సినిమా: బన్ బట్టర్ జామ్ (Bun Butter Jam)
విడుదల తేది: 22-08-2025
నటీనటులు: రాజు జయమోహన్, ఆధ్య ప్రసాద్, భవ్య త్రిఖ, చార్లి, శరణ్య పొన్‌వన్నన్, దేవదర్శిని, మైకేల్ తంగదురై, విజె పప్పు తదితరులు
సంగీతం: నివాస్ కె ప్రసన్న
సినిమాటోగ్రఫీ: బాబు కుమార్
ఎడిటింగ్: జాన్ అబ్రహం
నిర్మాత (తెలుగు రిలీజ్): సిహెచ్ సతీష్ కుమార్
రచన-దర్శకత్వం: రాఘవ్ మిర్‌దత్
Bun Butter Jam Review: ఈ మధ్య ఇతర భాషల చిత్రాలు టాలీవుడ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేస్తున్నారు. అలా వచ్చిన ‘మహావతార్ నరసింహా’ చిత్రం రికార్డుల మోత మోగిస్తుంది. ఇప్పుడదే జాబితాలో.. గత నెలలో తమిళ్‌లో విడుదలైన ‘బన్ బట్టర్ జామ్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు శ్రీ విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మాత సిహెచ్ సతీష్ కుమార్ తీసుకొచ్చారు. శుక్రవారం (ఆగస్ట్ 22) థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంత వరకు ఎంగేజ్ చేస్తుంది? అసలు ఈ సినిమాలో ఉన్న విషయం ఏమిటనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ
లలిత (శరణ్య), ఉమ (దేవదర్శిని) ఇరుగుపొరుగున ఉండే గృహిణులు. ప్రేమ, డేటింగ్ వంటి వాటికి దూరంగా ఉంటూ తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని భావిస్తారు. అందుకోసం తమ పిల్లలైన చంద్రు (రాజు జయమోహన్), మధుమిత (ఆధ్య ప్రసాద్)ల మధ్య ప్రేమను పుట్టించేందుకు ఒక ప్లాన్ వేస్తారు. చంద్రు, మధుమితల మధ్య ప్రేమ ఏర్పడేలా చేసి, లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలనేది వారి ప్లాన్. కానీ, వాళ్ల ప్లాన్ ప్రకారం కాకుండా చంద్రు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ నందిని (భవ్య త్రిఖా)తో ప్రేమలో పడతాడు. అదే సమయంలో మధుమిత కూడా ఆకాష్(వీజే పప్పు)తో ప్రేమలో ఉంటుంది. మధుమిత, ఆకాష్ కలిసి ఉన్నప్పుడు చంద్రు చూస్తాడు. అలాగే చంద్రు ప్రేమ వ్యవహారం మధుమితకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పిల్లలు, తల్లుల మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? ఫైనల్‌గా చంద్రు, మధుమితలకు పెళ్లి అయిందా? వారి ప్రేమలు ఏమయ్యాయి? వంటి ప్రశ్నలతో ఎమోషన్స్ ప్లస్ కామెడీతో సాగే కథే ఈ సినిమా.
Also Read- Raveena Tandon Daughter: రవీనా టాండన్ కుమార్తె రాషా టాలీవుడ్ ఎంట్రీ ఖరారు.. హీరో ఎవరో తెలుసా?
నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:
చంద్రు పాత్రలో రాజు జయమోహన్ చాలా సహజంగా కనిపించాడు. ఇప్పటి కుర్రాళ్లను అతడిలో చూసుకోవచ్చు. అలాగే కుర్రాళ్లంతా అతని పాత్రకు బాగా కనెక్ట్ అవుతారు. అమాయకంగా కనిపిస్తూ.. తనదైన నటనతో మెప్పించాడు. ఈ కథకి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు. చంద్రు పాత్రలానే మధుమిత పాత్రలో నటించిన ఆధ్య కూడా చాలా సహజంగా నటించింది. పాత్రకు 100 శాతం న్యాయం చేసింది. నందినిగా భవ్య త్రిఖా రొమాంటిక్ రోల్ తీసుకుంది. కుర్రాళ్లకు బాగా నచ్చేస్తుంది. వీజే పప్పు పాత్ర ఓకే. హీరోహీరోయిన్ తల్లులుగా నటించిన శరణ్య, దేవదర్శిని పోటాపోటీగా నటించారు. వారి పాత్రలు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ఎమోషన్స్ పండిస్తాయి. మిగతా పాత్రలలో నటించిన వారంతే వారి పాత్రల పరిధిమేర నటించి మెప్పించారు.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. సినిమా గ్రాఫ్ డౌన్ అవుతున్న ప్రతిసారి సంగీత దర్శకుడు నివాస్ కె ప్రసన్న నిలబెట్టేశాడు. నేపథ్య సంగీతం చాలా బాగా కుదిరింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాకు సంగీతంతో ప్రాణం పోశాడు. ఎడిటింగ్ పరంగా కొన్ని సీన్లకు కత్తెర పడొచ్చు. ముఖ్యంగా సెకండాఫ్‌లోని కొన్ని అనవసర సీన్లు.. సినిమా ఫ్లోకు పంటికింద రాయిలా అడ్డుపడతాయి. విజువల్స్ పరంగా కథకి ఏమేం కావాలో అవన్నీ సమకూర్చారు. అక్కడక్కడ డబ్బింగ్ తేలిపోయినట్లు అనిపించింది. దర్శకుడు రాఘవ యూత్‌ని టార్గెట్ చేసుకుని రాసుకున్న ఈ కథ వారికి బాగానే కనెన్ట్ అవుతుంది. ముఖ్యంగా ప్రేమ, బ్రేకప్‌ల విషయంలో ఆయన ఇచ్చిన సందేశం బాగుంది కానీ, దానిని ఆచరించే వారు ఎప్పుడెవరు ఉన్నారని అనిపిస్తుంది. డైలాగ్స్ బాగా పండాయి. ఇంకా ఇతర సాంకేతిక నిపుణులు తమ ప్రతిభాను కనబరిచారు.
Also Read- Chiru Odela: ఎన్ని టీజర్స్ వస్తే ఏంటి.. ఒక్క ట్వీట్‌తో మెగా ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేశాడుగా!
విశ్లేషణ:
ప్రేమలో ఫెయిల్ అయితే బాధపడుతూ దేవదాసులా మారిపోయి అక్కడే ఆగిపోవడం కాకుండా.. ముందుకు సాగిపోవాలి, జీవితంలో ఏదైనా సాధించాలని ప్రాక్టికల్ చెప్పడం ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. దీనికి ట్రెండీ డైలాగులు, రొమాంటిక్ సీన్లు జోడించి.. యూత్‌ని టార్గెట్ చేయడమే కాకుండా, ఫ్యామిలీ టచ్ ఇవ్వడం కూడా బాగుంది. సినిమా స్టార్టింగ్‌లో వచ్చే కొన్ని అడల్ట్ సీన్లు తప్పితే.. మిగతా అంతా పిల్లలతో కలిసే ఎంజాయ్ చేసే సినిమా ఇది. ముఖ్యంగా నేటి యువత తీరుకి ప్రతిబింబం అన్నట్లుగా డేరింగ్‌గా దర్శకుడు కొన్ని సీన్లను చూపించినందుకు, అతనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. తల్లులు ఏదయితే జరగకూడదని అనుకుంటారో అదే వారి పిల్లల లైఫ్‌లో జరగడం, చివరికి త్యాగం చేయడం వంటి సీన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి. అయితే ఫస్టాప్ ఎంత హిలేరియస్‌గా ఉంటుందో, సెకండాఫ్ అంత సాగదీతగా అనిపిస్తుంది. (Bun Butter Jam Review)
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
బోల్డ్ సీన్లు, యూత్‌ని ఆకట్టుకునే సీన్లకు ఇందులో కొదవలేదు. అలాగే, బీచ్ సమీపంలో ప్రేమించుకునే సీన్లు, కాలేజీలో సీన్లు కొన్ని హిలేరియస్‌గా ఎంటర్‌టైన్ చేస్తాయి. పెళ్లికి ముందు ఎన్నో ప్రేమకథలు ఉంటాయి. కానీ పెళ్లి తర్వాత వాటిని వదలేసి, కొత్త జీవితం మొదలెట్టాలనే మెసేజ్ ఇందులో చెప్పిన తీరు బాగుంది. సెకండాఫ్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే, ఈ సినిమా ఓ రేంజ్‌లో ఉండేది. ఫైనల్‌గా ‘బన్ బట్టర్ జామ్’ ఒక యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్. కొత్త తరహా లవ్ స్టోరీలను, కామెడీని ఇష్టపడే యువతకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. కథలో కొత్తదనం లేకపోయినా, నటీనటుల పర్ఫామెన్స్, సంగీతం, కొన్ని కామెడీ సన్నివేశాలు సినిమాను నిలబెట్టాయి. ఒకసారి చూసేందుకు ఫర్వాలేదనిపించే సినిమా ఇది.