RMPs: గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించాలి
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్ఎంపీల సమరం
గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిట్టల నాగేశ్వరావు
కారేపల్లి, స్వేచ్ఛ: గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం (RMPs) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిట్టల నాగేశ్వరావు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల కేంద్రంలో ఆదివారం ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి అనంతారపు వెంకటాచారితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో వైయస్రా జశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ వైద్యులకు ప్రభుత్వ ఆసుపత్రులలో 1,000 గంటలు శిక్షణ ఇప్పించారని, కానీ, శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు జారీ చేయలేదన్నారు.
Read Also- Maoist Dump: కూంబింగ్ ముగించుకొని వెళ్తున్న బలగాల కంటపడ్డ ఆయుధ డంప్
వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామీణ వైద్యులను పారా మెడికల్ బోర్డు కింద తీసుకొని శిక్షణ ఇచ్చేందుకు ప్రతి ఒక్కరి నుంచి రూ.200 డీడీ కట్టించుకున్నారని గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది గ్రామీణ వైద్యులు ఉన్నట్లు పేర్కొన్నారు. అనునిత్యం గ్రామీణ ప్రాంతాలలో అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవ అందిస్తున్న గ్రామీణ వైద్యులకు రక్షణ కరువైందని పిట్టల నాగేశ్వరావు వాపోయారు. దశాబ్దాల కాలంగా మారుమూల గ్రామాలలో ప్రజలతో మమేకమైన, అనుభవజ్ఞులైన గ్రామీణ వైద్యులు ప్రాథమిక వైద్యం అందిస్తున్నారన్నారు. గ్రామీణ వైద్యులు సకాలంలో స్పందించి అత్యవసర వైద్యం అవసరం ఉన్న వారిని సమీప పట్టణాల్లో గల ప్రధాన ఆసుపత్రులకు (అర్హత కలిగిన వైద్యుల వద్దకు) తరలించి అనేకమంది ప్రాణాలను కాపాడగలుగుతున్నారని ప్రస్తావించారు. కొంతమంది వేధింపుల కారణంగా గ్రామాలలో ఆర్ఎంపీలు ప్రాథమిక వైద్యం చేయడానికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also- Nandamuri Balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బాలయ్యకు చోటు.. ఎందుకంటే?
ప్రభుత్వ నియమ, నిబంధనలు పాటిస్తూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీలు స్థానిక ప్రజల మన్ననలు పొందుతున్నారని పిట్టల నాగేశ్వరావు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీలకు రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు చట్టబద్ధత కల్పించాలనే అంశంపై ఇటీవల హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల గ్రామీణ వైద్యుల సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. మరికొద్ది రోజుల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు గ్రామీణ ప్రాంతాలలో ఆర్ఎంపీలు అందిస్తున్న ప్రాథమిక సేవలపై కనువిప్పు కల్పించేందుకు ధర్నా చేసేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఆర్ఎంపీలు లేకుంటే గ్రామాలలో ప్రజలు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడతారని గ్రామీణ వైద్యులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ వైద్యుల సేవలను గుర్తించి స్థానికంగా వారికి ఎటువంటి హాని కలగకుండా రక్షణ కల్పించాలని కోరారు.అదేవిధంగా గ్రామీణ వైద్యులు తమ అర్హతకు మించి వైద్యం చేయరాదని సూచించారు.
Read Also- Charla mandal: భద్రాద్రి జిల్లాలో దారుణం.. గిరిజన యువతిపై ఆటో డ్రైవర్ల..