Team India: రెండు వారాల క్రితం ముగిసిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో టీమిండియా స్టార్ పేసర్ అర్షదీప్ సింగ్ (Arshdeep Singh) అరంగేట్రం చేయడం ఖాయమని అనిపించింది. టీమిండియా (Team India) మేనేజ్‌మెంట్ కూడా ఆ దిశగా సంకేతాలు ఇచ్చింది. ఆ విధంగా అర్షదీప్ సింగ్ తొలిసారి టెస్ట్ ఫార్మాట్‌లో ఆడేందుకు చాలా చేరువయ్యాడు. కానీ, చివరాఖరికి ఈ లెఫ్ట్ హ్యాండ్ పేసర్ టెస్టుల్లో అరంగేట్రం చేయకుండానే సిరీస్ ముగిసిపోయింది. నిజానికి చివరిదైన ఐదవ టెస్టులో అవకాశం దక్కుతుందని అంతా భావించారు. కానీ, చివరకు ఆశలు అడియాసలు అయ్యాయి. ఈ విధంగా పలుమార్లు అవకాశం దగ్గరికి వచ్చినట్టే వచ్చి చేజారిపోవడంతో అర్షదీప్ సింగ్ అసహనానికి గురయ్యాడని పంజాబ్ బౌలింగ్ కోచ్ గగన్‌దీప్ సింగ్ తెలిపారు.
Read Also- Cyber Criminals: ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద పట్టుబడ్డ 13 మంది సైబర్ నేరగాళ్లు
టెస్టుల్లో అరంగేట్రం చేసేందుకు అవకాశం చాలాసార్లు దగ్గరికి వచ్చి చేజారడంతో అర్షదీప్‌లో అసహనం నెలకొందని గగన్‌దీప్ సింగ్ వివరించారు. ‘‘కొద్ది వారాల క్రితం అర్షదీప్ సింగ్ ఇంగ్లండ్‌లో ఉన్నప్పుడు నేను అతడితో మాట్లాడాను. తుది జట్టులో చోటు దక్కకపోవడంతో అతడిలో అసహనం (impatience) మొదలయ్యింది. నీ సమయం వచ్చినప్పుడు నువ్వు ఆడతావు, అప్పటివరకు వేచి ఉండాలి అని అర్షదీప్‌కు సూచించాను. ఇంగ్లండ్ పర్యటనలో అతడిని ఆడించాల్సిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అర్షదప్ సింగ్ స్వింగ్ బౌలర్, ఎత్తుగా కూడా ఉన్నాడు. అన్ని సానుకూల అంశాలే ఉన్నాయి’’ అని గగన్‌దీప్ సింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
గంభీర్, గిల్‌కు నమ్మకం లేదేమో
జట్టు కాంబినేషన్స్ ఏవిధంగా ఎంచుకున్నారో తనకు తెలియదని, బహుశా కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇద్దరూ అర్షదీప్ సింగ్‌పై పూర్తిగా నమ్మకం ఉంచలేకపోయారేమోనని గగన్‌దీప్ వ్యాఖ్యానించారు. అర్షదీప్ సింగ్ తన లైన్ అండ్ లెంగ్త్‌పై మరింత కష్టపడితే, చాలా గొప్ప బౌలర్‌గా మారతాడని, అతడిలో ఆ సామర్థ్యం ఉందని అభిప్రాయపడ్డారు. మరింత స్వింగ్, ఖచ్చితత్వంతో ఇంకా మెరుగైన బౌలర్‌గా మారగలడని ఆశాభావం వ్యక్తం చేశారు. అర్షదీప్ సింగ్‌ను తాను గత కొన్ని నెలలుగా చూడలేదని, అతడి బౌలింగ్‌ను దగ్గరి నుంచి చూస్తే మరింత విశ్లేషించగలుగుతానని ఆయన అన్నారు.
Read Also- Shankar Nayak: ఓవైపు యూరియా పంపిణీ చేస్తుండగా… మాజీ ఎమ్మెల్యే నిర్వాకమిది
అర్షదీప్ సింగ్ ఇటీవల ఆడిన కొన్ని మ్యాచ్‌లను గమనించిన తర్వాత, అతడి లైన్, లెంగ్త్, యార్కర్ బంతులు, ముఖ్యంగా బౌన్సర్ బంతులపై మరింత కష్టపడితే మంచిదనిపిస్తోందని గగన్‌దీప్ సింగ్ చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ బంతులు చాలా ప్రభావం చూపుతాయని వివరించారు. అంతకుముందు, అర్షదీప్ చిన్ననాటి కోచ్ జస్వంత్ రాయ్ మాట్లాడుతూ, రెడ్ బాల్ (టెస్ట్ క్రికెట్) సవాలును ఎదుర్కొనడానికి అర్షదీప్ సింగ్ సిద్ధంగా ఉన్నాడని వ్యాఖ్యానించారు.
కాగా, అర్షదీప్ సింగ్ టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేయకపోయినప్పటికీ, ఇటీవల ప్రకటించిన ఆసియా కప్ బృందంలో చోటుదక్కించుకున్నాడు. కాగా, అర్షదీప్ సింగ్ టీ20 ఫార్మాట్‌లో రెగ్యులర్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 63 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడి 99 వికెట్లు పడగొట్టాడు. 9 వన్డేలు ఆడి 14 వికెట్లు తీశాడు. అయితే, టెస్టుల్లో మాత్రం ఇప్పటికీ అతడు అరంగేట్రం చేయలేదు.