Panchayat Elections: పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ పేపర్లు, బాక్సులు రెడీ
వార్డుల వారీగా ఓటర్ జాబితా విడుదల
రంగారెడ్డిలో 7,52,254, వికారాబాద్‌లో 6,98,478 మంది ఓటర్లు
వికారాబాద్ జిల్లాలో మహిళా ఓటర్లే అధికం
పార్టీల ప్రతినిధులతో కలెక్టర్లు సమీక్ష
నాయకులు సహకరిస్తే ప్రశాంతంగా ఎన్నికలు
స్వేచ్ఛ, రంగారెడ్డి బ్యూరో: స్థానిక ఎన్నికల (Panchayat Elections) కోసం క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు, నాయకులు రెండేండ్లుగా ఎదురుచూస్తున్నారు. అప్పుడు, ఇప్పుడు అంటూ ప్రభుత్వం పరోక్ష సూచనలతో లీకులిచ్చింది. కానీ, ఇంకా షెడ్యూల్ వెలువడకపోవడంతో, ప్రజలు ఎన్నికలు ఇప్పట్లో జరగవనే అభిప్రాయానికి వచ్చారు. కానీ, ఇంతలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ జాబితా, సవరణలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో మళ్లీ పంచాయతీ ఎన్నికలు హడావుడి మొదలైంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ నెలాఖరు వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా జిల్లాలోని పంచాయతీ శాఖ అధికారులు ఇప్పటికే ఎన్నికల నిర్వహాణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. అందులో భాగంగానే శుక్రవారం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని కలెక్టర్లు అన్ని పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
వికారాబాద్ జిల్లాలో మహిళా ఓటర్లే అధికం
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలుగా విడిపోయాయి. అయితే, మేడ్చల్ జిల్లా పూర్తిగా జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలు మారిపోవడంతో కేవలం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని 41 మండలాల పరిధిలో 1,120 గ్రామ పంచాయతీలకే ఎన్నికల నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని 21 మండలాల్లో ఉన్న 526 గ్రామ పంచాయతీల పరిధిలో 4,618 వార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 7,52,254 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 3,75,353, పురుష ఓటర్లు 3,76,873గా ఉన్నారు. ఇతర ఓటర్లు 28 మంది ఉన్నారు. వికారాబాద్ జిల్లాలో 20 మండలాల 594 గ్రామ పంచాయతీ పరిధిలో 5,058 వార్డులు ఉన్నాయి. ఈ పంచాయతీ పరిధిలో 6,98,478 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 3,54,790, పురుష ఓటర్లు 3,43,672, ఇతర ఓటర్లు 16 మంది ఉన్నారు. అయితే, వికారాబాద్ జిల్లాలోని గ్రామాలలో పురుషుల ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని ఓటర్ జాబితా బట్టి స్పష్టమైంది.
Read Also- HYD News: ప్రియుడితో కలిసి భర్త హత్య.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన
పోలీంగ్ కేంద్రాలు ఏర్పాట్లు…
రంగారెడ్డి జిల్లాలోని 21 మండలాల్లో 4,618 వార్డులు ఉండగా 4,682 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో 20 మండలాల్లో 5,058 వార్డులు ఉండగా 5,058 పోలింగ్ కేంద్రాలను జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సిబ్బంది, బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పత్రాలు ఇప్పటికే సిద్దం చేశారు. బ్యాలెట్ బాక్స్‌లను గుజరాత్, కర్నాటక, పశ్చిమబెంగాల్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలకు తీసుకొచ్చినట్లు అధికారులు వివరించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామన కలెక్టర్లు తెలిపారు. ఇక, రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడమే ఆలస్యమని అధికారులు చెప్పారు. ఏ క్షణం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా నిర్వహించేందుకు సిద్దమని జిల్లా కలెక్టర్లు వివరించారు.
Read Also- 50 Years for Balakrishna: కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా! ఈ డైలాగ్ రజినీకాంత్ చెబితే!
పార్టీల ప్రతినిధులతో కలెక్టర్లు సమీక్ష
ఎన్నికల షెడ్యూల్లో భాగంగా జిల్లా కలెక్టర్లు పంచాయతీలకు సంబంధించిన ఓటర్ జాబితాను విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని అన్ని పార్టీల ప్రతినిధులతో కలెక్టర్లు సమీక్ష నిర్వహించి ఎన్నికలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్, వికారాబాద్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఎన్నికలు సజావుగా సాగేందుకు పార్టీల నాయకులు సహకారించాలని కోరారు. అంతేకాకుండా ఓటర్ జాబితాలో అనుమానాలు ఉంటే ఫిర్యాదు చేయాలని తెలిపారు. సకాలంలో ఎన్నికలు జరిగి, ప్రశాంతంగా ముగిసేవరకు పార్టీల ప్రతినిధుల తమకు అండగా ఉండాలని తెలిపారు.