City Police Act: ఇదెక్కడి చోద్యమంటున్న నగరవాసులు
సిటీ పోలీస్ యాక్ట్ అంటున్న పోలీసులు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఒకవైపు హత్యలు జరుగుతున్నాయి, మరోవైపు దొంగతనాలు, దోపిడీలు షరా మామూలైపోయాయి. ఈ నేరాల్లోని నిందితులను పట్టుకోవటానికి రోజుల తరబడి సమయం తీసుకుంటున్నారంటూ పోలీసులపై కొన్ని విమర్శలు ఉన్న వేళ హైదరాబాద్ నగరంలో ఆసక్తికరమైన ఘటన వెలుగుచూసింది. సిటీ పోలీస్ యాక్ట్ (City Police Act) పేరిట ఓ వ్యక్తికి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. ముఖానికి రుమాలు కట్టుకున్నాడన్న కారణంతో అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. పరిశీలించిన న్యాయస్థానం 10 రోజులపాటు జైలుశిక్ష విధించింది. దీంతో, సదరు వ్యక్తిని చెంచల్ గూడ జైలుకు తరలించారు. దాంతో ఇదెక్కడి చోద్యమంటూ నగరవాసులు చర్చించుకుంటున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
యాకత్‌పురా నివాసి సయ్యద్ రయీజ్ (30) వృత్తిరీత్యా రోజుకూలీ. ఇటీవల ముఖానికి రుమాలు కట్టుకుని వెళుతుండగా చాంద్రాయణగుట్ట పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నేరం చేసే ఉద్దేశ్యంతోనే ముఖానికి రుమాలు కట్టుకుని అనుమానాస్పదంగా తిరుగుతున్నాడంటూ సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 61(బీ) ప్రకారం కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు 10 రోజుల శిక్ష విధించటంతో జైలుకు తరలించారు.
కాగా, ఈ వ్యవహారంలో పోలీసులపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే అదుపులోకి తీసుకుని అతనికి ఏదైనా నేరచరిత్ర ఉందా? అన్నది తెలుసుకోవటం పెద్ద కష్టమైన పనేం కాదు. అలా కాకుండా రుమాలు చుట్టుకున్నాడని కేసులు పెట్టడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ లెక్కన ముఖానికి మాస్కులు వేసుకుంటున్న అందరినీ అరెస్ట్ చేసి జైళ్లకు పంపిస్తారా? అని అడుగుతున్నారు. చేయని నేరానికి వ్యక్తిని జైలుకు పంపటం ఎంతవరకు సమంజసమని వ్యాఖ్యానిస్తున్నారు.
మత్తు కోసం దగ్గు మందు
102 బాటిళ్లు స్వాధీనం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: మత్తుకు అలవాటు పడ్డవారికి నిషేధిత దగ్గు మందు అమ్ముతున్న ఇద్దరిలో ఒకరిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 102 దగ్గు మందు సీసాలను స్వాధీనం చేసుకున్నారు. సరూర్ నగర్ కొత్తపేట నివాసి మూసం లక్ష్మణ్ మరో వ్యక్తితో కలిసి నిషేధిత దగ్గు మందు కోడిన్ ఫాస్పేట్ను మత్తు బానిసలకు అమ్ముతున్నట్టుగా అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు సీఐ బాలరాజు, ఎస్ఐ రవితో పాటు సిబ్బందితో కలిసి దాడి జరిపి లక్ష్మణ్ బైక్‌పై దగ్గు మందు బాటిళ్లను తీసుకెళుతుండగా మంద మల్లమ్మ చౌరస్తా వద్ద అరెస్ట్ చేశారు. విచారణలో 190 రూపాయలకు దొరికే ఈ దగ్గు మందు సీసాను నిందితులు 350 రూపాయలకు అమ్ముతున్నట్టుగా వెల్లడైంది. నిజానికి రాష్ట్రంలో ఈ దగ్గు మందుపై నిషేధం ఉన్నట్టుగా ఎక్సైజ్ అధికారులు తెలిపారు. డాక్టర్ ప్రిస్క్రిప్సన్ ఉంటేనే పరిమిత సంఖ్యలో ఈ సీసాలను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.