Ambati Rayudu Daughter Gets Death Threats From RCB Fans: టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడి కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని అతని సన్నిహితులు తెలిపారు. ఐపీఎల్ 2024 సీజన్ వైఫల్యం నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై రాయుడు వరుసగా విమర్శలు గుప్పించాడు. ఆరెంజ్ క్యాప్‌లతో టైటిల్ గెలవలేమని విరాట్ కోహ్లీ ప్రదర్శనను ఎగతాళి చేశాడు.
ప్లే ఆఫ్స్ చేరితేనే టైటిల్ గెలిచిందనే రీతిలో ఆర్‌సీబీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారని సెటైర్లు పేల్చాడు. వరుసగా ఆర్‌సీబీనే టార్గెట్ చేస్తూ మాట్లాడటంతో రాయుడిపై ఆ జట్టు ఫ్యాన్స్ ట్రోలింగ్‌కు దిగారు. జుగుప్సాకరమైన రీతిలో రాయుడిని బండ బూతులు తిట్టారు. కొందరైతే అతని ఫ్యామిలీని చంపేస్తామని, రాయుడి కూతుళ్లను అత్యాచారం చేస్తామని కామెంట్స్ చేశారు. ఈ విషయాన్ని రాయుడు స్నేహితుడు సామ్ పాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ బెదిరింపులతో రాయుడి కుటుంబం తీవ్ర భయాందోళనకు గురువుతుందని, బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోలీసులను కోరాడు. ఓ జట్టును విమర్శిస్తూ రాయుడి చేసిన కామెంట్స్‌ను కొందరు ఫ్యాన్స్ వ్యక్తిగతంగా తీసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారు. మొదట్లో నేను, రాయుడు వీటిని చూసి నవ్వుకున్నాం. కానీ రాయుడి సతీమణి విద్య ఏడాది, నాలుగేళ్ల కూతుళ్లను హత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపింది. జుగుప్సాకరమైన ట్రోలింగ్‌తో ఆమెను మానసికంగా హింసిస్తున్నారు. వీరిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని రాయుడు స్నేహితుడు సామ్ పాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.
Also Read: శుభారంభం, అమెరికాకి టీమిండియా
అయితే ఈ వ్యవహారంపై అంబటి రాయుడు సోషల్ మీడియా వేదికగా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గతంలో విరాట్ కోహ్లీ ఫ్యామిలీ కూడా ఇలాంటి బెదిరింపులనే ఎదుర్కొంది. అతని కూతురు వామికాను అత్యాచారం చేస్తామని ఓ నెటిజన్ బెదిరంచగా అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ రిటైర్మెంట్ అనంతరం కామెంటేటర్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రాయుడు, సీఎస్‌కే మాజీ ఆటగాడిగా ఆ జట్టుపై విపరీతమైన అభిమానాన్ని చాటుకున్నాడు. కామెంట్రీలోనూ సీఎస్‌కే, ధోనీపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ఇతర జట్లపై విమర్శలు గుప్పించాడు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరినప్పటి నుంచి ఆ జట్టుపై ఉద్దేశపూర్వకంగానే విమర్శలు గుప్పించాడు.అంబటి రాయుడి అభిప్రాయాలు ఆర్‌సీబీ అభిమానులను రెచ్చగొట్టాయి. అందుకే ఇలా నెట్టింట విమర్శలు గుప్పిస్తున్నారంటూ పలువురు క్రీడాకారులు భావిస్తున్నారు.