Mahatma Gandhi: మహాత్మా గాంధీ సినిమా ద్వారా ప్రపంచానికి తెలిశాడని, 1982లో రిచర్డ్ అటెన్‌బరో తీసిన గాంధీ సినిమా తీయనంత వరకు మహాత్ముడి గురించి ప్రపంచ దేశాలకు తెలియదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఈ కామెంట్ చేస్తూ గత 75 ఏళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం మహాత్ముడికి అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రమోషన్ చేసి ఉండొద్దా? అని ప్రశ్నించారు. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటైన కౌంటర్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహాత్ముడి ఘనతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడింది. మహాత్మా గాంధీ జాతీయవాదాన్ని ఈ ఆర్ఎస్ఎస్ వర్కర్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు అని విమర్శించింది.
మహాత్మా గాంధీ ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తి అని, ఈ 75 ఏళ్లల్లో ఆయన గురించి ప్రపంచానికి తెలియజేసే బాధ్యత తీసుకుని ఉండాల్సింది కదా అని ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ అన్నారు. ‘మహాత్ముడి గురించి ఎవరికీ తెలియదు. క్షమించండి, కానీ, ఆయన గురించి ఆసక్తి కేవలం ‘గాంధీ’ అనే సినిమా తీసినాకే పెరిగింది. అది కూడా మనం రూపొందించింది కాదు.’ మోదీ చెప్పారు. ‘మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా ప్రపంచానికి తెలిసు. గాంధీ కూడా వారికి ఏం తక్కువ కాదు. ఈ వాస్తవాన్ని అంగీకరించాల్సిందే. ప్రపంచమంతా తిరిగిన తర్వాత నేను ఈ మాట చెబుతున్నా..’ అని వివరించారు.
మోదీ వ్యాఖ్యలకు సంబంధించిన ఈ ఇంటర్వ్యూ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ‘ప్రధాని మోదీది వేరే ప్రపంచం అనిపిస్తున్నది. 1982 కంటే ముందు గాంధీని గుర్తించిన ప్రపంచమేమో అది’ అని సెటైర్ వేశారు. ‘గాంధీ వారసత్వాన్ని నాశనం చేసినవారెవరైనా ఉంటే అది ప్రధాని మోదీ మాత్రమే. ఆయన ప్రభుత్వమే వారణాసి, ఢిల్లీ, అహ్మదాబాద్‌లలోని గాంధీ సంస్థలను నాశనం చేశాయి. మహాత్మా గాంధీ జాతీయవాదాన్ని అర్థం చేసుకోకపోవడం ఆర్ఎస్ఎస్ వర్కర్లు అందరిలో కనిపించేదే. ఇలాంటి వాతావరణాన్ని ఆ భావజాలమే తయారు చేసింది. దాని వల్లే నాథురాం మహాత్ముడిని చంపేశాడు కదా’ అని వివరించారు. ‘ఈ లోక్ సభ ఎన్నికలు గాంధీ భక్తులకు, గాడ్సే భక్తులకు మధ్య జరుగుతున్నవే’ అని పేర్కొన్నారు.