటే?
బీసీల కోసం సర్వే చేశారా?
ఇకపోతే బీసీ బిల్లు(BC Bill)పై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని లక్ష్మణ్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే ఇంతకాలం సమయాన్ని ఎందుకు వృథా చేసినట్లని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీసీ(BC) బిల్లుపై మొదటి నుంచి ద్వంద్వ వైఖరి పాటిస్తోందని పేర్కొన్నారు. వెంకటేష్ కమిషన్ సర్వేతో జాప్యం చేశారని, ఒకసారేమో ఆర్డినెన్స్ అన్నారని, మరోసారి ఢిల్లీ వెళ్లి స్వయంగా సీఎం ధర్నా చేశారన్నారు. అసలు న్యాయపరమైన చిక్కులకు కాంగ్రెస్ తీసుకున్న చర్యలేంటని లక్ష్మణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నెపంతో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుంటే ప్రజలు కర్రు కాల్చి వాతపెడతారన్నారు.
బీసీల కోసం సర్వే చేశారా? ముస్లింల కోసం వారు సర్వే చేశారా? అని ఎద్దేవాచేశారు. బీసీలను మోసం చేయడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని మండిపడ్డారు. బిల్లు పెట్టడమే కాదు బిల్లు పాసయ్యేలా సీఎం రేవంత్ పూర్తి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. 42 శాతం పూర్తిగా బీసీలకే రిజర్వేషన్లు ఇస్తామంటే దానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. బీసీల రిజర్వేషన్లు తగ్గించింది కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS), వైఎస్సార్ సీపీ(YSRCP) అని ఆయన ధ్వజమెత్తారు.
బీజేపీలో చేరిక
రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య(R Krishnaiah) మాట్లాడుతూ.. వకుళాభరణం కృష్ణమోహన్ బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కృష్ణమోహన్ చేరికతో మేధావి వర్గం హర్షం వ్యక్తం చేస్తుందని తెలిపారు. ఆయన అనేక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారన్నారు. కాంగ్రెస్ సర్కార్ పాలనతో రాష్ట్రం అప్పులపాలైందని విమర్శలు చేశారు. తెలంగాణలో అవినీతి పాలన కొనసాగుతోందని ఆరోపించారు. ప్రజలు రాజకీయాలంటేనే అసహ్యించుకునేలా మారాయని కృష్ణయ్య మండిపడ్డారు.
Also Read: Rohit Sharma: రోహిత్ శర్మకు ‘బ్రాంకో’ ఫిట్‌నెస్ టెస్ట్.. రిజల్ట్ ఏం వచ్చిందంటే?