Vikarabad
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Crime News: లవ్ మ్యారేజ్ చేసుకొని.. భార్యను చంపేశాడు

Crime News: కామారెడ్డి గూడెంలో దారుణ ఘటన

హంతకుడు నరేందర్ రెడ్డికి ఉరిశిక్ష విధించండి
మృతురాలి తండ్రి రాములు తీవ్ర ఆవేదన

స్వేచ్ఛ, మేడ్చల్: ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి మహిళలు వారి జీవితాలను అప్పగిస్తారు. సర్వం అతడేనని నమ్ముతారు. సుఖదుఃఖాలు, సంతోషాలన్నీ భర్తతోనే పంచుకుంటారు. కానీ, ప్రేమ, నమ్మకం అనే భావాల పట్ల సమాజంలో అనుమానాలు కలిగించే ఘటనలు ఎన్నో వెలుగుచూస్తున్నాయి. నమ్మి జీవితాన్ని అప్పగించిన మహిళలు ఎందరో భర్తల చేతుల్లో హింసకు (Crime News) గురవుతున్నారు. కట్టుకున్నవాడి చేతుల్లోనే హింసకు గురవుతుండడం దారుణం. ఇటీవల వికారాబాద్ జిల్లాలో మానవత్వానికే మచ్చలాంటి ఘటన జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే.. తన భార్యను అత్యంత పాశవికంగా హత్య చేశాడు.

Read Also- Nandamuri Balakrishna: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో బాలయ్యకు చోటు.. ఎందుకంటే?

వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడేనికి చెందిన స్వాతిని ఆమె భర్త సామల మహేందర్ రెడ్డి హత్య చేశాడు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి బోట్కు రాములు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారని, పెద్దకూతురు స్వాతి, రెండవ కూతురు శ్వేత, కుమారుడు ప్రశాంత్ సంతానం అని తెలిపారు. ఊరిలో అవారాగా తిరిగే సామల మహేందర్ రెడ్డి ప్రేమ పేరుతో పెద్దకూతురు స్వాతిని గత సంవత్సరం 2024 జనవరి నెలలో పెళ్లి చేసుకున్నాడని, ఆ తర్వాత ఊరువిడిచి వెళ్లిపోయారని రాములు చెప్పారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో తిరిగి ఊరికి వచ్చారని, అప్పటినుంచి భర్త, అత్తమామలు వేధించేవారని వివరించారు.

Read Also- Telangana: నీటి వనరుల పరిరక్షణలో రోల్ మోడల్ గా తెలంగాణ.. మంత్రి శ్రీధర్ బాబు

గతంలో కూడా హత్య ప్రయత్నాలు చేశాడని రాములు వెల్లడించారు. గతంలో మూడు నెలల గర్భం సమయంలో అబార్షన్ చేయించారని, ఇప్పుడు మళ్లీ 5 నెలల కడుపుతో ఉందని ఆనందించే లోపే చంపేశాడని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘అత్తగారింట్లో సుఖం ఉండదు, నిన్ను బతకనివ్వరు వచ్చేయమ్మ అని ఎన్ని సార్లు చెప్పాం. కానీ, చావైనా, బతుకైనా ఇక్కడే. కానీ నేను ఇంటికి రాను’’ అని స్వాతి చెప్పిందన్నారు. అనుకున్నట్టే తన కూతుర్ని మహేందర్ రెడ్డి హత్య చేశాడని, నిందితున్ని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. తల, కాళ్ల, చేతులను మొండెం నుంచి వేరు చేసి మూసి నదిలో పడవేశాడని చెప్పారు. భయపడి మొండాన్ని ఇంట్లోనే వదిలేశాడని, అవయవాలను మూసిలో పడవేసిన ప్రాంతంలో పోలీసులు గాలించిన ఏమీ లభ్యం కాలేదని ఆయన వాపోయారు. నిందితుడు సామల మహేందర్ రెడ్డిని ఉరి తీయాలని తండ్రి రాములు డిమాండ్ చేశారు. తాము అల్లారు ముద్దుగా పెంచుకున్న పెద్దకూతుర్ని అతి కిరాతంగా మూడు ముక్కలు చేసి చంపినవాడిని వదిలిపెట్టొద్దని వేడుకున్నారు.

గొంతుకోసి..

గర్భిణి అన్న జాలి కూడా లేకుండా నమ్మి తాళి కట్టించుకున్న భార్యను గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి శరీర భాగాలను ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి మూసీలోకి విసిరేశాడు. ఆ తరువాత ఏమీ ఎరగనట్టు బంధువుతో కలిసి స్టేషన్‌కు వచ్చి భార్య కనిపించటం లేదంటూ ఫిర్యాదు చేశాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. సంచలనం సృష్టించిన ఈ కిరాతకం మేడిపల్లి పోలీస్​ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ఏసీపీ చక్రపాణితో కలిసి ఆదివారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఇద్దరిది ఒకే ఊరు…
వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడ గ్రామ వాస్తవ్యుడు సామల మహేందర్ రెడ్డి (27). స్వాతి ఎలియాస్ జ్యోతి (21)ది అదే గ్రామం. ఇరుగుపొరుగునే ఇండ్లు ఉండటంతో ఇద్దరి మధ్య పరిచయం ఉంది. స్వాతిని ఇష్టపడ్డ మహేందర్​ రెడ్డి అదే విషయాన్ని ఆమెతో చెప్పాడు. ప్రేమిస్తున్నాను…పెళ్లి చేసుకుందామన్నాడు. మొదట్లో ఇరువైపులా పెద్దలు వీరి వివాహానికి అంగీకరించ లేదు. అయితే, ఒకరిని విడిచి మరొకరం ఉండలేమని మహేందర్​ రెడ్డి, స్వాతి మొండి పట్టు పట్టటంతో చివరకు ఒప్పుకొన్న పెద్దలు 2024, జనవరి 20న కూకట్ పల్లి ఆర్య సమాజ్ లో ఇద్దరికి వివాహం జరిపించారు. ఆ తరువాత బోడుప్పల్ ఈస్ట్ బాలాజీహిల్స్ ప్రాంతంలోని శ్రీనివాస్​ నగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. స్వాతి పంజగుట్టలోని ఎబెక్స్ కాల్ సెంటర్ లో ఉద్యోగంలో చేరగా మహేందర్ రెడ్డి ర్యాపిడో డ్రైవర్ గా పని చేయటం ప్రారంభించాడు.

పెళ్లయిన నెల రోజుల నుంచే..
వివాహమైన తరువాత మొదటి నెల వీరి కాపురం ఆనందంగానే సాగింది. కాగా, స్వాతి కాల్ సెంటర్ లో ఉద్యోగం చేస్తుండటం…తరచూ ఫోన్లు మాట్లాడుతుండటంతో మహేందర్ రెడ్డిలో అనుమాన బీజాలను నాటాయి. ఈ క్రమంలో ఆమెను అనుమానించటం మొదలు పెట్టిన మహేందర్ రెడ్డి చిన్న చిన్న విషయాలపై కూడా స్వాతితో గొడవలు పెట్టుకోవటం ప్రారంభించాడు. స్వాతితో ఉద్యోగం కూడా మానిపించేశాడు. ఆ తరువాత భార్యను తీసుకుని ఊరికి వెళ్లిపోయాడు. అక్కడ కూడా స్వాతితో గొడవలు పడటాన్ని కొనసాగించాడు. నానాటికీ మహేందర్ రెడ్డి వేధింపులు ఎక్కువ అయిపోవటంతో భరించలేక పోయిన స్వాతి పెళ్లయిన మూడు నెలలకే వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్​ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసులు కూడా నమోదయ్యాయి. అయితే, గ్రామ పెద్దలు పంచాయితీ జరిపి ఇద్దరికి నచ్చజెప్పారు. దాంతో వివాదం సద్దుమణిగింది. ఆ తరువాత రెండు నెలలకు మళ్లీ శ్రీనివాస్ నగర్ కు వచ్చి అంతకు ముందు ఉన్న ఇంట్లోనే అద్దెకు దిగాడు. ఇటువంటి పరిస్థితుల్లోనే స్వాతి మార్చి నెలలో గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె అయిదు నెలల గర్భిణి. అయితే, భార్య గర్భం దాల్చిన తరువాత మహేందర్ రెడ్డిలో అనుమానం పెరిగి పెద్దదై పెనుభూతంలా మారింది. కాగా, శుక్రవారం స్వాతి తాను ఈనెల 27న ఊరికి వెళతానని మహేందర్ రెడ్డితో చెప్పింది. వైద్య పరీక్షలు చేయించుకున్న తరువాత పుట్టింటికి పోతానని తెలిపింది. దీనికి మహేందర్ రెడ్డి అంగీకరించ లేదు. దాంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. అప్పుడే మహేందర్ రెడ్డి ఎలాగైనా సరే స్వాతిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

రంపం కొని…
దీని కోసం రూపొందించుకున్న పథకం ప్రకారం మహేందర్ రెడ్డి బోడుప్పల్ లోని ఓ షాపు నుంచి గ్రిప్​ హాక్‌సా బ్లేడ్​ (రంపం) కొని తెచ్చి ఇంట్లో పెట్టాడు. శనివారం ఇంటి యజమాని కుటుంబం బయటకు వెళ్లటంతో అదే అదునుగా భావించి స్వాతిని గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తరువాత తల, చేతులు, కాళ్లను ముక్కలు ముక్కలుగా నరికేశాడు. వాటిని ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి ప్రతాప సింగారం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నదిలోకి విసిరేశాడు. ఛాతీ భాగాన్ని ఏం చేయాలో అర్థంగాక ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఆ తరువాత బంధువుతో కలిసి ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి తన భార్యకనిపించటం లేదంటూ ఫిర్యాదు చేశాడు. అయితే, శ్రీనివాస్ నగర్ మేడిపల్లి స్టేషన్ పరిధిలో ఉండటంతో అక్కడ కంప్లయింట్ ఇవ్వాలని ఉప్పల్ పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో మహేందర్ రెడ్డి బంధువుతో కలిసి మేడిపల్లి స్టేషన్ కు వెళ్లాడు. అయితే, మహేందర్ రెడ్డి వాలకంపై అనుమానం వచ్చిన మేడపల్లి సీఐ గోవింద రెడ్డి, ఎస్​ఐ నర్సింగ్ రావులు నిశితంగా ప్రశ్నించగా మహేందర్ రెడ్డి చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఈ క్రమంలో పోలీసులు అతని ఇంటి నుంచి స్వాతి మృతదేహంలోని ఛాతీ భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూసీలోకి విసిరేసిన మిగతా శరీర అవయవాల కోసం గాలింపు జరిపినా దొరకలేదు. గాలింపును కొనసాగిస్తామని డీసీపీ పద్మజ చెప్పారు. కేసులో మరిన్ని ఆధారాలు సేకరించాల్సి ఉన్నందున విచారణను కొనసాగించనున్నట్టు తెలిపారు.

 

 

 

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?