PCC Chief Mahesh Kumar Goud: దేశంలో 12 ఏళ్ల బీజేపీ పాలనపై తాను చర్చకు వస్తానని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) సవాల్ విసిరారు. ఎక్కడికి రమ్మన్నా వస్తానని సెక్యూరిటీ లేకుండా మరీ వస్తానని పీసీసీ చీఫ్ నొక్కి చెప్పారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదని మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. 12 ఏళ్ల బీజేపీ పాలన, ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై కరీంనగర్ నడిబొడ్డుపై చర్చ చేద్దామన్నారు. దమ్ముంటే బండి సంజయ్ (Bandi Sanjay) తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్నిసార్లు ఓడిపోయావో గుర్తు లేదా? అంటూ బండికి చురకలు అంటించారు.
స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పదన్నారు. రాజకీయ సన్యాసం తీసుకోవడానికి బండి సంజయ్ సిద్దంగా ఉండాలని నొక్కి చెప్పారు. రాముడు, దేవుడు పేరు చెప్పకుండా, అయోధ్య అక్షింతలు అని ప్రచారం చేయకుండా గెలవగలవా? అని నిలదీశారు. దేవుడు పేరు చెప్పుకుని రాజకీయాలు చేసే మీరు కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి గాని, వేములవాడ రాజా రాజేశ్వర దేవాలయ అభివృద్ధికి ఒక్క పైసా అయినా ఇచ్చారా? అని మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టుల కేటాయింపులో అన్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పలేక దాటవేస్తూ పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రిగా తెలంగాణకు, కరీంనగర్‌కు ఏమీ చేశారో లెక్కలు చెప్పగలవా..? అని ప్రశ్నించారు. కరీంనగర్‌కు ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారు..? ఎంత మంది యువతకు ఉద్యాగాలు ఇప్పించారు..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. బీసీకు 42 శాతం రిజర్వేషన్లపై కేంద్రం అన్యాయం చేస్తున్నా బీసీ బిడ్డగా ఎందుకు ప్రశ్నించడం లేదు..? అని గుర్తు చేశారు.
మతం పేరుతో గెలుస్తూ భావోద్వేగాలను రెచ్చగొడుతుంది మీరు కాదా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం పేరుతో బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్న బీజేపీ, ఇతర రాష్ట్రాల్లో ముస్లీంలు కనిపించడం లేదా? అని ఫైర్ అయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ కొంత మంది ముస్లీంలు బీసీల్లో ఉన్నారని వివరించారు. ఇక ఓట్ల చోరీ అంటే బండి సంజయ్‌కు అవగాహన ఉన్నదా? అని వ్యంగ్యంగా విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉండి రోహింగ్యాలు గురించి ఆయనే మాట్లాడితే ఎలా? అంటూ ధ్వజమెత్తారు. సన్యాసం ఖాయం.. మఠంలో స్థిర నివాసం పక్కా అంటూ పీసీసీ చీఫ్ హెచ్చరించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు