Raavi Neem Tree: భారతదేశం విభిన్న మతాలు, సంస్కృతుల కళకళలాడుతోంది. పురాతన శిల్పకళలు, దేవాలయాలు, మత విశ్వాసాలు ఈ దేశ సారాంశాన్ని ప్రతి రాష్ట్రంలోనూ ప్రతిబింబిస్తాయి. ఈ ఆధ్యాత్మిక వైభవాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు, యాత్రికులు ఇక్కడికి వస్తుంటారు. ఈ దేశంలో కొన్ని చెట్లను పవిత్రంగా భావించి, దైవ స్వరూపంగా పూజిస్తారు. వాటిలో రావి, వేప, కొబ్బరి, గంధపు చెట్లు హిందూ సంప్రదాయంలో ప్రత్యేక చోటును దక్కించుకున్నాయి.
ముఖ్యంగా.. వేపచెట్టును లక్ష్మీదేవిగా భావించి, రావిచెట్టును విష్ణుమూర్తిగా, ఈ రెండింటినీ దేవాలయ ప్రాంగణాల్లో కలిసి లేదా విడిగా చూడవచ్చు. భక్తులు ఈ చెట్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతుంటారు.
రావి, వేప చెట్ల ప్రాముఖ్యత: రావి, వేప చెట్ల చుట్టూ ప్రదక్షిణం చేయడం వెనుక ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. సంతానం కలగని వారు 28 సార్లు ఈ చెట్ల చుట్టూ ప్రదక్షిణం చేస్తే మేలు జరుగుతుందని నమ్ముతుంటారు శాస్త్రీయంగా చూస్తే, రావిచెట్టు పురుషనిగా , వేపచెట్టు స్త్రీ గా చెబుతుంటారు. ఈ చెట్ల వద్ద ప్రదక్షిణం చేయడం వల్ల శరీరం ఆక్సిజన్‌ను సమర్థవంతంగా గ్రహిస్తుంది, గర్భసంబంధ సమస్యలు తొలగిపోయి, సంతాన ప్రాప్తి అవకాశాలు పెరుగుతాయని చెబుతారు.
రావిచెట్టు – బోధివృక్షం: రావిచెట్టు ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రం. సిద్ధార్థుడు ఈ చెట్టు కింద ధ్యానంలో జ్ఞానోదయం పొంది బుద్ధుడయ్యాడు, అందుకే దీనిని బోధివృక్షం అంటారు. పద్మపురాణం, స్కంద పురాణాల ప్రకారం రావిచెట్టు శ్రీమన్నారాయణ స్వరూపం. శ్రీకృష్ణుడు తన చివరి దశలో ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుని వైకుంఠం చేరాడని చెబుతారు. ఈ చెట్టు కింద కూర్చోవడం లేదా సేద తీరడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, రక్తపోటు సంబంధిత సమస్యలు నియంత్రణలో ఉంటాయి.
ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలు: రావి, వేప చెట్లు ఆధ్యాత్మికంగా దైవ స్వరూపంగా, ఆరోగ్యపరంగా ఔషధ గుణాలతో మానవాళికి ఎన్నో విధాలుగా సహాయపడతాయి. అందుకే ఈ చెట్లు దేవాలయాల్లో పూజలు అందుకుంటాయి. ఆధ్యాత్మిక పండితుల అభిప్రాయం ప్రకారం, ఈ వృక్షాలు మన జీవన విధానంలో అంతర్భాగంగా మారి, మనసుకు శాంతిని, శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి.