– కులాన్ని అడ్డు పెట్టుకుని ఎదిగిన ప్రణీత్ రావు
– సహకరించి, ప్రోత్సహించిన ప్రభాకర్ రావు
– అడ్డదారిలో డీఎస్పీగా ప్రమోషన్
– 17 డెస్క్‌టాప్స్‌తో పాటు హైస్పీడ్ నెట్ కనెక్షన్
– 12 వందల మందిపై నెలల తరబడి నిఘా
– కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ సాయంతో ప్రొఫైల్స్
– 24 గంటలూ విపక్ష నేతలపై ఫోకస్
– హస్తం నేతల సొమ్మును హవాలాగా చిత్రీకరణ
– కాంగ్రెస్ గెలుపుతో మారిన ప్లాన్
– సీసీ కెమెరాలు ఆపి హార్డ్ డిస్క్‌ల ధ్వంసం
– ప్రణీత్ రావు వాంగ్మూలంలో నివ్వెరబోయే వాస్తవాలు
దేవేందర్ రెడ్డి, 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తవ్విన కొద్దీ కొత్త కొత్త నిజాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ కేసులో కీలక పాత్రధారి ప్రణీత్ రావు పోలీసుల ముందు ఇచ్చిన వాంగ్మూలం, నాటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. దాన్ని జనం ముందు పెడుతోంది ‘స్వేచ్ఛ’. విపక్ష నేతలు, జడ్జిలు, పత్రికాధిపతులు, న్యాయవాదులు, రియల్టర్లు, బడా పారిశ్రామిక వేత్తలు, ఇలా మొత్తం 1200 మంది ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లుగా ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో బయటపెట్టాడు. నాటి తన బాస్ ప్రభాకర్ రావు ఆదేశాలను, ఆయన పట్ల తాను చూపిన స్వామిభక్తిని, అందుకు ఫలితంగా తాను పొందిన ప్రమోషన్ల వివరాలను పూసగుచ్చినట్టు వివరించాడు.
కులం అండతో ఎదిగి!
2008లో నల్గొండ ఎస్పీగా ప్రభాకర్ రావు ఉన్నప్పుడు, అదే జిల్లాలో ఎస్సైగా ఉన్న ప్రణీత్ రావును బీబీ నగర్ పంపించారు. ప్రణీత్ కూడా వెలమ సామాజిక వర్గానికి చెందిన వాడు కావటమే దీనికి కారణం. నాటి నుంచి ప్రభాకర్ రావుకు నమ్మిన బంటుగా ప్రణీత్ ఉంటూ వచ్చాడు. 2016లో ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్‌లోకి వెళ్లినప్పడు, ఆయనతో పాటు ప్రణీత్ రావు కూడా వస్తానని అనటంతో ఎస్ఐబీ విభాగంలో ఎస్సైగా తీసుకున్నారు. పేరుకు ఎస్సై అయినా, నిజానికి అక్కడ ప్రభాకర్ రావు చెప్పిన పనులే చేసేవాడు. 2017లో సీనియారిటీ బేస్ మీద ప్రమోషన్ పొంది, ఎస్ఐబీలో కీలక ఆపరేషన్స్ చూసేవాడు. అక్కడ ప్రణీత్ పై అధికారి వేణుగోపాల్ రావు కూడా వెలమ వర్గానికే చెందిన వాడు కావటంతో ఎదురు లేకుండా పోయింది.
టీం సభ్యులు వీరే!
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రణీత్ ఒక టీంను ఏర్పాటు చేశాడు. అందులో ఇద్దరు చొప్పున సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలను, ముగ్గురు కానిస్టేబుళ్లను తీసుకున్నారు. కోదాడలో ఎస్సైగా ఉన్న వెలమ సామాజిక వర్గానికి చెందిన గుండు వెంకట రావు, తన బాల్య మిత్రుడైన మరో ఎస్సై రవి కిరణ్‌లను ప్రణీత్ రావు సిఫారసు మేరకు, ప్రభాకర్ రావు ఎస్ఐబీలోకి తీసుకున్నారు. వీరు గాక హన్మంతరావు, శ్రీనివాస్ అనే మరో ఇద్దరు ఎస్సైలు, బ్రహ్మచారి, మాధవరావు అనే ఏఎస్సైలు, రఫీ అనే హెడ్ కానిస్టేబుల్, యాదయ్య, హరీష్, సందీప్, మధుకర్ రావు అనే కానిస్టేబుళ్లు, ప్రణీత్ రావు ఎలక్షన్ స్పెషల్ టీమ్‌లో సభ్యులుగా పనిచేశారు. బీఆర్ఎస్ నేతల ప్రత్యర్థుల ప్రొఫైల్స్‌ను చేసి, వాటిపై 24 గంటలూ నిఘా పెట్టటమే ఈ టీమ్ పని. హైదరాబాద్‌లోని కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ వారి సాంకేతిక సాయంతో రాజకీయ నాయకుల ప్రొఫైల్స్ రూపొందించారు. వీరిపై నిఘా కోసం 17 డెస్క్‌టాప్స్, ఒక ల్యాప్ టాప్, కొన్ని పెన్ డ్రైవ్‌లను వాడారు. దీనికోసం ప్రత్యేకంగా ఇంటర్ నెట్ కనెక్షన్ తీసుకున్నారు.
అడ్డదారిన పదోన్నతి
2021లో ప్రభాకర్ రావు, యాక్సిలరేటెడ్ ప్రమోషన్ మీద డీఎస్పీగా ప్రణీత్ రావు పేరును ప్రతిపాదించారు. కాగా, దీనిపై అభ్యంతరాలు రావటంతో దానిని పక్కనబెట్టారు. సరిగ్గా ఏడాది కాగానే, 2022 డిసెంబరులో ప్రణీత్ రావును డీఎస్పీగా ప్రమోట్ చేశారు. అలా, ప్రణీత్ తన బ్యాచ్‌లో తొలి డీఎస్పీగా నిలిచాడు. అదే సమయంలో 2020 జూన్‌లో పదవీ విరమణ చేసిన ప్రభాకర్ రావును బీఆర్ఎస్ ప్రభుత్వం, రెండేళ్ల పాటు ఎస్ఐబీలో ఆపరేషన్స్ చీఫ్‌గా నియమించటమే గాక, 2023 జూన్‌లో మరోసారి పదవీ కాలాన్ని పొడిగించింది.
హస్తం నేతల ఓటమే లక్ష్యం
గత అసెంబ్లీ ఎన్నికలకు మందునుంచీ ప్రణీత్ రావు స్పెషల్ టీం విపక్ష నేతల ఫోన్‌లను ట్యాప్ చేసింది. నేతల ఆర్థిక లావాదేవీలను దొంగచాటుగా వింటూ, ఎక్కడికక్కడ తనిఖీలు చేసి, ఎన్నికల్లో వారికి డబ్బు అందకుండా కట్టడి చేశారు. దీనిపై రాజకీయ విమర్శలు రాకుండా పట్టుబడిన సొమ్మును హవాలా మనీగా కోర్టుల ముందు ప్రస్తావించారు. ఎన్నికలు ముగిసేవరకు ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావు, వేణుగోపాల్ రావు ఆదేశాల మేరకు ఈ సోదాలు కొనసాగాయి. 2023 నవంబరు 30న పోలింగ్ కాగానే ఆపరేషన్స్ నిలిపేశారు.
కాంగ్రెస్ గెలవగానే!
ఓట్ల లెక్కింపు రోజున కాంగ్రెస్ గెలుపు అర్థం కాగానే, మర్నాడు డిసెంబరు 4న ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. బాధ్యతల నుంచి తప్పుకోవటానికి ముందు కీలక ఆపరేషన్స్‌కు సంబంధించిన పొలిటికల్ ప్రొఫైల్స్ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న ఆయన ఆదేశాల మేరకు ప్రణీత్ రావు బృందం తమ కార్యాలయంలోని 50 కంప్యూటర్ల హార్డ్ డిస్క్‌లను తీసి, వాటి స్థానంలో తాము కొన్న కొత్తవాటిని బిగించి, పాత వాటిని ధ్వంసం చేశారు. ఈ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఎస్‌ఐబీలో ఆర్ఎస్సైగా ఉన్న అనిల్ కుమార్ సాయంతో సీసీ కెమెరాలు ఆపేయించి, అక్కడి ఇతర సాక్ష్యాలను ధ్వంసం చేశారు. మొదట్లో సీసీ కెమెరాలు ఆపేందుకు అతడు ఒప్పుకోకపోవటంతో తాను ప్రభాకర్ రావు చేత చెప్పించి, డిసెంబరు 4 రాత్రి 7.30 నుంచి 8.15 వరకు నిలిపివేయించినట్టు ప్రణీత్ వివరించాడు. ఆ టైమ్‌లో శ్రీనివాస్, అనంత్, కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ నుంచి వచ్చిన మరో వ్యక్తి కలిసి 17 కంప్యూటర్ల హార్డ్ డిస్క్‌లు, ల్యాప్ ట్యాప్, సర్వర్‌లోని హార్డ్ డిస్క్‌లు తీయగా, హెడ్ కానిస్టేబుల్ కృష్ణ వాటిని ఎలక్ట్రిక్ కట్టర్‌తో ముక్కలు ముక్కలు చేశాడు. తర్వాత ప్రణీత్ రావు, అతని టీం కలిసి ఆ ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లను అక్కడి నుంచి తరలించారు. 2023 డిసెంబరు 13న ప్రణీత్ రావు ఎస్‌ఐబీ నుంచి రిలీవై, తిరిగి హెడ్ ఆఫీస్‌కు రిపోర్టు చేశాడు. పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్, ల్యాప్‌టాప్ డేటా అంతా ఫార్మెట్ చేశారు. ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ ముక్కలను నాగోల్, మూసారంబాగ్ మూసీ నదిలో పారేశారు. ఫార్మెట్ చేసిన సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్‌లను బేగంపేట నాలాలో పడేశారు.
బాస్ పట్ల అంతులేని విధేయత
సొంత సామాజిక వర్గమనే అభిమానంతో తనను ప్రోత్సహించిన ప్రభాకర్ రావు పట్ల ప్రణీత్ రావు ఆది నుంచి స్వామిభక్తి చూపుతూ వచ్చారు. చివరికి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో అడ్డంగా దొరికిపోయి, నానా చర్చా జరుగుతున్నప్పటికీ తన బాస్ పట్ల ఆయన విధేయతలో ఏమార్పూ లేదు. వాంగ్మూలం ఇచ్చే సమయంలోనూ, ప్రభాకర్ రావు తనకెంతో చేశారని, కనుక గతంలో ఆయన కోసం తాను చేసిన అన్ని పనుల వివరాలనూ విచారణ కమిటీ ముందు చెప్పలేనని ప్రణీత్ రావు అనటమే ఆయనకు ప్రభాకర్ రావు పట్ల ఉన్న విధేయతకు నిదర్శనం.