Police Quarters: హైదరాబాద్ లో యాభై గజాల స్థలం కొనాలన్నా ఎగువ మధ్యతరగతికి చెందిన వారు సైతం ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అదే ప్రైమ్ ఏరియాలో అయితే ఆలోచించ కూడా ఆలోచించలేం. కారణం…స్థలాల ధరలు ఆకాశాన్ని అంటుతుండటమే. అయితే, కోట్ల రూపాయల విలువ చేసే స్థలాల్లో ఎప్పుడో ఏళ్ల క్రితం నిర్మించిన వందలాది పోలీస్ క్వార్టర్లు నిరుపయోగంగా ఉన్నా పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు. కొన్ని చోట్ల ఈ క్వార్టర్లు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతున్నా అటువైపు చూసే వారే లేకుండా పోయారు. ఆవాస యోగ్యంగా లేని ఈ క్వార్టర్లను కూల్చివేసి కొత్తవాటిని నిర్మిస్తే సిబ్బందికి ఉపయోగకరంగా ఉంటాయని పోలీసు సిబ్బంది చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల ప్రతీనెలా సిబ్బందికి హౌస్ రెంట్ అలవెన్స్ కింద ప్రభుత్వం ఇస్తున్న కోట్లాది రూపాయలు కూడా ఆదా అవుతాయని అంటున్నారు. అద్దె ఇళ్లల్లో ఉంటూ తాము ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెబుతున్నారు.
దాదాపు 30 ఎకరాల్లో…
అంబర్ పేట ప్రాంతంలో దాదాపు 30 ఎకరాల భూమిలో పోలీసు సిబ్బంది కోసం క్వార్టర్స్ ను నిర్మించారు. ఎప్పుడో ఏళ్ల క్రితం నిర్మించినవి కావటం.. నిర్వహణ సరిగ్గా లేకపోవటంతో వీటిలో దాదాపు డెబ్భయి అయిదు శాతం క్వార్టర్లు కూలిపోయాయి. మరికొన్ని క్వార్టర్లు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి. ఖాళీగా పడి ఉన్న ఈ క్వార్టర్స్ ను కొందరు మందు కొట్టే బార్లుగా ఉపయోగించుకుంటున్నారు. ఇంకొందరు వ్యభిచార కార్యకలాపాలకు వాడుకుంటున్నారు. నగరం నడిబొడ్డులో ఉండే సుల్తాన్ బజార్(Sulthan Bazar) లోని పోలీస్ క్వార్టర్స్ కూడా నిరుపయోగంగా ఉండటం గమనార్హం. సుల్తాన్ బజార్ పాత పోలీస్ స్టేషన్ భవనాన్ని కూల్చివేసినపుడు కొన్ని రోజులపాటు దానిని ఈ క్వార్టర్స్ లో కొనసాగించారు. కొత్త భవనం నిర్మాణం పూర్తి కాగానే అందులోకి మార్చారు.
Also Read: AI-powered Smartphone Tool: అంధత్వానికి చెక్.. గ్లాకోమాను గుర్తించే.. అద్భుతమైన ఏఐ సాధనం రెడీ!
బొల్లారం స్టేషన్ లోకి పాములు
శిథిలావస్థకు చేరుకున్న పోలీస్ క్వార్టర్స్ ను మాత్రం అలాగే వదిలేశారు. నారాయణగూడ, పాతబస్తీ చేలాపురా, జాతీయ రహదారి పక్కనే బహదూర్ పురాలో పోలీస్ క్వార్టర్స్(Police Quarters) పరిస్థితి కూడా ఇదే. బొల్లారం పోలీస్ క్వార్టర్స్ ప్రాంగణంలోనే బొల్లారం స్టేషన్ పని చేస్తోంది. అయితే, నాలుగైదు అంతస్తుల్లో నిర్మించిన క్వార్టర్స్ మాత్రం ఖాళీగా పడి ఉన్నాయి. పిచ్చి మొక్కలు పెరిగి పోవటంతో తరచూ బొల్లారం స్టేషన్ లోకి పాములు వస్తున్నాయి. బుసలు కొడుతూ సిబ్బందిని హడలెత్తిస్తున్నాయి. కుల్సుంపురాలో అయిదంతస్తుల్లో కట్టించిన క్వార్టర్స్ కూడా కూలిపోతున్నాయి. పాతబస్తీ షంషీర్ గంజ్ లో అయితే చాలా క్వార్టర్లు కూలిపోయాయి కూడా. డబీర్ పురా పోలీస్ క్వార్టర్స్ ని కూల్చి వేసి కొంత స్థలంలో పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో ఆఫీస్ ను కట్టించారు. మిగితా స్థలం వృధాగా పడి ఉంది.
ప్రైవేట్ వ్యక్తులు…
ఇక, సోమాజీగూడ యశోధా ఆస్పత్రికి కూతవేటు దూరంలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ లో కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఉంటున్నట్టు సమాచారం. బేగంపేట ఎయిర్ పోర్టు పక్కనే 15 ఎకరాల భూమిలో నిర్మించిన క్వార్టర్స్ లో 75శాతం ఖాళీగా పడి ఉన్నాయి. మిగితా వాటిలో పోలీసు సిబ్బంది కాకుండా మినిస్టీరియల్ ఉద్యోగులు ఉంటున్నారు.
కొత్తవి కట్టిస్తే..
ఇలా కూలిపోయిన.. నివాసయోగ్యంగా లేకుండా తయారైన క్వార్టర్లను కూల్చి వేసి అదే స్థలాల్లో కొత్తవి కట్టిస్తే సిబ్బందికి ఎంత ప్రయోజనకరంగా ఉంటాయని సిబ్బంది చెబుతున్నారు. తమకు కూడా పలు సమస్యలు తీరుతాయని అంటున్నారు. అద్దె ఇళ్లల్లో నిత్యం ఇబ్బందులు పడుతూనే ఉండాల్సి వస్తోందని పేర్కంటున్నారు. కొత్త క్వార్టర్లు కట్టిస్తే వందల కోట్ల రూపాయల విలువ చేసే స్థలాల సద్వినియోగంలోకి వస్తాయని చెబుతున్నారు. దానికితోడు ప్రభుత్వానికి కూడా ఏటా కోట్ల రూపాయలు ఆదా అవుతాయని అంటున్నారు. సిటీ పోలీస్ లో పని చేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం నెలనెలా జీతాలాతోపాటు హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తోందని చెప్పిన పలువురు పోలీసులు కొత్త క్వార్టర్లు కట్టించి వాటిని కేటాయిస్తే ఈ అలవెన్స్ చెల్లించే అవసరం ఉండదన్నారు. ఈ దిశలో ప్రభుత్వం…పోలీసు పెద్దలు స్పందిస్తారని ఆశిద్దాం.
Also Read: Swetcha Effect: ధరూర్ మండల పిఎసిఎస్ సెంటర్ పై కలెక్టర్‌కు ఫిర్యాదు..?