Viral Video: సాధారణంగా ఏడేళ్ల బాలుడంటే తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. బుద్ధిగా చదువుకుంటూ తన బుజ్జి బుజ్జి మాటలతో చుట్టుపక్కల వారిని ఆకర్షిస్తుంటాడు. కానీ ఓ బాలుడు మాత్రం.. యువతికి గట్టి షాక్ ఇచ్చాడు. ఆమెతో అశ్లీలంగా మాట్లాడుతూ అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటనను ఇన్ స్టాగ్రామ్ వేదికగా బాధితురాలు తెలియజేసింది. దీంతో ఈ వీడియో పిల్లల్లో వస్తోన్న మార్పులపై కొత్త చర్చకు కారణమైంది.
బాధితురాలు ఏమన్నదంటే?
బాధిత యువతి కిరణ్ గ్రీవాల్.. తన నివాస సముదాయంలో వాకింగ్ కు వెళ్లినప్పుడు ఈ షాకింగ్ ఘటన ఎదురైంది. యువతి మాటల ప్రకారం.. 7 ఏళ్ల బాలుడు ఆమెను అశ్లీలంగా ఆటపట్టించాడు. ఆమె ఎరుపు రంగు టాప్, పొడవైన స్కర్ట్ ధరించి నడుస్తుండగా ఆ బాలుడు ‘ఓ లాల్‌పరి’ అని పిలుస్తూ అవమానకరమైన వ్యాఖ్య చేశాడని చెప్పింది. బాలుడు అలా పిలవగానే ఎలా రియాక్ట్ అవ్వాలో తనకు అర్థం కాలేదని.. కొంతసేపటి వరకూ షాక్ లోనే ఉండిపోయానని యువతి చెప్పింది. అయితే ఇదంతా గమనించిన వాచ్ మెన్ పిల్లాడి మాటలకు నవ్వుతూ ఉండిపోవడంతో తాను ఆ బాలుడ్ని మందలించే ధైర్యం చేయలేకపోయినట్లు పేర్కొంది.
మళ్లీ రెండోసారి రిపీట్
తర్వాత మళ్లీ అదే దారి గుండా వెళ్లినప్పుడు, ఆ బాలుడు ‘కౌన్ హై తూ, చలేగీ క్యా?’ (నువ్వెవ్వరు? నాతో వస్తావా?) అని అరిచాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో బాలుడిపై ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశానని తెలిపింది. దీంతో వాచ్ మెన్ కలుగజేసుకొని.. బాలుడ్ని క్షమాపణలు చెప్పాలని ఒత్తిడి చేశాడని అన్నారు. దీంతో ఆ బాలుడు చాలా అయిష్టంగానే సారీ అని చెప్పి వెంటనే పారిపోయాడని యువతి వివరించింది. మహిళ పట్ల పురుషుల ధోరణి చిన్నప్పటి నుంచే ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు. ‘పిల్లలు ఇలాంటి మాటలు స్వతహాగా అనరు. ఎక్కడో విని.. ఏదో చూసి వాటిని అనుకరిస్తారు. వెంటనే సరిదిద్దకపోతే ఈ సరదా పెద్దయ్యాక వేధింపులకు దారి తీస్తుంది’ అని కిరణ్ గ్రీవాల్ వీడియోలో చెప్పుకొచ్చారు.
View this post on Instagram
వాచ్ మెన్ మాటలకు మరింత కోపం
వాచ్ మెన్ ఆ పిల్లాడి గురించి చెప్పిన మాటలను కూడా కిరణ్ గ్రీవాల్ తన ఇన్ స్టాగ్రామ్ వీడియోలో పంచుకున్నారు. తనకు ఎదురైన అనుభవాన్ని సెక్యూరిటీ గార్డ్ చాలా తేలిగ్గా తీసుకున్నట్లు చెప్పారు. బాలుడు మంచి కుటుంబం నుంచి వచ్చాడని.. సరదాగా మాత్రమే అన్నాడని వాచ్ మెన్ సమర్థించుకొని వచ్చినట్లు కిరణ్ గ్రీవాల్ తెలిపారు. దీని వల్ల తన కోపం మరింత పెరిగిందని ఆమె అన్నారు. ఎందుకంటే వయసు చిన్నది కాబట్టి వేధింపులను క్షమించవచ్చన్న భావన సమాజంలో బలపడుతుందని ఆమె పేర్కొన్నారు.
Also Read: Viral News: ఓర్నాయనో.. ఆటోలో 1 కి.మీ ప్రయాణానికి.. రూ.425 వసూల్!
నెటిజన్ల రియాక్షన్ ఇదే
కిరణ్ గ్రీవాల్ చేసిన ఇన్ ఇన్ స్టాగ్రామ్ పోస్టుపై పెద్ద ఎత్తున నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆ బాలుడి తల్లిదండ్రులను కలిసి.. దానిని ప్రస్తావించి ఉండాల్సిందని కిరణ్ కు సూచించారు. ‘చెడు సమాజం, చెడు పెంపకం. మీ పరిస్థితి బాధగా అనిపిస్తోంది’ అని ఓ వ్యక్తి అన్నారు. మరొకరు ‘మీరు తక్కువ స్పందించారు. వెంటనే నీ తల్లిదండ్రులను పిలుద్దాం అని చెప్పి ఉండాల్సింది. ఇతర పిల్లలకు కూడా ఒక పాఠం అయ్యేది’ అని అన్నారు. మరొకరు యూజర్ మాట్లాడుతూ.. మీరు నూటికి నూరు శాతం బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడాలి. ఇప్పుడు సరిచేయకపోతే తర్వాతి రోజుల్లో కూడా ఇదే మెంటాలిటీతో బాలుడు పెరుగుతాడు. బాలుడి తల్లిదండ్రులు మాత్రమే పిల్లాడిలో మార్పు తీసుకురాగలరు’ అని అభిప్రాయపడ్డారు.