Dog Bite: భారతదేశంలో కుక్క కాటు కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. అలాగే, రేబిస్ వ్యాధి కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా మంది కుక్కలను ఇంట్లో ప్రేమతో పెంచుకుంటూ, వాటితో ఆనందంగా సమయం గడుపుతారు. అయితే, కుక్కలు తమ యజమానులను నాలుకతో నాకడం వంటి సాధారణ చర్యల ద్వారా, ఒకవేళ కాళ్లపై గాయాలు లేదా కోతలు ఉంటే, రేబిస్ క్రిములు శరీరంలోకి చొచ్చుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కుక్కను మనిషికి నమ్మకమైన స్నేహితుడిగా పరిగణిస్తారు, కానీ ఆ కుక్కే కరిస్తే, అది తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇటీవల కుక్క కాట్లపై వివాదాలు మరింత తీవ్రమవుతున్నాయి. చాలా మంది కుక్క కాటును తేలికగా తీసుకున్నప్పటికీ, ఇది రేబిస్‌తో సహా ప్రమాదకరమైన వ్యాధులను కలిగించవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కుక్క కాటు వలన సంభవించే వ్యాధులు ఇవే..
రేబిస్: కుక్క లాలాజలంలోని వైరస్ గాయం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తే, రేబిస్ వ్యాధి సోకే అవకాశం ఉంది, ఇది చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చు.
ధనుర్వాతం (టెటనస్): కుక్క దంతాలు లేదా గోళ్ల ద్వారా బాక్టీరియా శరీరంలోకి చేరి కండరాల దృఢత్వం, శ్వాస సమస్యలను కలిగిస్తుంది.
చర్మ అలెర్జీలు: కుక్క కాటు తర్వాత దురద, ఎరుపు, దద్దుర్లు, చికాకు వంటి అలెర్జీ సమస్యలు తలెత్తవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తక్షణ చర్య: కుక్క కాటుకు గురైన వెంటనే గాయాన్ని సబ్బు నీటితో కనీసం 10-15 నిమిషాల పాటు శుభ్రం చేయాలి. ఇంటి చిట్కాలను నమ్మకుండా, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
రేబిస్ ఇంజెక్షన్: కాటు జరిగిన 24 గంటల్లోపు మొదటి రేబిస్ యాంటీ-వైరస్ ఇంజెక్షన్ తీసుకోవడం తప్పనిసరి. ఆలస్యం చేస్తే వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.
ఇంజెక్షన్ల సంఖ్య: రేబిస్ నివారణ కోసం సాధారణంగా 4-5 ఇంజెక్షన్లు వివిధ రోజుల్లో తీసుకోవాలి, ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
