Telangana BJP: ప్రస్తుత కమిటీల్లో 40 శాతం పాత వారికే..
60 శాతం కొత్త వారికి కేటాయింపు
జిల్లా కమిటీల్లో అమలు కాలేదని పలువురి ఆవేదన
స్టేట్ కమిటీలో కూడా ఇవే నిబంధనలు
సగం మంది పాత నేతలకే మళ్లీ ఛాన్స్
మార్చాలంటున్న పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు
కొత్తవారికి అవకాశం ఇచ్చేదెన్నడు అనే పంచాయితీ
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : తెలంగాణ బీజేపీలో (Telangana BJP) కమిటీల కొర్రీ రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఉన్న తలనొప్పులకు కొత్త తలనొప్పిగా ఇది చేరింది. కమిటీల ఏర్పాటుకు పార్టీ పలు నిబంధనలు ఫిక్స్ చేసుకుంది. కానీ అమలులో మాత్రం నిబంధనలకు తూట్లు పొడిచినట్లుగా విమర్శలు వస్తున్నాయి. పార్టీ కొత్త కమిటీల్లో గతంలో కొనసాగిన వారిలో 40 శాతం మందికి చోటు కల్పించాలని నిర్ణయించారు. కాగా, 60 శాతం మంది కొత్తవారికి ఛాన్స్ ఇవ్వాలని పార్టీ డిసైడ్ అయింది. అయితే, ఆయా జిల్లాల్లో ఈ నిబంధనలు పాటించలేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం మార్చాలంటూ రాష్ట్ర నాయకత్వానికి మొర పెట్టుకున్నట్లు సమాచారం. ఆయా జిల్లాల్లోని కమిటీలు తమను ఏమాత్రం లెక్క చేయడంలేదనేది ఒక కారణమైతే, తమను నమ్ముకున్న వారికి న్యాయం చేయలేకపోతున్నామనే ఇష్యూను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
Read Also- Shilpa Shirodkar: సుధీర్ బాబు ‘జటాధర’లో నమ్రత శిరోద్కర్ సోదరి.. ఫస్ట్ లుక్‌తోనే వణికిస్తుందిగా!
త్వరలో బీజేపీ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని పార్టీ ప్రకటించనుంది. కాగా ఎవరికి వారుగా ఆశావహులు పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఇప్పుడున్న కమిటీల్లో కనీసం 40 శాతం మంది కొత్త కమిటీలోనూ ఉండే అవకాశముంది. దాదాపు సగం మంది పాత కమిటీ సభ్యులే ఉంటారని దీన్ని బట్టి అర్థమవుతోంది. దీంతో కొత్త వారికి అవకాశం ఇచ్చేదెన్నడనే ప్రశ్నలు సైతం ఉత్పన్నవమవుతున్నాయి. కాగా పూర్తిగా కొత్త కమిటీల ఏర్పాటు చేస్తే త్వరలో రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందనే ఆలోచనతో ఈ నిబంధన తీసుకొచ్చారని తెలుస్తోంది. ఎందుకంటే, కొత్త కమిటీ కుదురుకునేందుకు సమయం పడుతుందనే నేపథ్యంలో సగం మంది పాతవారినే కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం.
Read Also- City Police Act: హైదరాబాద్‌లో ముఖానికి రుమాలు కట్టుకున్నందుకు 10 రోజుల జైలుశిక్ష..
పదేండ్ల పాటు కమిటీల్లో కొనసాగిన వారికి కూడా కొత్త కమిటీల్లో అవకాశం ఇవ్వకూడదనే నిబంధనను పార్టీ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీన్ని తప్పనిసరిగా పాటించాలా? వద్దా? అనేది సమయానుసారంగా నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించినట్లు సమాచారం. ఇదిలాఉండగా 60 శాతం, 40 శాతం నిబంధన కారణంగా దాదాపు పాతవారిలో సగం మంది ఉంటుండగా అందులోనూ కొత్త వారిని నియమించేందుకు రాష్ట్ర నాయకత్వానికి చిక్కులు వచ్చి పడుతున్నట్లు తెలుస్తోంది. సామాజిక వర్గంతో పాటు జిల్లాలు, ఇతర అంశాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో ఒకరికిస్తే మరొకరికి మొండిచేయి చూపించాల్సి వస్తుండటంతో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇదే కమిటీల ఏర్పాటులో జాప్యానికి కారణంగా తెలుస్తోంది. జిల్లాల కమిటీలతోనే పార్టీకి తలనొప్పులు వచ్చిపడితే.. రాష్ట్ర కమిటీ ఏర్పాటు తర్వాత కొత్త సమస్యలు వచ్చిపడుతాయా? సద్దుమణుగుతాయా? అనేది చూడాలి.
