Telangana Assembly: వాడీవేడిగా జరగనున్న సమావేశాలు
బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నం
కాంగ్రెస్‌ను కార్నర్ చేసేందుకు బీఆర్ఎస్ ఎత్తులు
వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు బీజేపీ, ఎంఐఎం ప్లాన్స్
ఎవరు పైచేయి సాధిస్తారోనన్నదానిపై ఆసక్తికర చర్చ
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కాళేశ్వరం నివేదికను శాసనసభలో ప్రభుత్వం శనివారం ప్రవేశపెడుతోంది. దీనిపై అధికార, విపక్ష పార్టీలు వ్యూహం.. ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలకు సిద్ధమవుతున్నారు. కాళేశ్వరం నివేదికపై చర్చ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలకు పార్టీలు మార్గనిర్దేశం చేస్తున్నాయి. బీఆర్ఎస్‌ను ఇరుకున బెట్టేందుకు కాంగ్రెస్, ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని బీఆర్ఎస్, అసలు ప్రజలకు వాస్తవాల తెలియజేయాలని ఒత్తిడి పెంచేందుకు బీజేపీ, ఎంఐఎం ప్లాన్ రెడీ చేసుకున్నాయి. అయితే అసెంబ్లీలో ఎవరు పైచెయ్యి సాధిస్తారనేది ఇప్పుడు హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక రిపోర్టును బహిర్గతం చేసేందుకు ముందుకెళుతోంది. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, నిర్మాణ వ్యయంలో అవకతవకలు, తీసుకొచ్చిన అప్పులు, వాటికి ప్రభుత్వం చెల్లిస్తున్న వడ్డీలను, మేడిగడ్డ బరాజ్‌లో పియర్స్ కుంగుబాటు, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లో లీకేజీలు.. ఇలా అన్ని వివరాలను వివరించేందుకు అధికార కాంగ్రెస్ సిద్ధమైంది.
బీఆర్‌ఎస్ పాలనలో లక్ష కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిని అసెంబ్లీ రికార్డుల్లో ఎక్కించేందుకు ప్లాన్‌తో ముందుకెళుతోంది. వాస్తవాలను ప్రజల ముందు ఉంచడం, అసెంబ్లీ వేదికగా ప్రజలకు నిజాలు చెప్పాలని భావిస్తోంది. మరోవైపు రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు కూడా చెక్ పెట్టాలని భావిస్తోంది. అంతేగాకుండా ఎన్డీఎస్ఏ రిపోర్టు వివరాలను సైతం వెల్లడించాలని భావిస్తోంది. ఇరిగేషన్ అధికారులు ఓపెన్ కోర్టులో ఇచ్చిన వివరాలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీష్ రావును టార్గెట్‌గా విమర్శల దాడి పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఎమ్మెల్యేలు మాట్లాడేందుకు సిద్ధం చేసింది. శనివారం అసెంబ్లీలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుసరించాల్సిన వ్యూహాలపై బ్రిఫింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు ఎవరు మాట్లాడినా మాటల యుద్ధం ప్రారంభించాలని దిశానిర్దేశం చేశారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇది స్థానిక సంస్థల ఎన్నికలకు ఉపయోగపడుతుందని ఉత్తమ్ సూచించారు.
Read Also- Nandamuri Balakrishna: నాకు ఈ లెక్కలన్నీ గుర్తుండవ్.. అవన్నీ అభిమానులే గుర్తు పెట్టుకుంటారు
ప్రభుత్వం చేసే విమర్శలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సైతం సిద్ధమైంది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికతో బీఆర్ఎస్‌ను కార్నర్ చేస్తుందని ఆ ప్రయత్నాలను అసెంబ్లీ వేదికగానే తిప్పికొట్టాలని భావిస్తోంది. ఇప్పటికే కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు మాట్లాడాలని ఇప్పటికే ఆదేశించారు. ఆయనకు సపోర్టుగా వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డిలను మాట్లాడాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక.. నివేదిక కాదని అది కాంగ్రెస్ నివేదిక అని విమర్శలు చేస్తుంది. పీసీ ఘోష్ కమిషన్ పూర్తి నివేదిక అధ్యయనం కోసం గడువు కోసం బీఆర్‌ఎస్ పట్టుబట్టాలని భావిస్తుంది. ఒక వేళ సమయం ఇవ్వకపోతే నిరసనలకు సిద్ధమవుతుంది. లేకుంటే సభ నుంచి వాకౌట్ చేసి మీడియా పాయింట్ వద్ద తమ వాయిస్ ను వినిపించాలని, ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవాలను వివరించాలని భావిస్తుంది. అంతేగాకుండా సభలోనే వాయిదా ప్రతిపాదన తీర్మానాలు సైతం పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను రైతులకు అందజేయకపోవడంతో జరిగిన నష్టం, ఏపీ నీటి దోపిడీ, బనకచర్ల ప్రాజెక్టు తదితర అంశాలను సైతం ఎత్తి చూపి ప్రభుత్వాన్ని ఇరుకున బెట్టేందుకు సిద్ధమైంది.
Read Also- HYD News: ప్రియుడితో కలిసి భర్త హత్య.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన
ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించేందుకు పట్టుబట్టేందుకు బీజేపీ సిధ్దమైంది. ఎంఐఎం సైతం కాళేశ్వరంపై చర్చించేందుకు అసెంబ్లీని పొడగించాలని స్పీకర్ ను కోరింది. ప్రాజెక్టులో జరిగిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేస్తుంది. అయితే ఏమేరకు కాళేశ్వరంపై చర్చిస్తారనేది మరోవైపు హాట్ టాపిక్ అయింది. ఎవరికి వారుగా వ్యూహాలకు పదును పెట్టారు. ఎవరు పైచెయ్యి సాధిస్తారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.