Harish Rao: కాళేశ్వరంపై కమిషన్ రిపోర్టు కోర్టు ముందు నిలబడదు.. ఇది డొల్ల రిపోర్టు, చెత్త రిపోర్టు అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Harish Rao) అన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిటీ తమ హక్కులను కాలరాసిందని ఆరోపించారు. ‘పీసీ ఘోష్ ఎఫెక్ట్ పీపుల్ అయిన మా హక్కులను కాలరాశారు. మాకు 8బీ కింద నోటీసులు ఇవ్వలేదు.. మాపై చేయబోతున్న ఆరోపణల గురించి ఆ వివరాలు చెప్పి.. దానిపై మా వివరణ తీసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది.. దాన్ని ఆయన అనుసరించలేదు.
సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తాం
నాకుగానీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)కు గానీ, ఇంకా పిలిచిన నేతలు, అధికారులకు కూడా నాకు తెలిసిన వరకు 8బీ కింద నోటీసులు ఇవ్వలేదు.. క్రాస్ ఎగ్జామినేషన్‌కు అవకాశం ఇవ్వలేదు.. ఈ విచారణ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్నారు. కాళేశ్వరం నివేదికపై ఆదివారం అసెంబ్లీలో చర్చించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసలు మేడిగడ్డ వద్ద లోపం ఏర్పడక ముందే కాళేశ్వరంపై దుష్ప్రచారాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రారంభించారని, కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో కూడా మేం సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని ముందే మేనిఫెస్టోలో పెట్టిందన్నారు.
కాంగ్రెస్ ముందు నుంచి కూడా ఈ ప్రాజెక్టు కడితే కేసీఆర్,(kcr) బీఆర్‌ఎస్‌కు ఎక్కడ పేరు వస్తుందోనని కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారని మండిపడ్డారు. భూ సేకరణను అడ్డుకున్నారని, అనేక ఆరోపణలు చేస్తూ వచ్చారని, దాంట్లో భాగంగానే ఈ ఘోష్ కమిషన్ వేసి రాజకీయమైన కక్ష సాధింపునకు ఈ ప్రభుత్వం దిగుతుందన్నారు. ఆ వాస్తవాలు చట్టానికి లోబడి ఉండాలని, ఘోష్ కమిషన్ రిపోర్ట్‌లో ఎక్కడా లేదని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని అన్నారు. తమ్మిడి హెట్టి దగ్గర నీళ్లు లేవని కేంద్ర జలసంఘం చెప్పడంతోనే మేడిగడ్డ దగ్గర నిర్మాణం చేపట్టామన్నారు.
Also Read: Kaleshwaram project: లక్షకోట్ల ప్రాజెక్టు నాలుగేళ్లలో కుప్పకూలింది.. ఆ పాపం ముమ్మాటికి కేసీఆర్ దే!
డ్రామా కంపెనీ నడుపుతున్నారా? కక్ష సాధింపులకే కమీషన్లు?
అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రైమరీ రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఇంటీరియం రిపోర్టు, బీఆర్ఎస్(BRS) రజతోత్సవ సభ సమయంలో తుది రిపోర్టు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఘోష్ కమిషన్ రిపోర్టు అని, ప్రభుత్వం నడుపుతున్నారా..? డ్రామా కంపెనీ నడుపుతున్నారా? అని మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపులకే కమీషన్లు? అని ధ్వజమెత్తారు. నేడు తెలంగాణ రైతుల కష్టాలు తీర్చిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్ర పూరితంగా వేసిన కమిషన్.. విధివిధానాలను కాలరాస్తూ, చట్టాన్ని తుంగలో తొక్కుతూ, ప్రతివాదనలకు అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా ఇచ్చిన రిపోర్టును మేము విమర్శిస్తే మాత్రం తప్పు అంటారా? అని నిలదీశారు. మీపై వేసిన కమీషన్లను మీరు వ్యతిరేకిస్తే తప్పు కాదు, కానీ మేము వ్యతిరేకిస్తే తప్పా. ఇదేం నీతి.. ఇదే కదా కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ అంటే అని ధ్వజమెత్తారు. ఘోష్ కమిషన్ మా హక్కులకు భంగం కలిగించిందంటే న్యాయమూర్తి రిపోర్టును తప్పు పడుతారా అని మాకు సుద్దులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తప్పుడు ప్రచారం మానుకోవాలి
అప్పుడు తమ్మిడిహట్టి పూర్తి చేయలేదు.. మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్న ఎందుకు తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టలేదు, ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. ప్రాజెక్టు నిర్మాణ స్థలం మార్పు, అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ నిర్మాణం అంతా రిటైర్డ్ ఇంజినీర్లు సూచించిందని, ఆ ఇంజినీర్ల కమిటీ రిపోర్టు కావాలని ఘోష్ కమిషన్ కు లేఖ రాసి అడిగితే, నాకు కమీషన్ పంపిందన్నారు. ఇదే విషయాన్ని కమిషన్ తన రిపోర్టులో కూడా పేర్కొందన్నారు. ప్రాజెక్టుల స్థల మార్పు, ప్రాజెక్టుల నిర్మాణం సొంత నిర్ణయం అనే తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. కాళేశ్వరం డీపీఆర్ సెంట్రల్ వాటర్ కమిషన్ కు ఇచ్చామని తెలిపారు.
కాళేశ్వరానికి ఒక నీతి ఉంటదా?
పార్లమెంట్ ద్వారా ఎన్డీఎస్ఏ చట్టం అన్నారని, మరి దేశం మొత్తానికి ఒక నీతి, కాళేశ్వరానికి ఒక నీతి ఉంటదా? అని నిలదీశారు. నచ్చితే ఒక నీతి, నచ్చకపోతే ఒక నీతి ఉంటుందా అని ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ చైర్మన్ గా, పోలవరం ప్రాజెక్టు సీఈవో గా చంద్రశేఖర్ అయ్యర్ ఉన్న సమయంలోనే పోలవరం 5 సార్లు కూలిందని, ఆయన చైర్మన్ గా ఉన్న ఎన్డీఎస్ఏ వచ్చి రిపోర్టు ఇస్తదట, ఆ ఆయన తీస్ మార్ ఖాన్ అంట.. అలాంటి రిపోర్టుకు ఏం సాంటిటి ఉంటదని ప్రశ్నించారు.
ఎన్డీఎస్ఏ తన రిపోర్టులో స్పష్టం
ఎస్ఎల్బీసీ, సుంకిశాల కూలింది. వట్టెం మునిగింది, పెద్దవాగు కొట్టుకుపోయింది. అయినా వీటి మీద ఎన్డీఎస్ఏ రాదు, కమీషన్లు వేయరు.. అన్నారం, సుందిళ్ల బ్రహ్మాండంగా ఉన్నాయని మండలిలో కోదండరాం అడిగిన ప్రశ్నకు ఇదే ఉత్తం సమాధానం చెప్పారని, ఎన్డీఎస్ఏ తన రిపోర్టులో స్పష్టం చెప్పిందని, ఏడో బ్లాకు నిర్మించి ఆపరేషన్ లోకి తేవాలి అని.. దాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. మేడిగడ్డలోని ఏడో బ్లాకులోని రెండు పిల్లర్లు కుంగటం తప్పా ఈ వ్యవస్థ అంతా అద్భుతంగా ఉందని, ఏడు బ్లాకుల్లో ఒక బ్లాకు మొత్తం తీసినా 3, 4 వందల కోట్ల ఖర్చు మాత్రమే అవుతుందని, అది కూడా చేయకుండా ఎందుకు రాజకీయ రాద్దాంతం చేస్తున్నారని నిలదీశారు.
7000 కోట్లతో టెండర్లు
వాస్తవానికి కాలేశ్వరం కూలింది లక్ష కోట్లు పోయినయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, మరోవైపు హైదరాబాద్ కు కాళేశ్వరం నీళ్లు తీస్తామని 7000 కోట్లతో టెండర్లు వేస్తారు.. మరి కాళేశ్వరం కూలిపోతే హైదరాబాద్కు కాలేశ్వరం నీళ్లు ఎక్కడికెళ్లి వస్తాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఈమధ్య గంధమల్ల కు పోయి కొబ్బరికాయ కొడతాడు. గంధమల్లకు నీళ్లు ఎక్కడికెళ్లే వస్తాయి. కాలేశ్వరం నుండే కదా అని నిలదీశారు. ఉత్తంకుమార్ రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, అసలు కాళేశ్వరంలో కూలింది మూడు పిల్లర్లు మాత్రమే అన్నారు.తెలంగాణ వచ్చిన తర్వాతా ఎల్లంపల్లి ప్రాజెక్టు 2052 కోట్లు ఖర్చు చేశామని, మిడ్ మానేరు మీద 1586 కోట్లు ఖర్చు పెట్టీ పూర్తి చేసి నీళ్ళు నింపింది బీఆర్ఎస్ అని వెల్లడించారు.
Also Read: Director Krish: అనుష్క విశ్వరూపాన్ని చూస్తారు.. ‘ఘాటి’పై దర్శకుడు క్రిష్ ఆసక్తికర వ్యాఖ్యలు