Sahasra Case
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Sahasra case: సహస్ర కేసుపై జనం వ్యక్తం చేస్తున్న సందేహాలు ఇవే!

Sahasra case: పాత బ్యాట్​ కోసం ఇంత ఘోరమైన హత్యా?

నమ్మశక్యంగా లేదంటున్న జనం

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: సంచలనం సృష్టించిన పన్నెండేళ్ల బాలిక సహస్ర హత్య కేసులో (Sahasra case) ఎన్నో ప్రశ్నలు… మరెన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ పాత క్రికెట్ బ్యాట్​ కోసం 10వ తరగతి బాలుడు ఇంతటి కిరాతకానికి ఒడిగట్టాడంటే నమ్మశక్యంగా లేదన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీని వెనక మరేదో కారణం ఖచ్చితంగా ఉందన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. దొంగతనం చేయటానికి బాలుడు కాగితంపై రాసి పెట్టుకున్న ప్లాన్ దీనికి బలాన్ని చేకూరుస్తోంది. పోలీసు అధికారుల మాటలను విశ్లేషిస్తే కేసును క్లోజ్ చేయాలన్న హడావుడి కనిపించింది, తప్పితే సమగ్ర విచారణ జరిపినట్టుగా అనిపించడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆరు రోజుల క్రితం కూకట్‌పల్లి సంగీత్ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ పెంట్‌హౌస్‌లో పన్నెండేళ్ల బాలిక సహస్ర దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కత్తితో ఆ చిన్నారిపై దాడి చేసిన దుండగుడు, ఇరవై సార్లకుపైగా గొంతు, కడుపులో పొడిచి పొడిచి మరీ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ కిరాతకం రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. కాగా, 5 రోజుల దర్యాప్తు తరువాత సహస్రను చంపిన 10వ తరగతి విద్యార్థిని అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ పోలీసు అధికారులు మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడించారు. క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడానికి వెళ్లిన తనను చూసి, అడ్డుకోవటానికి ప్రయత్నించిందని, విషయాన్ని అందరికీ చెబుతుందని సహస్రను నిందితుడు చంపేశాడని వెల్లడించారు. ఎమ్మార్​ఎఫ్​ అని ఉన్న ఆ బ్యాట్ అంటే నిందితుడికి ఇష్టమని చెప్పారు.

Read Also- BioDesign Summit: దేవుడు గొప్ప డిజైనర్.. సీఎం రేవంత్ కీలక ప్రసంగం

అయితే, ఇక్కడే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు పాల్పడ్డ బాలుడు దొంగిలించాలనుకున్న క్రికెట్ బ్యాట్‌ను దర్యాప్తు అధికారులు సీజ్ చేశారు. మీడియా సమావేశంలో దానిని చూపెట్టారు కూడా. చూస్తే అది కొన్ని నెలల క్రితం కొన్న క్రికెట్ బ్యాట్‌గా స్పష్టమవుతోంది. ఆడి ఆడి ఆ బ్యాట్ అడుగు భాగం కొద్దిమేర అరిగిపోయింది. హ్యాండిల్​ గ్రిప్ కూడా లేదు. ఇక, సహస్ర తమ్ముడు ఆ బ్యాట్‌పై రంగుతో ఎమ్మార్ఎఫ్​ అని రాసుకున్నాడు. తప్పితే అది ఎమ్మార్​ఎఫ్​ బ్రాండ్ క్రికెట్ బ్యాట్ కాదన్న విషయం స్పష్టమవుతోంది.

బ్యాట్ దొంగిలించటానికే వెళ్లాడని పోలీసు అధికారులు చెప్పిన మాట నిజమే అనుకుందాం. అయితే, ఆ బ్యాట్ బయటకు తీస్తే హత్యకు పాల్పడ్డ బాలుడు దొరికిపోవటం ఖాయం. ఎందుకంటే హతురాలి ఇంటి పక్కనే సహస్ర కుటుంబం నివాసముంటోంది. సహస్ర తమ్ముడు ఆ 10వ తరగతి బాలుడితో నిత్యం క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ బ్యాట్‌ను బయటకు తీసుకొస్తే దొరికిపోతా అన్న విషయం హత్యకు తెగించిన బాలుడికి తెలియదా? అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఇది తెలిసి కూడా బ్యాట్ ఎందుకు చోరీ చేస్తాడు? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read Also- Crime News: లవ్ మ్యారేజ్ చేసుకొని.. భార్యను చంపేశాడు

ప్లానింగ్ ఇలా రాసుకున్నాడు

ఇక, హత్యకు పాల్పడ్డ బాలుడు దొంగతనం ఎలా చేయాలో ముందే కాగితంపై రాసి పెట్టుకున్నాడని పోలీసు అధికారులు చెప్పారు. ఆ కాగితాన్ని కూడా మీడియా సమావేశంలో పెట్టారు. దాంట్లో ఇంట్లోకి చొరబ్డ తరువాత గ్యాస్ మంటతో తాళాన్ని వేడి చేయాలి… ఆ తరువాత కత్తితో దానిని కట్ చేయాలి. ఆ తరువాత డబ్బు తీసుకోవాలి. అనంతరం గ్యాస్ లీక్ చేయాలి. బయటకు వచ్చి ఇంటికి తాళం వేసి వెళ్లిపోవాలి. మిషన్ డన్ అని తన ప్లానింగ్‌ను ఒక పేపర్‌పై రాసుకున్నాడు. తప్పితే ఎక్కడా క్రికెట్ బ్యాట్ దొంగిలించాలని ఆ బాలుడు రాయలేదు. అంటే, ఆ బాలుడు కేవలం క్రికెట్ బ్యాట్ కోసం ఇంట్లోకి వెళ్లలేదన్నది స్పష్టమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక, బ్యాట్ తీసుకుని బయటకు వస్తున్నపుడు చూసిన సహస్ర ఆ బాలున్ని అడ్డుకుందని అధికారులు చెప్పారు. దాంతో తన గురించి అందరికీ చెప్పేస్తుందన్న భయంతోనే హత్య చేశాడని అంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, సహస్రతో పాటు తమ్ముడితో కూడా నిందిత బాలుడికి స్నేహం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సహస్ర తనను పట్టుకున్నా కొద్దిసేపు క్రికెట్​ ఆడుకుని బ్యాట్ వెనక్కి ఇచ్చేస్తానని ఆ బాలుడు చెప్పి అక్కడి నుంచి వెళ్లి ఉండవచ్చు. అలా కాకుండా హత్యకు పాల్పడ్డాడంటే ఈ దారుణం వెనక మరేదో కారణం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, తన ఇంట్లో నుంచి 85 వేల రూపాయలు చోరీ అయ్యాయని సహస్ర తండ్రి మీడియాతో చెప్పటం. ఆ డబ్బును తాను బీరువాలో దాచి పెట్టానని వెల్లడించటం. ఈ నగదు విషయమై పోలీసు అధికారులు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ అన్ని పరిణామాలనుబట్టి సహస్ర కేసును మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడే అసలేం జరిగిందన్నది స్పష్టమవుతోందని అంటున్నారు. ఈ దిశలో అధికారులు స్పందిస్తారో? లేదో? చూడాలి.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?