KCR: హైదరాబాద్ కు బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) మకాం మార్చబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఎర్రవెల్లి ఏ విధంగా చూసినా కలిసి రావడం లేదని, అందుకే నందినగర్ నివాసానికి రావాలని భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ నేతలకు అందుబాటులో ఉండటంతో ఆరోగ్య సమస్యలు ఏవైనా తలెత్తినా ఆసుపత్రులకు సమీపంలో ఉంటుందని, పార్టీ భవిష్యత్ కార్యచరణలు రూపొందించడంతో పాటు ఎప్పటికప్పుడు రాష్ట్ర, దేశ రాజకీయాలను సైతం విశ్లేషించేందుకు అనువుగా ఉంటుందని అందుకే మకాం మార్చేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీ సీనియర్ నేత హరీష్ రావు(Harish Rao) సైతం జూబ్లీహిల్స్ కు షిఫ్టు కావాలని భావిస్తున్నారనే సమాచారం.
ఎర్రవెల్లి నుంచి సక్సెస్ కావడం లేదా
బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన మరుక్షణమే మాజీ సీఎం, గులాబీ అధినేత మకాంను ఎర్రవెల్లిలోని తననివాసానికి వెళ్లిపోయారు. అక్కడి నుంచే పార్టీకి ప్రణాళికలు రూపొందించడంతో పాటు నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు రాజకీయ పరిస్థితులపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఎర్రవెల్లి నుంచి చేపట్టే కార్యక్రమాలు అంతగా సక్సెస్ కావడం లేదనే ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లినా ఆశించిన ఫలితాలు రాలేదని, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఊహకందని ఫలితాలు రావడంతో కొంత నిరాశకు కేసీఆర్(KCR) గురైనట్లు సమాచారం. ఇదే అంశంపై నేతలతో చర్చించినట్లు సమాచారం. నేతలకు సైతం ఎర్రవెల్లికి రాకపోకలకు ఇబ్బందులకు గురవుతున్నట్లు కేసీఆర్ భావించినట్లు సమాచారం. మరోవైపు ఆరోగ్య సమస్యలు సైతం తరచూ వేధిస్తుండటంతో ఆసుపత్రులకు అయితే నందినగర్ సమీపంలో ఉంటుందని అందుకే హైదరాబాద్ కు రావాలని సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
పార్టీలో పరిణామాలు
అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నందినగర్, ప్రగతి భవన్(Pragathi Bhavan) నుంచి తీసుకున్న నిర్ణయాలు, ప్రతీ కార్యక్రమం విజయవంతం అయింది. ప్రజల్లోకి వెళ్లింది. అంతేకాదు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించింది. అయితే సెంటిమెంట్ గా భావించి హైదరాబాద్ కు రావాలని సన్నద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీలో ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు, కేటీఆర్-కవిత మధ్య గ్యాప్ ఏర్పడటంతో సమీపంలో ఉంటే అన్నింటికి చెక్ పెట్టొచ్చని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. తాజా రాజకీయాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పార్టీ నేతలను సైతం అలర్టు చేయవచ్చని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
Also Read: Medaram Jathara: మేడారం జాతరకు భారీ బడ్జెట్..150 కోట్లు కేటాయించిన సర్కార్
విద్యార్థి సంఘాలతో
ఇప్పటికే కేటీఆర్(KTR) తెలంగాణ భవన్ కన్నా నందినగర్ లోని ఇంటిల్లోనే పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. రాజకీయ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. చేరికలు, వివిధ సంఘాలతో భేటీలు, విద్యార్థి సంఘాలతోనే సమావేశాలు నిర్వహిస్తూ వారికి మార్గనిర్దేశం చేస్తున్నారు. ఆయన నార్సింగ్ లో నివాసం ఉంటున్నప్పటికీ సమయం అంతా నందినగర్ లో నే ఉంటున్నారు. పార్టీ కార్యాలయం సమీపంలోనే ఉన్నప్పటికీ ఏదైనా మేజర్ ప్రోగ్రాం అయితేనే భవన్ కు కేటీఆర్ వస్తున్నారు. ఈ కార్యక్రమం ముగియగానే తిరిగి నందినగర్ కు వెళ్తున్నారు.
రాజకీయ పరిణామాలపై
మరోవైపు హరీష్ రావు సైతం కోకాపేట నివాసం నుంచి జూబ్లీహిల్స్ కు షిఫ్టు కానున్నట్లు సమాచారం. త్వరలో జరుగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-election)లతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు సైతం రాబోతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కేడర్ కు అందుబాటులో ఉండేందుకు మకాం మార్చాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అదే విధంగా కేసీఆర్(KCR) కు దగ్గర ఉంటే పార్టీ సమీక్షలు సైతం చేయవచ్చని భావిస్తున్నట్లు తెలిసింది. రాజకీయ పరిణామాలపై సైతం ఎప్పటికప్పుడు అధినేత సూచనల మేరకు ముందుకు సాగవచ్చని పార్టీని బలోపేతం చేయవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ పార్టీ నేతలు, కేడర్ కు అందుబాటులో ఉండేందుకు నేతలంతా భవన్ కు సమీపంలో నివాసం ఉండేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
పార్టీ నేతలతో భేటీ
ఇప్పటికే కేసీఆర్ పార్టీ నేతలకు అందుబాటులో ఉండరనే ప్రచారం జరుగుతుంది. దానికి సైతం చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు. అంతేగాకుండా ప్రతి వారంలో రెండ్రోజులపాటు కేసీఆర్ భవన్ కు వస్తే పార్టీ నేతలతో భేటీ అయి వారితో పీడ్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉందని, క్షేత్రస్థాయిలో పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చని భావిస్తున్నట్లు నేతలు అభిప్రాయపడుతున్నారు. రాబోయే ఎన్నికలకు ఇది దోహదపడనుందని, విజయం సాధించి అధికారంలోకి వచ్చేందుకు సైతం సులువు అవుతుందని పలువురు పేర్కొంటుంది. అయితే కేసీఆర్ హైదరాబాద్ కు ఎప్పుడు మకాం మారుస్తారనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదని, త్వరలోనే అంటూ ప్రచారం జరుగుతుంది.
Also Read: Madharaasi film: శివ కార్తికేయన్ ‘మదరాసి’ ట్రైలర్ ఎప్పుడంటే?